నోరా వీపు కు తేకే అన్నది సామెత. తమలపాకుతో నువ్వొకటి అంటే తలుపుచెక్కతో నేనొకటి ఇచ్చుకుంటా అన్నది నానుడి. మేజర్ సినిమా నిర్మాతలు, సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వాముల పరిస్థితి అలాగే వుంది.
ఆ యొక్క ట్విట్టర్ వుంది కదా అని తమ చిత్తానికి అందులో రెచ్చిపోతే నెటిజన్లు ఊరుకోరు…వాళ్లు రివర్స్ కావడం ప్రారంభిస్తే, ఎందుకొచ్చిన ఫాలోవర్లు రా బాబూ అనిపిస్తుంది. అప్పుడు ఏదో ఒక కుంటి సాకు చెప్పి, ఎవర్నో ఒకర్ని బలిచేయాల్సి వుంటుంది. అద్దాల గదిలో కూర్చుని ఎదుటవాళ్ల మీద రాళ్లేయకూడదని ఎప్పుడు తెలుసుకుంటారో వీళ్లు.
ఎక్కడో ఆంధ్ర పల్లెటూరులో చదువుకుంటున్న పేద పిల్లల మీద క్రూడ్ జోక్ లు వేసారు మహేష్ భాగస్వాములు అయిన మేజర్ నిర్మాతలు. దాంతో మామూలుగా విరుచుకుపడలేదు సోషల్ మీడియాలో. దాంతో ఇదంతా ఓ స్టాఫ్ తప్పిదం అని తప్పించుకునే ప్రయత్నం చేసారు. ఆ పోస్ట్ డిలీట్ చేసారు. అయినా ట్విట్టర్ జనాలు ఊరుకోలేదు. ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. వందలాది ట్వీట్ లు.
పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు డింకీలు కొట్టినా, పబ్ లకు వెళ్లి దొరకిపోయినా, ట్వీట్ వేసే ధైర్యం లేదు కానీ ఓ అమాయకపు పల్లెటూరి పిల్ల మీద ప్రతాపం చూపిస్తారా అంటూ గట్టిగా వేసుకుంటున్నారు. హైదరాబాద్ లో కూర్చుని, సినిమాలు తీసుకుంటూ, ఆంధ్రలో పల్లెటూరు పిల్ల మీద పడతారా? అంటూ గట్టిగా తగులుకున్నారు.
ఇలాంటి వాళ్లతో సూపర్ స్టార్ మహేష్ కు భాగస్వామ్యమా? అంటూ కామెంట్ చేస్తున్నారు. మహేష్ బాబు అందరితో ఒకే విధంగా వుంటూ, ఎటూ మొగ్గకుండా వున్నారు. కానీ ఆయన భాగస్వాములు మాత్రం ఇలా బిహేవ్ చేస్తూ రచ్చకెక్కుతున్నారు.