మహేష్ Vs బన్నీ.. ఫ్యాన్స్ కు ఏం సందేశం ఇస్తున్నారు?

ఓవైపు మహేష్ హార్డ్ కోర్ ఫ్యాన్స్.. మరోవైపు బన్నీ ఆర్మీ.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే గ్రూప్స్ ఇవి. సీజన్ తో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో కొట్టుకునే బ్యాచ్ లు ఇవి. తమ హీరో…

ఓవైపు మహేష్ హార్డ్ కోర్ ఫ్యాన్స్.. మరోవైపు బన్నీ ఆర్మీ.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే గ్రూప్స్ ఇవి. సీజన్ తో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో కొట్టుకునే బ్యాచ్ లు ఇవి. తమ హీరో గొప్ప అంటే, తమ హీరో గ్రేట్ అంటూ వాదించుకునే గ్రూపులివి. ఇలాంటి మనస్తత్వం ఉన్న ఫ్యాన్స్ మధ్య కోపతాపాలు చల్లార్చే బాధ్యత కచ్చితంగా ఈ ఇద్దరు హీరోలపై ఉంది. తాము కలిసే ఉన్నామని, తమ మధ్య స్నేహం ఉందనే విషయాన్ని వీళ్లు ఎప్పటికప్పుడు బయటకు చెప్పినప్పుడు మాత్రమే ఈ ఫ్యాన్ వార్స్ తగ్గుతాయి. కానీ ఈ హీరోల వ్యవహార శైలి మాత్రం అలా లేదు.

నీలిమ గుణ రిసెప్షన్ వేదికగా..

గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ, వ్యాపారవేత్త రవి ప్రఖ్య రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు. రాత్రి రిస్పెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి టాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ వేడుకకు మహేష్-అల్లు అర్జున్ కూడా వచ్చారు. ఎవరి మానాన వారు వచ్చి వెళ్లిపోతే ఏ గొడవ లేదు కానీ ఒకే టైమ్ కు, ఒకేసారి వేదికపై ఇద్దరూ తారసపడ్డంతోనే వచ్చింది సమస్య అంతా.

అప్పటికే మహేష్ స్టేజ్ పై ఉన్నాడు. అదే టైమ్ లో బన్నీ స్టేజ్ ఎక్కాడు. గుణశేఖర్ దగ్గరుండి బన్నీని పైకి తీసుకొచ్చాడు. ఎదురుగా మహేష్ లాంటి స్టార్ కనిపించేసరికి బన్నీ కాస్త ఖంగుతిన్నాడు. అయినప్పటికీ తడబడలేదు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అక్కడే కాసేపు వాళ్లు మాటామంతీ మాట్లాడితే బాగుండేది.

ఇలా చేతులుకలిపి అలా ఎడమొహం-పెడమొహం పెట్టుకున్నారు బన్నీ-మహేష్. కళ్లముందే, కెమెరా ముందే ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. ఓ దశలో బన్నీ కూతురు అర్హతో మహేష్ మాట్లాడాడు. తను తీసిన శాకుంతలంలో అర్హ నటించిందని గుణశేఖర్, మహేష్ కు ఏదో చెబుతున్నాడు. ఆ టైమ్ లో కూడా బన్నీ అక్కడ నిలబడలేదు. అప్పటికే దూరం జరిగిపోయాడు.

ఆ మందీమార్బలం ఏంది సామీ?

మహేష్, అల్లు అర్జున్ వేడుకకు వచ్చిన విధానంపై కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మహేష్ సింపుల్ గా వచ్చాడు, మెహర్ రమేష్ ను మాత్రమే వెంటబెట్టుకొచ్చాడు. బన్నీ విషయంలో మాత్రం ఆర్భాటం కనిపించింది. తనతో పాటు తన టీమ్ కు కోట్లు కుట్టించాడు బన్నీ. అందరూ ఒకేసారి హడావుడిగా స్టేజ్ పైకి వచ్చారు. బన్నీ స్టేజ్ ఎక్కిన వెంటనే అతడి టీమ్ చేసిన హంగామా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

టీమ్ కు బన్నీ చురకలు తప్పవా?

ఇలా ఒకే వేదికపై కలిసిన బన్నీ-మహేష్.. సామరస్యంగా, హృదయపూర్వకంగా మాట్లాడుకొని ఉంటే చాలా బాగుండేది. కానీ ముభావంగా ఎవరి పని వాళ్లు చేసుకుపోయారు. ఒకే వేదికపై ఉండి కూడా చూపులు కలపలేదు. ఈ మొత్తం వ్యవహారంలో తన పర్సనల్ స్టాఫ్ కు, పీఆర్ కు కచ్చితంగా బన్నీ క్లాస్ పీకి ఉంటాడు. ఎందుకంటే, హీరోలు ఎవరైనా పర్సనల్ ఎటెన్షన్ కోరుకుంటారు. తాము వచ్చేటప్పుడు స్టేజ్ క్లియర్ అయ్యేలా చూసుకుంటారు. కానీ బన్నీ వచ్చేసరికి ఆల్రెడీ మహేష్ ఉన్నాడు. అది బన్నీకి కచ్చితంగా కోపం తెప్పించి ఉంటుంది. తన స్టాఫ్ పై ఆగ్రహానికి కారణం అయి ఉంటుంది.

మహేష్ మాత్రం ఈ మొత్తం వ్యవహారాన్ని లైట్ తీసుకొని ఉంటాడు. అయితే ఫ్యాన్స్ కు ఓ మంచి సందేశం ఇవ్వడంలో ఇటు మహేష్ అటు అల్లు అర్జున్ లో ఏ ఒక్కరూ చొరవ చూపించకపోవడం బాధాకరం.