దాదాపు 235 సంవత్సరాల అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన అధ్యక్షుడెవరంటే డొనాల్డ్ ట్రంప్ పేరే చెప్పాలి. వివాదాలంటే వ్యక్తిగతమైన మొనికా లావెన్స్కీ- బిల్ క్లింటన్ కథల్లాంటివి కావు. ప్రచారంలో మాటలు తూలుతూ అసభ్యంగా మాట్లాడడం, జాతి విద్వేషాలు రెచ్చగొట్టడం, నియంతృత్వ ధోరణి చూపడం, కాపిటల్ హిల్ మీద దాడికి ఉసిగొల్పడం, జార్జియాలో క్రిమినల్ ఎలక్షన్ విషయంలో కేసులో ఇరుక్కోవడం, లైంగికదాడి అంశంలో పరువునష్టం కేసు, న్యూయార్క్ లో సివిల్ ఫ్రాడ్ కేసు..ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకమైన వివాదాలకి కేరాఫ్ అడ్రస్ డొనాల్డ్ ట్రంప్.
2020 లో అతను రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావడానికి ఎంతగా ప్రయత్నించినా పనిజగరగలేదు. “స్లీపింగ్ బైడెన్” అంటూ ప్రత్యర్థిని ఎంత ఎద్దేవా చేసినా ఆయనే ప్రెసిడెంటయ్యాడు. హుందాగా ఆ గెలుపుని ఒప్పుకోకుండా తొండాడారంటూ చిన్నపిల్లాడిలా గొడవలు చేసాడు ట్రంప్. ఆ గొడవలు చాలా అసహ్యంగా అమెరికా ప్రతిష్టని భంగపరిచేలా తయారయ్యాయి.
మళ్లీ ఇప్పుడు 2024 ఎన్నికలకి సన్నాహాలు చేసుకుంటున్నారు నీలం, ఎరుపు పార్టీలు.
తాజాగా తాను మరోసారి అధ్యక్షపదవికి పోటీ చేస్తున్నానంటూ ప్రకటించాడు ట్రంప్. అయితే ఇక్కడ అతనికున్న అతిపెద్ద అవరోధం అసలు ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా సొంత పార్టీ సభ్యుల ఆమోదం పొందడం. అది జరిగేలా లేదు. ఇండియాలోలాగ సభ్యులందర్నీ డబ్బిచ్చి కొనగలిగితే ఏమో గానీ, అదంత సులభమైన విషయమైతే కాదు.
నిజానికి సొంత పార్టీలోనే ట్రంపుకి చుక్కెదుర్లు ఉన్నాయి. అతనంటే గిట్టని వాళ్లే ఎక్కువమందున్నారు. పైగా తాజాగా ఫ్లోరిడా గవర్నర్ గా రిపబ్లికన్ పార్టీ నుంచి ఎన్నికైన రాన్ డెసాంటిస్ ఈసారి ఈ ఎర్ర పార్టీ తరపున ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అంటున్నారు. రాన్ డెసాంటిస్ కి రైట్ వింగ్ ఇమేజ్ అంతగా లేదు. అతని వ్యక్తిత్వంలో ఒక బ్యాలెన్స్ కనిపిస్తుంటుంది. రిపబ్లికన్ పార్టీ విధానాలకి కట్టుబడి ఉంటూనే వాటిని తీవ్రవాద స్థాయికి చేరకుండా మోడరేట్ చేసే విధానం అధికశాతం ఓటర్స్ కి నచ్చుతోంది. అందుకే డెమాక్రటిక్ పార్టీ ఓటర్స్ ని కూడా కొంతవరకు తనవైపుకి తిప్పుకోగలిగాడు. సరిగ్గా ఇలాంటి అభ్యర్ధి అయితేనే అధ్యక్ష పోటీకి అర్హుడని అనుకుంటోంది రిపబ్లికన్ పార్టీ.
ఈ 44 ఏళ్ల రాన్ డెసాంటిస్ తనకు పెద్ద అడ్డంకి అని తెలుసుకున్న 76 ఏళ్ల ట్రంప్ అతనిని అప్పుడే బెదిరించే కార్యక్రమం మొదలుపెట్టాడు. ముందుకొస్తే ఇబ్బంది పడతాడని, అతని గురించి కొన్ని డార్క్ నిజాలు బయటపెడతానని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. రాన్ డెసాంటిస్ ఇటలీ సంతతికి చెందిన వాడు. ఆయన పూర్వీకులంతా ఇటలీయే. ఆ జాతివాదం కూడా తెరమీదకి తీసుకొచ్చి రిపబ్లికన్ల ఓట్లు కూడా పడకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేపడతాడు.
ట్రంప్ పదవీకాంక్షకి హద్దులేదు. తన రోగ్ ఇమేజే తనకు మళ్లీ అధ్యక్షపదవి కట్టబెడుతుందని నమ్ముతున్నాడు. మొన్న జరిగిన మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో తాను నిలబెట్టిన క్యాండిడేట్స్ అక్కడక్కడ గెలిచినా అత్తెసెరు మెజారిటీతోనే గెలిచారు తప్ప డెమాక్రాట్స్ ని చిత్తుచేయడానికి దగ్గర్లో కూడా లేరనిపించారు. పైగా సెనేట్ ని డెమాక్రాటిక్ పార్టీ తన్నుకుపోయింది. హౌజ్ ఆఫ్ రిప్రెసెంటేటివ్స్ లో రిపబ్లికన్స్ బలం తగ్గిపోయింది.
ఎలా చూసుకున్నా ట్రంప్ వేవ్ చిన్న అల మాదిరిగా కూడా లేదు. అయినప్పటికీ మళ్లీ నిలబడాలని, నిలబడితే గెలుస్తానని భ్రమలో ఉన్నాడు.
టూ ఎర్లీ అనుకున్నా…మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఫలితాల్ని దృష్టిలో పెట్టుకుని అంచనా వేస్తే మళ్లీ డెమాక్రటిక్ పార్టీయే రావచ్చేమో! ఒకవేళ రిపబ్లికన్స్ వచ్చినా రాన్ డెసాంటిస్ కి అధ్యక్షయోగం పట్టే అవకాశముందనిపిస్తోంది.
సుశర్మ తల్లాప్రగడ, టెక్సాస్