సూపర్ స్టార్ కృష్ణ అంత్య క్రియలు ముగిసిపోయాయి. టాలీవుడ్ వెండి తెర మీద ఓ వెలుగు వెలిగిన స్టార్ ఇప్పుడు కనుమరుగైపోయింది. అయితే కృష్ణ అంత్య క్రియలు జరిగిన వైనం మీద టాలీవుడ్ పెద్ద వర్గాల్లో గట్టి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా మహేష్ బాబు స్వంత నిర్ణయం అని తప్పు పడుతున్నారు. కుటుంబ సభ్యుల మాట వినకుండా మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ అంత్య క్రియలు మహాప్రస్థానంలో జరపడమే ఈ విమర్శలకు దారి తీసింది. పెద్ద పెద్ద వాళ్లు మరణిస్తే వాళ్ల అంత్య క్రియలు ప్రయివేటు స్థలంలో జరుపుకోవడం, అక్కడ సమాధి నిర్మించడం అన్నది ఓ పద్దతిగా వస్తోంది. ఇటీవల కృష్ణం రాజు అంత్య క్రియలు కూడా అలాగే చేసారు. ఎన్టీఆర్ మరణించినపుడు ప్రభుత్వం స్థలం ఇచ్చింది కనుక అక్కడ చేసారు. అక్కినేని అంత్యక్రియలు అన్నపూర్ణ స్టూడియోలో జరిపారు.
కృష్ణ స్వంత స్టూడియో పద్మాలయాను ప్రయివేటు అపార్ట్ మెంట్ల నిర్మాణానికి ఇచ్చేసినా, దానికి సమీపంలో ఇంకా అయిదు ఎకరాల వరకు స్థలం వుందని తెలుస్తోంది. అలాగే పద్మాలయా స్టూడియోకి ప్రత్యామ్నాయంగా మహేశ్వరం ప్రాంతంలో కొన్ని ఎకరాల స్థలాన్ని కృష్ణ కొని వుంచినట్లు తెలుస్తోంది. దానికి సమీపంలోనే మహేష్ కు 30 ఎకరాల వరకు స్థలం వుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇలా ఎక్కడ పడితే అక్కడ స్థలాలు వుండగా, ఒక్క ఎకరా కేటాయించి అక్కడ అంత్య క్రియలు జరిపించి, స్మారక మందిరం కట్టించి వుంటే బాగుండేదని టాలీవుడ్ జనాలు కామెంట్ చేస్తున్నారు. విజయనిర్మల కనుక బతికి వుంటే ఇలా జరగనిచ్చేది కాదని కూడా కామెంట్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, శోభన్ బాబు ఫ్యామిలీ ఎలాచేసారో గుర్తుచేస్తున్నారు. నరేష్ తన తల్లి విజయ నిర్మల కోసం ఏం చేసారో వివరిస్తున్నారు.
నిజమెంతో తెలియదు కానీ, మహాప్రస్థానంలో కృష్ణ అంత్య క్రియలు జరపాలన్న నిర్ణయాన్ని ఆదిశేషగిరిరావు, దివంగత రమేష్ బాబు భార్య, మరి కొందరు వ్యతిరేకించినట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది. మొత్తం మీద కృష్ణ అంత్యక్రియలు మహా ప్రస్థానంలో జరపడం పట్ల టాలీవుడ్ లో చాలా మంది పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నమాట వాస్తవం.