కొన్ని రోజుల కిందటి సంగతి. రవితేజ హీరోగా (విలన్ అని కూడా అనుకోవచ్చు) నటించిన రావణాసుర సినిమా థియేటర్లలోకి వచ్చింది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్ లో హీరోతో పాటు ఇతర నటీనటులంతా కథ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఏమాత్రం మాట్లాడినా కథ బయటకొచ్చేస్తుందనే కలరింగ్ ఇచ్చారు.
థియేటర్లలోకి వచ్చిన తర్వాత చూస్తే, బాజీగర్ సినిమానే అటుఇటు మార్చి తీసినట్టు అనిపించింది. సగటు రివెంజ్ డ్రామాను తలపించింది. ఇంతోటి దానికి ప్రచారంలో అంత బిల్డప్ ఇచ్చారేంటంటూ రిలీజ్ టైమ్ లో ట్రోలింగ్ కూడా నడిచింది.
సరిగ్గా 2 వారాల గ్యాప్ లో విరూపాక్ష వచ్చింది. కథాంశాలు వేరైనా ఇది కూడా థ్రిల్లర్ సినిమానే. అయితే ఈ సినిమాకు యూనిట్ ప్రచారం చేసిన తీరు ఆకట్టుకుంది. స్వయంగా హీరో చేతికి మైక్ ఇచ్చి పాత్రల్ని పరిచయం చేశారు. ప్రచారంలో కూడా ఎక్కువ హైప్ ఇవ్వకుండా, మంచి థ్రిల్ ఇస్తుందని మాత్రమే చెప్పారు.
విరూపాక్ష ప్రచార వ్యూహం ఫలించింది. థియేటర్లలో ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. నిజానికి రావణాసురతో పోలిస్తే, విరూపాక్షలోనే ఎక్కువ ట్విస్టులున్నాయి, ప్రీ-క్లయిమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే అస్సలు ఎవ్వరూ ఊహించలేరు కూడా. అంత పెద్ద థ్రిల్లింగ్ ఎలిమెంట్ పెట్టుకొని కూడా యూనిట్ లో ఎవ్వరూ ఎక్కువ హైప్ ఇవ్వలేదు. ఆ ప్రచార వ్యూహమే పనికొచ్చింది. ఈ స్ట్రాటజీ లేకనే రావణాసుర సినిమా ఫెయిలైంది.
విరూపాక్ష సినిమా థియేటర్లలోకి వచ్చి మంచి టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో, రవితేజ సినిమా ఇలా నెగెటివ్ రీజన్స్ తో మరోసారి తెరపైకొచ్చింది. ఈ మిస్టిక్ థ్రిల్లర్ రాకతో, 2 వారాల కిందటొచ్చిన ఆ క్రైమ్ థ్రిల్లర్ రన్ ముగిసింది.