భారత మహిళా క్రికెట్‌కు గుర్తింపు తెచ్చిన కెప్టెన్ మిథాలీరాజ్ ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. జీవితంలో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. తనపై ఎప్పటికీ ప్రేమ కురిపిస్తూ వుండాలని ఆమె ఆకాంక్షించారు.
భారత మహిళా క్రికెట్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్న తెలిపారు. 2019లో టీ20 క్రికెట్‌కు మిథాలీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తన సుదీర్ఘ క్రీడా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
1999లో క్రికెట్లో ఆమె అడుగు పెట్టారు. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ స్థాయికి ఎదిగారు. 232 వన్డేల్లో 7805 పరుగులు సాధించారు. అలాగే 12 టెస్టుల్లో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 699 పరుగులు చేశారు. 89 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి 2,364 పరుగులు చేశారు. మహిళలు క్రికెట్‌పై ఆసక్తి పెంచుకోడానికి, ప్రస్తుతం ఆ రంగంలో రాణించడానికి మిథాలీ స్ఫూర్తిగా నిలిచారు. రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ అభిమానులకు కాస్త బాధ కలిగించే అంశమే. ఈ ఏడాది మార్చి 22న చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆమె ఆడారు.
39 ఏళ్ల మిథాలీ జీవితంలో 30 ఏళ్ల పాటు క్రికెట్టే శ్వాసగా బతికారు. తొమ్మిదేళ్ల వయసు నుంచే బ్యాట్ పట్టారు. అంచెలంచెలుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే స్థాయికి ఎదిగారు.
క్రికెట్ జీవితమనే మొదటి ఇన్నింగ్స్ ముగిసిందని, ఇక రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకుంటున్నానని, అప్పుడు కూడా ఇలాగే ప్రేమను కురిపిస్తూ అండగా నిలవాలని మిథాలీరాజ్ కోరారు.
‘ఇండియా జెర్సీ వేసుకుని దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నా ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. 23 ఏళ్లుగా ప్రతి సవాలును ఎదుర్కొంటూ జీవితాన్ని ఆస్వాదిస్తూ వచ్చాను. ప్రతి సవాలు నుంచి గొప్ప అనుభవం సంపాదించా. ప్రతి ప్రయాణం లాగే ఇది కూడా ఏదో ఒకరోజు ముగించాల్సిందే కదా!
ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నా. ప్రతిసారి బాగా ఆడి జట్టును గెలిపించాలని భావించా. ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చింది. ఎంతో మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు రావాలి. భారత మహిళా క్రికెట్ భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోవాలి’ అంటూ మిథాలీ భావోద్వేగ ప్రకటన చేయడం విశేషం.