విశాఖ జోలికి రాకండి…మీకో పెద్ద దండం…

విశాఖ మెగా సిటీ. అభివృద్ధికి అవకాశం ఉన్న నగరం. అటువంటి సిటీ మీద రాజకీయ క్రీనీడలు కమ్ముకుని కువిమర్శలు చేయిస్తున్నాయి. ఇపుడు రాష్ట్రంలో విశాఖను అభివృద్ధి చేద్దామని వైసీపీ సర్కార్ భావిస్తోంది. విశాఖను రాజధానిగా…

విశాఖ మెగా సిటీ. అభివృద్ధికి అవకాశం ఉన్న నగరం. అటువంటి సిటీ మీద రాజకీయ క్రీనీడలు కమ్ముకుని కువిమర్శలు చేయిస్తున్నాయి. ఇపుడు రాష్ట్రంలో విశాఖను అభివృద్ధి చేద్దామని వైసీపీ సర్కార్ భావిస్తోంది. విశాఖను రాజధానిగా కూడా చేయాలని సంకల్పించింది. ఆ సమయంలో రాజకీయ కారణాలతో ఒక వర్గం మీడియా అయితే విశాఖ మీద చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు.

విశాఖకు సునామీ ముప్పు ఉందని, విశాఖ సిటీ పూర్తిగా మునిగిపోతుందని ఏవేవో రాసిపారేశారు. అంతకు ముందు విశాఖలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ అయిన ఘటన జరిగితే విశాఖలో ఇక మనుషులు జీవించలేరని కూడా రాశారు. ఇవన్నీ కూడా చెడు ప్రభావం చూపిస్తాయన్న ఇంగితాన్ని మరచిపోయారు.

అలాంటి వారికి మంత్రి గుడివాడ అమరనాధ్ రెండు చేతులు జోడించి ఒక పెద్ద దండమే పెట్టేశారు. తాను దావోస్ టూర్ లో ఉన్నపుడు ఒక పారిశ్రామిక ప్రతినిధి నుంచి వచ్చిన ప్రశ్న ఏంటి అంటే విశాఖ‌ మునిగిపోతుందటగా అని. దాంతో తాను ఖిన్నుడిని అయ్యాను అని గుడివాడ అన్నారు. అలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని చెప్పి విశాఖ సామర్ధ్యాన్ని సత్తాను ఆయనకు వివరించానని గుడివాడ చెప్పారు.

విశాఖ వంటి అగ్రశ్రేణి నగరం మీద విషం చిమ్మాలని కొన్ని పత్రికలు, చానళ్ళు చేసిన కుటిల ప్రయత్నం ఫలితమే దావోస్ లో అలాంటి ప్రశ్న వచ్చిందని ఆయన అంటున్నారు. విశాఖను బాగు చేయాలని తమ ప్రభుత్వం తపన పడుతోందని, దావోస్ పర్యటన ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు విశాఖకు వచ్చాయని ఆయన చెప్పారు. విశాఖకు వేయి కోట్ల పెట్టుబడితో ఆదిత్య మిట్టల్ కంపెనీ  రాబోతోంది అని ఆయన తెలియచేశారు.

అలాగే అనేక కీలకమైన ఒప్పందాలు కూదా కుదిరాయని విశాఖ కేంద్రంగా యూనీకార్న్ హ‌బ్ ఏర్పాటు దిశ‌గా తాము చేప‌ట్టిన చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలు ఇచ్చాయ‌ని మంత్రి పేర్కొన్నారు. క‌ర్నూలు గ్రీన్ కో ఎనర్జీ ప్లాంట్ మాదిరే రాష్ట్రంలోని మ‌రో 29 ప్రాంతాల్లో ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. రానున్న రోజులలో ఒక్క ఏపీ నుంచే 30 వేల‌కు పైగా మెగావాట్ల గ్రీన్ ఎన‌ర్జీ ఉత్ప‌త్తి అవుతుందని తెలిపారు.

మొత్తం మీద చూస్తే గుడివాడ ఒకే మాట అంటున్నారు. తాను పుట్టిన విశాఖను కానీ తమ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ కేవలం సంకుచిత రాజకీయాలతో చెడు ప్రచారం చేయవద్దని వేడుకుంటున్నట్లుగా చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో రాజకీయాలను విడిచి అంతా ఒక్కటి కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. 

మరి ఇది పక్షపాతంతో రాతలు రాస్తున్న కొన్ని రకాలైన పత్రికలకు టీడీపీ అనుకూల మీడియా చెవిన ఈ  మాట పడుతుందా. పెద్ద డౌటే ఇది.