యాత్ర-2లో చంద్రబాబు ఎవరో తెలుసా?

ఏపీ రాజకీయాలపై సినిమా తీస్తూ చంద్రబాబు పాత్ర లేకుండా తీస్తారా? అసలు అలా తీయడం సాధ్యమా? యాత్ర-2పై కూడా ఇవే అనుమానాలు వ్యక్తం చేశారు చాలామంది. ఇన్నాళ్లూ వైఎస్ఆర్, జగన్ పాత్రల చుట్టూనే సినిమా…

ఏపీ రాజకీయాలపై సినిమా తీస్తూ చంద్రబాబు పాత్ర లేకుండా తీస్తారా? అసలు అలా తీయడం సాధ్యమా? యాత్ర-2పై కూడా ఇవే అనుమానాలు వ్యక్తం చేశారు చాలామంది. ఇన్నాళ్లూ వైఎస్ఆర్, జగన్ పాత్రల చుట్టూనే సినిమా తీశారు.. ప్రచారం కూడా వాళ్ల పాత్రల చుట్టూనే తిరిగింది.

ఇన్నాళ్లకు ఈ సినిమాలో చంద్రబాబు పాత్రధారి ఎవరనేది తెలిసింది. యాత్ర-2లో కీలకమైన చంద్రబాబు పాత్ర కోసం బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ ను తీసుకున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారట.

తెలుగు ఆడియన్స్ కు మహేష్ మంజ్రేకర్ కొత్త కాదు. అదుర్స్, సాహో లాంటి చాలా సినిమాల్లో నటించాడు. ఇతడిలో చంద్రబాబు ఛాయలు చూశాడు దర్శకుడు మహి వి.రాఘవ్. యాత్ర-2లో చంద్రబాబు గెటప్ లో మహేష్ మంజ్రేకర్ ఎలా కనిపిస్తారనే క్యూరియాసిటీ ఇప్పుడు అందర్లో పెరిగింది.

వెండితెరపై చంద్రబాబు పాత్రను ఇప్పటికే ప్రవేశపెట్టాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తను తీసిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాల్లో అచ్చం చంద్రబాబును పోలిన పాత్రను ప్రవేశపెట్టాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న వ్యూహంలో కూడా చంద్రబాబును చూపిస్తున్నాడు.

ఇప్పటికే మహి వి రాఘవ్ తీస్తున్న యాత్ర-2లో జగన్ పాత్రకు, వ్యూహం సినిమాలో జగన్ పాత్రకు పోలికలు పెడుతూ చాలా విశ్లేషణలు పుట్టుకొచ్చాయి. జీవా, అజ్మల్ లో ఎవరు జగన్ పోలికలకు దగ్గరగా ఉన్నారో చెబుతూ చాలా కామెంట్స్ పడుతున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి త్వరలోనే చంద్రబాబు పాత్రధారి కూడా చేరబోతున్నాడన్నమాట.

తండ్రి వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, వాటిని అధిగమించి ఆయన ఎలా ముఖ్యమంత్రి అయ్యారనే కోణంలో యాత్ర-2 సినిమా తెరకెక్కుతోంది. 2009 నుంచి 2019 మధ్య జరిగిన రాజకీయ ఘటనల్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు.