నేను చీప్ ట్రిక్స్ నమ్మను: మహేష్

సంక్రాంతి సినిమాల మధ్య వసూళ్ల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. పొద్దున్న లేస్తే ఏ సినిమా నుంచి ఏ పోస్టర్ వస్తుందా అని ఎదురుచూడ్డమే పనైంది. వీళ్లు ఓ పోస్టర్ వదిలితే, దానికి కౌంటర్…

సంక్రాంతి సినిమాల మధ్య వసూళ్ల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. పొద్దున్న లేస్తే ఏ సినిమా నుంచి ఏ పోస్టర్ వస్తుందా అని ఎదురుచూడ్డమే పనైంది. వీళ్లు ఓ పోస్టర్ వదిలితే, దానికి కౌంటర్ గా వాళ్లు మరో పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. గడిచిన 10 రోజులుగా ఇదే పరిస్థితి. ఈపాటికే దేని గురించి మాట్లాడుతున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును.. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల గురించే ఇదంతా.

అయితే మార్కెట్లో ఇంత రచ్చ జరుగుతున్నా ఈ ఫేక్ కలెక్షన్లపై హీరోలు మాత్రం స్పందించలేదు. నిర్మాతలు అడపాదడపా స్పందించినా, అటు బన్నీ లేదా ఇటు మహేష్ లో ఎవరూ ఇప్పటివరకు వసూళ్లపై స్పందించలేదు. ఇన్నాళ్లకు మహేష్ వసూళ్లపై రియాక్ట్ అయ్యాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ పై నర్మగర్బంగా మాత్రమే స్పందించాడు మహేష్.

“చీప్ ట్రిక్స్ మేం నమ్మం. వేరే వాళ్ల వర్క్ పై నెగెటివ్ గా మాట్లాడ్డం కూడా మాకు తెలియదు. బాక్సాఫీస్ గెలుపు కోసం నా కెరీర్ లో నేనెప్పుడూ తెరచాటు మార్గాల్ని అనుసరించలేదు. నా కెరీర్ లో ఏది సాధించినా అది నా హార్డ్ వర్క్, మంచితనం, కుటుంబ సహకారం, మరీ ముఖ్యంగా అభిమానుల వల్లనే సాధ్యమైందని భావిస్తాను. అంతకుమించి నేను చెప్పడానికేం లేదు.”

ఇలా వసూళ్లపై తనదైన స్టయిల్ లో స్పందించాడు మహేష్. సరిలేరు నీకెవ్వరు సినిమాకు వస్తున్న కలెక్షన్లు, తాము రిలీజ్ చేస్తున్న ఫిగర్లన్నీ జెన్యూన్ అనే అర్థంవచ్చేలా మాట్లాడాడు మహేష్. మరి దీనికి కౌంటర్ గా అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అవుతాడేమో చూడాలి.