జగన్… జైలూ.. బూమరాంగ్ అవుతుందా…?

తెలుగుదేశం నాయకుల పరిస్థితి ఎలా ఉంది అంటే అంతా అయిపోయింది ఇక అధికారంలోకి వచ్చేస్తున్నామన్న ఫీలింగ్ లో నిండా మునిగి తేలుతున్నారు. ఎన్నికలు జరిగేది 2023లో కాదు, 2024 మే లో అంటే ఇంకా…

తెలుగుదేశం నాయకుల పరిస్థితి ఎలా ఉంది అంటే అంతా అయిపోయింది ఇక అధికారంలోకి వచ్చేస్తున్నామన్న ఫీలింగ్ లో నిండా మునిగి తేలుతున్నారు. ఎన్నికలు జరిగేది 2023లో కాదు, 2024 మే లో అంటే ఇంకా ఏడాదికి పైగా టైం ఉంది. ఎన్నికల్లో ఫలితాలు మారడానికి క్షణాలు చాలు.

వేవ్ ఉందని తమ్ముళ్ళు తమకు తాముగా భావించుకుంటూ వచ్చేది మేమే అని జబ్బలు చరుస్తున్నారు. ఆ అతి ఉత్సాహంలో జగన్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు లాంటి వారు అయితే జగన్ నివాసం విశాఖలో కాదు ఎక్కడ ఉండాలో సీబీఐ చెబుతుందని తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు.

విశాఖకు చెందిన నాయకులు కూడా కొంతమంది జగన్ జైలుకు వెళ్తాడని అంటున్నారు. ఇలా జగన్ జైలూ రెండూ ముడిపెట్టి టీడీపీ నాయకులు చేసే విమర్శలు వారికి ఎంత ఉత్సాహం ఇస్తాయో కానీ జనాలో మాత్రం అవి కొత్త చర్చకు దారి తీసి చివరికి బూమరాంగ్ అవుతాయని అంటున్నారు.

జగన్ గతంలో జైలుకు వెళ్ళడం వెనక కుట్ర కోణం ఉంది. దాన్ని జగన్ సహా వైసీపీ నేతలు పదే పదే చెబుతూ వచ్చారు ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. ఇపుడు మళ్లీ జగన్ జైలు అంటే మాత్రం తెలుగుదేశానికి అది మంచిదేనా అన్నదే ఆలోచించాలని అంటున్నారు.

జగన్ మీద ఈ విధంగా చేసే విమర్శలు చివరికి సానుభూతికే తెస్తాయని అంటున్నారు. అయినా జగన్ మీద కేసులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిని సీబీఐ విచారణ చేస్తోంది. తీర్పు ఇవ్వాల్సింది కోర్టులు. మధ్యలో రాజకీయాల కోసం తమ్ముళ్లు చేసే ఈ తరహా విమర్శల వల్ల టీడీపీకి మేలు జరుగుతుందా లేదా అన్నది వారే ఆలోచించుకోవాలని అంటున్నారు.

జగన్ మీద టీడీపీ వారి విమర్శలను తిప్పికొడుతూ మంత్రి దాడిశెట్టి రాజా విశాఖలో సీఎం కాపురం పెడితే టీడీపీ పూర్తిగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. టీడీపీ నాయకులు విశాఖకు జగన్ వస్తాను అంటే ఎందుకు అంత కంగారు పడుతున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు.