మంచి మిత్రుడు, చిత్రకారుడు బాలి ఏప్రిల్ 17న రాత్రి వెళ్లిపోయారు. చిత్రకళలోని అన్ని విభాగాల్లోనూ ఆయన రాణించారు. బాపు గారిలాగానే పౌరాణిక చిత్రాల దగ్గర్నుంచి కార్టూన్ల దాకా, వర్ణచిత్రాల నుంచి కథలకు ఇలస్ట్రేషన్స్ దాకా, ముఖచిత్రాలు, గ్రీటింగ్స్.. అన్నీ వేశారు. 1960లలో బాపు మనకు అలవాటు చేసిన రేఖలను బాలి కడదాకా కొనసాగించారు. బాపు రూటు మార్చేసి, వేరేవేరే ప్రయోగాలకు వెళ్లిపోయారు. బాలి మాత్రం ఆ లైను వదలలేదు. అందుకే నా బోటివాళ్లకు ఆయన బొమ్మలన్నీ ఆత్మీయంగా తోస్తాయి. తెలుగునాట బాపుకు ముందు అనేకమంది చిత్రకారులున్నా, తన తరం చిత్రకారులను బాపు ప్రభావితం చేసినట్లు వేరెవ్వరూ చేయలేదు. అనేకమంది ఆయన్ను అనుకరించారు. వారిలో అగ్రగణ్యులుగా బాలి, చంద్రలను చెప్పాలి.
పైన చెప్పినట్లు బాపు కొన్నాళ్లు పోయాక, తన రీతి మార్చేశారు. చంద్ర బాపు లైను కొనసాగిస్తూనే చాలా ప్రయోగాలు చేశారు. బాలి మాత్రం ఎప్పుడూ బాలి లాగానే ఉన్నారు. చిన్నప్పణ్నుంచి వీళ్లందరి బొమ్మలూ చూసి అభిమానిస్తూనే ఉన్నాను. మద్రాసులో ఉండగా 1993 చివర్లో బాపు గారితో ప్రత్యక్ష పరిచయం ఏర్పడింది. 1995లో హైదరాబాదు వచ్చాక ఆ ఏడాది చివర్లో చంద్రతో ప్రత్యక్ష పరిచయం ఏర్పడింది. బాపుగారు నన్ను ‘ఫ్రెండ్’గా పిలిచినా, నాకెప్పుడూ ఆయనంటే భక్తిప్రపత్తులే. ఆయన చనువు యిచ్చినా, తీసుకోడానికి దడే. కానీ చంద్ర స్నేహశీలి. నా కథలు నచ్చి, ఎంతో ప్రోత్సహించారు. నన్ను ఎందరికో పరిచయం చేశారు, సిఫార్సు చేశారు. వాళ్లింటికి తరచుగా వెళ్లేవాణ్ని. అన్ని విషయాలూ మాట్లాడేవాణ్ని. ఆయనా మా యింటికి వచ్చేవాడు. ఎంతో ఆత్మీయంగా ఉండేవాడు.
ఇక బాలిగారితో పరిచయం 2001లో జరిగింది. నేను మేనేజింగ్ ఎడిటరుగా ‘‘హాసం’’ పత్రిక తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. హాస్య ప్రధాన పత్రిక కాబట్టి చిన్నా, చితకా అనేక బొమ్మలు వేయించాలి. చంద్ర అప్పటికే అమెరికా వెళ్లి వచ్చి హైక్లాస్ ఆర్టిస్టు అయిపోయారు. పోగా ఆయనతో పెట్టుకుంటే పనులు జరగవు. తలచుకుంటే ఒక్క రాత్రిలో పది బొమ్మలిస్తాడు, లేకపోతే పది నెలలు గడిచినా ఒక్క లైనూ గీయడు. బొమ్మలో ప్రయోగాలు చేస్తానంటాడు. కొన్నిసార్లు అవి వివాదాస్పదమౌతాయి కూడా. చిన్న చిత్రకారులు కొందరితో ప్రయత్నించాం. బొమ్మలు ప్రొఫెషనల్‌గా లేవు. ఎలాగా అనుకుంటూ ఉంటే ఓ సారి మా ఎడిటరు రాజా ‘‘బాలి విజయవాడ నుంచి హైదరాబాదుకి మకాం మార్చారటండి. ప్రయత్నిద్దామా?’’ అన్నారు. ‘‘అంతకంటె ఏం కావాలి? మన ఆఫీసుకి పిలిపించండి.’’ అన్నాను. ఆయన వచ్చాక మేం తయారు చేసిన ప్రోటోటైపు చూపించాం.
బాలికి భేషజాలు లేవు, మొహమాటాలు లేవు. నిజజీవితంలో అమాయకుడు కూడా. నిజాయితీగా, బోళాగా మాట్లాడేసే రకం. మాది చూసి ‘‘ఈ లేఔట్ బాగా లేదు. ఎమెచ్యూరిష్గా ఉంది. ఏమీ అనుకోకండి, యిలా అంటున్నానని..’’ అని ఆగి, మా మొహం కేసి చూశారు. నేను అలవాటు ప్రకారం చేతులు కట్టుకుని వింటున్నాను. ఆయన ఆగగానే ‘‘మీరు చెప్పేది చేతులు కట్టుకుని వింటున్నాం కదా’’ అన్నాను జోవియల్‌గా. ఆయన నవ్వాడు. ఆయన వెళ్లిపోయాక రాజా నా మీద ఆగ్రహం ప్రదర్శించాడు. ‘మీరు మీ పరువు తీసుకున్నారు, నా పరువూ తీశారు. చేతులు కట్టుకుని వినాల్సినంత ఖర్మేం లేదు మనకు..’ అంటూ.
‘చూడండి, ఆయన విజయవాడలో దశాబ్దాలుగా ఉంటూ అనేక పత్రికలు పుట్టడం, గిట్టడం చూశాడు. అనుభవశాలి. మనం ఆయన సర్వీసెస్ ఎంగేజ్ చేస్తామో లేదో తెలియదు కానీ పాపం సమయం వెచ్చించి, మన లేఔట్‌పై నిశితమైన విమర్శలు చేశాడు. నేను ఆయనతో ఏకీభవిస్తున్నాను. ఆయన రేట్లు కూడా రీజనబుల్‌గా ఉన్నాయి. చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. సమయానికి యిచ్చేస్తాడు. అది పత్రికకు చాలా అవసరం.’ అని కరాఖండీగా చెప్పాను. అనుకున్నట్లుగానే బాలి హాసం పత్రికకు ఎస్సెట్ అయ్యారు. కరుణాకర్, మోహన్ వంటి వాళ్లూ వేసినా హాసంను ప్రధానంగా ఆయన బొమ్మలతోనే నింపాం. ఆయన వలన మేం యిబ్బంది పడినది ఎప్పుడూ లేదు. ఆయన లైన్ వలన హాసం బొమ్మలు అందరికీ ఆత్మీయంగా తోచేవి. అయినా రాజా ఆయనపై ఎప్పుడూ రుసరుస లాడుతూనే ఉండేవాడు. బాలికి కూడా ఆయన నచ్చలేదు. పత్రిక మూతపడి 18 ఏళ్లయినా క్రితం నెలలో కూడా ‘మీరు రాజాను ఎడిటరుగా పెట్టుకుని తప్పు చేశారు బాబూ, మీరే ఉండాల్సింది. అతని కారణంగా మంచి పత్రిక కనుమరుగైంది.’ అన్నారు.
దురదృష్టమేమిటంటే బాపు, చంద్ర, బాలి ముగ్గురూ మన మధ్య లేరు. ముగ్గురూ నాకు ఆత్మీయులే. ఆ తరహా లైను నా కంటికి చాలా అందంగా అనిపిస్తుంది. ప్రపంచంలో ఎందరో గొప్ప చిత్రకారులున్నారు. తెలుగునాట కూడా అనేకమంది ఉన్నారు. కొందరు రంగులు కలపడంలో నిష్ణాతులు. మరి కొందరు ప్రయోగాల్లో దిట్టలు. కానీ నా బోటి వాడికి మాత్రం యీ లైనే హృదయానికి హత్తుకుపోయింది. ఉదాహరణకి వడ్డాది పాపయ్య గారి బొమ్మలు చూడగానే ఓహ్ అనిపిస్తాయి. కానీ వాళ్లు మనవాళ్లు కాదు, మనకు తారసపడే వాళ్లు కాదు, ఎక్కడో దివ్యలోకాల్లో ఉంటారు అని వెంటనే తోస్తుంది. బాపు, చంద్ర, బాలిల బొమ్మల్లో కనబడేవాళ్లు మన మధ్య మసలే మనుషులే. వాళ్లలో అందాల్ని, వేషభాషల్ని, కదలికలను, హావభావాల్ని వీళ్లు ఒడిసి పడతారు. నా కథ ‘‘నాటునాటు’’కి ఏప్రిల్ 6న బాలి బొమ్మ పంపారు. భర్త అపరిశుభ్రత భరించలేక ముక్కు మూసుకుంటూ అతని కేసి చూస్తున్న యిల్లాలి కళ్లు, గుండ్రటి మొహం నాకు బాగా నచ్చాయి. అమ్మాయి బొమ్మ బాగుంది అంటూ కాంప్లిమెంటు పంపించాను. అలాటి లైను రాబోయే రోజుల్లో ఎవరు ఒడిసిపట్టుకుంటారో చూడాలి.
పట్టుకోవాలంటే తెలుగువాళ్లను, వాళ్ల జీవితసరళిని దగ్గరగా చూసి, గుర్తు పెట్టుకోవాలి. దాన్ని గీతల్లోకి దింపాలి. బాపు 1960, 70ల్లో వేసిన కథలకు, నవలలకు వేసిన బొమ్మల్లో, కార్టూన్లలో కూడా, యిలాటి యాంబియన్స్ చాలా చక్కగా చూపించారు. ఆ తర్వాత సినిమాల్లో పడి కాబోలు, క్లుప్తంగా వేయసాగారు. కానీ బాలి మాత్రం ఆ పద్ధతి కొనసాగించారు. నేటి కార్టూనిస్టులలో మళ్లీ అలాటి వాతావరణాన్ని విపులంగా చూపించేది సరసి మాత్రమే. చంద్రకు అంత ఓపిక లేదు. చంద్ర బొమ్మల్లో కొట్టవచ్చినట్లు కనబడేది అందం. ముసలివాళ్లను, కురూపులను, రాక్షసులను వేసినా వాళ్లు అందంగా తేలతారు. బాలి బయటి మనుష్యులు ఎలా వుంటారో అలాగే వేస్తారు. అందరూ అందంగా ఉండాలనే రూలు పెట్టుకోరు, అందుకే సహజంగా ఉంటారు.
నేను గమనించిన దేమిటంటే, బాపు నేపథ్యం గొప్పది. తండ్రి బొమ్మలు వేయగలిగిన లాయరు, డబ్బున్న కుటుంబంలో పెరిగారు. తెలుగు పత్రికలు వెలువడే, తెలుగు సినిమాలు నిర్మాణమయ్యే మద్రాసు నగరవాసి. పెద్ద యాడ్ కంపెనీలో పని చేశారు. డైరక్టరు కాక ముందే సినిమా యాడ్స్ ద్వారా గడించారు. ఆదాయం బాగా వచ్చింది. దానితో అనేక పుస్తకాలు కొన్నారు. అన్ని రకాల చిత్రకళలను, చిత్రకారులను అధ్యయనం చేశారు. అనేక మంది మెంటార్స్ ఉన్నారు. సత్సాంగత్యం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే హైప్రొఫైల్ మనిషి. అందుకనే ఆయన లెటరింగులో సైతం కొత్త బాటలు వేయగలిగారు. ప్రజల్ని ఆ వైపు మళ్లించగలిగారు.
చంద్ర వరంగల్ జిల్లాలోని ఓ గ్రామం నుండి వచ్చారు. సామాన్య కుటుంబం. చిత్రకళతో పరిచయమున్నది కాదు. చిన్న వయసులోనే హైదరాబాదు వచ్చి, కిందామీదా పడుతూ బొమ్మలు నేర్చుకున్నారు. ప్రజా ఉద్యమాల్లో తిరిగారు. మరీ అంత గొప్పగా ఏమీ గడించలేదు. డిసిప్లిన్ తక్కువ కాబట్టి దేనిలోనూ కుదురుకోలేదు. కానీ ప్రయోగాలు చేయడం మహా యిష్టం. దేన్నయినా త్వరగా గ్రహించగలరు. కథలో కీలకాంశాన్ని త్వరగా పట్టుకోగలరు. స్వయంగా కథలు రాశారు కానీ సంఖ్యాపరంగా తక్కువే. ‘‘కాకులు’’ అనే కథను ఆయన కోరికపై నేను ఇంగ్లీషులోకి అనువదిస్తే ‘ఎపి టైమ్స్’లో ప్రచురితమైంది. చంద్రకు పెద్ద సర్కిల్ ఉంది. అతి సామాన్యుల నుంచి, అతి గొప్పవారి దాకా అందరితో కలిసిపోగలరు. అనేక వ్యాపకాలున్నాయి. తనను తాను మార్కెటింగ్ చేసుకోగలరు. వేరేవాళ్లని పుష్ చేసే ఉపకారబుద్ధీ ఉంది. వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడ్డారు కూడా.
బాలి (మేడిశెట్టి శంకరరావు) కుటుంబానికీ చెప్పుకోదగ్గ చిత్రకళానేపథ్యం లేదు. అనకాపల్లిలో సామాన్య కుటుంబం. స్వయంకృషిపైనే పైకి వచ్చారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి, పత్రికలలో కార్టూనిస్టు అయ్యారు. ఆంధ్రజ్యోతిలో పురాణం సుబ్రహ్మణ్య శర్మగారి సంపాదకత్వంలో చాలా నేర్చుకున్నారు. ఆయనే ‘బాలి’ అనే కుంచె పేరు పెట్టారు. బాపు యిత్యాదుల బొమ్మలు చూసి, జీవితాన్ని చూసి బాలి నేర్చుకుంటూ, తనను తాను యింప్రూవ్ చేసుకుంటూ పోయారు. విజయవాడలో ఉండటం చేత అనేకమంది పబ్లిషర్లు, రచయితలు పరిచయమయ్యారు. ఆయన్ని మేధావి అనడానికి లేదు. ఎవరైనా పెట్టుబడి పెట్టి బాలికి మంచి తర్ఫీదు యిప్పించి ఉంటే ఆయన ఎక్కడికో చేరి వుండేవారనిపిస్తుంది నాకు.
పత్రికల్లో పని చేసేవారికి జీతాలు పెద్దగా ఉండేవి కావు. ఇతరత్రా కూడా ఆయన పెద్దగా ఆశ పడే మనిషీ కాదు, డబ్బూ పెద్దగా వచ్చిపడలేదు. సామాన్య గృహస్తుగానే పట్టణాల్లో జీవించారాయన. అందువలన ఆయనకు ఎక్స్పోజర్ తక్కువగా ఉంది. మార్కెటింగ్ కళ తెలియకపోవడం వలన ఆయన తనను తాను ఎక్కువగా ఎక్స్పోజ్ చేసుకోలేదు. లో ప్రొఫైల్ మేన్‌టేన్ చేశారు. మాటల్లో కూడా నేనింతటివాణ్ని, అంతటివాణ్ని అని ఎప్పుడూ మాట్లాడేవారు కారు. వాడెంత, వీడెంత అనే క్వశ్చనే లేదు. భోగభాగ్యాలు లేకపోయినా, సాధారణ మధ్యతరగతి జీవితమే అయినా ఎప్పుడూ తృప్తిగానే కనబడేవారు. రావలసినంత గుర్తింపు రాలేదు వంటి మాటలు నోటివెంట వచ్చేవే కావు.
నిగర్వి. నిష్కపటంగా మాట్లాడేవారు. వేదికపై ప్రసంగించాలన్నా సరే, లౌక్యం చూపకుండా ఉన్నదున్నట్లు మాట్లాడేవారు. చిత్రకారులు, కార్టూనిస్టులు అందరూ ఆయన్ని బాగా గౌరవిస్తారు. మేం హాసం ప్రచురణల్లో ఆయన జోక్స్ సంకలనం ఒకటి, కార్టూన్ల బుక్ ఒకటి వేశాం. హాసం బుక్స్ కవర్స్ వేయించుకున్నాం. శాంతా బయోటెక్‌కు కొన్ని యాడ్స్ వేయించాం. గత ఏడాదిగా యీ వెబ్సైట్లో వారానికి ఒక కథ చొప్పున రాద్దామనుకున్నపుడు బాలి గార్నే ఆశ్రయించాను. 48 కథలకు వరుసగా బొమ్మలు వేశారు. అన్న టైముకి బొమ్మలు పంపించేస్తారు కాబట్టి, పారితోషికం పెద్దగా ఆశించరు కాబట్టి, అన్ని రకాల బొమ్మలూ వేస్తారు కాబట్టి చిన్న పత్రికలకు బాలి ఒక కల్పవృక్షంగా ఉండేవారు.
బాలి ఎప్పుడు చూసినా నీట్‌గా గడ్డం చేసుకుని, టక్ చేసుకుని, జుట్టుకి, మీసాలకు రంగు వేసుకుని (ఈ మధ్య మానేశారనుకుంటా) హుషారుగా కనబడేవారు. ఆ మధ్య ఆయన 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైజాగ్‌లో సన్మానం చేసినప్పుడు నేను వయసు ప్రస్తావిస్తూ అభినందిస్తే ‘నాకు 80 అని మీకెవరు చెప్పారో కానీ నాకింకా నలభై ఐదే!’ అని జోక్ చేశారు. ‘ఇది బాగుంది, నా వయసూ అంతేనని ఫిక్సయిపోండి’ అన్నాను నేను. హాసం రోజుల్లో ఖైరతాబాదులోని వారింటికి వెళ్లేవాణ్ని. పదిహేనేళ్ల క్రితమనుకుంటా భార్య పోయారు. అమ్మాయి, అబ్బాయి అమెరికాలో ఉంటారు. ఈయన వెళ్లి వచ్చేవారు. కొన్నేళ్ల క్రితం వైజాగ్‌కి, తమ్ముడు, చెల్లెలు నివాసానికి దగ్గరగా సొంతింటికి షిఫ్ట్ అయిపోయారు. హైదరాబాదులో ఉండగా తరచుగా మా యింటికి వచ్చి కబుర్లు చెప్పేవారు. నేనంటే వాత్సల్యం చేత సొంత విషయాలు కూడా ఏ అరమరికలూ లేకుండా చెప్పేవారు.
ఆయన వైజాగ్‌లో స్థిరపడ్డాక ఫోన్లో కబుర్లే తప్ప ప్రత్యక్షంగా కలిసే అవకాశం పోయింది. 2019 డిసెంబరులో వైజాగ్ వెళ్లినపుడు మా ఉభయులకూ మిత్రుడు, మహోపకారి ఐన మేడా మస్తాన్రెడ్డితో కలిసి ఆయనింటికి వెళ్లాను. మస్తాన్రెడ్డిది నెల్లూరే అయినా, మిలటరీ సర్వీసు తర్వాత వైజాగ్‌లో స్థిరపడి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో ఆరితేరారు. నాకు ‘‘హాసం’’రోజుల్లో పరిచయమై ఆప్తమిత్రుడు అయిపోయారు. వైజాగ్‌లో కళాకారులందరితో ఆయన క్లోజ్‌గా ఉంటారు. బాలి తన చిన్న యింట్లో తన వంట తనే వండుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. మీ బొమ్మలన్నిటితో ఒక పోర్టల్ పెడితే మంచిది. లేకపోతే కొంతకాలానికి మీ బొమ్మలు బాపుగారి ఖాతాలో, ఆయన బొమ్మలు మీ ఖాతాలో పడే ప్రమాదం ఉంది’ అన్నాను. ‘ఆ పోర్టలూ, అవీ ఎవరు చేస్తారు బాబూ’ అన్నారాయన.
ఏ ఆశలూ, నిరాశలూ పెట్టుకోకుండా సింపుల్ జీవితం గడుపుతున్నారు కాబట్టే ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నారనిపించింది. 2022 డిసెంబరులో వాళ్ల అబ్బాయి గోకుల్ అమెరికాలో దుర్మరణం పాలైనప్పుడు కాస్త దిగులు పడ్డా, సర్దుకున్నారు. అతని మరణం కూడా చిత్రంగా సంభవించింది. గడ్డకట్టిన సరస్సు మధ్య మిత్రుడు, భార్య, పిల్లలతో ఫోటోలు తీసుకుంటూ ఉంటే వారించడానికి వెళ్లి, వాళ్ల పిల్లల్ని రక్షించాడు. వాళ్లను కూడా రక్షించబోతూ ఉంటే కిందనున్న మంచుగడ్డ విరిగి, ముగ్గురూ నీటిలో మునిగిపోయారు. ఎవరో తెలుగు కుటుంబం అని టీవీలో వస్తే అయ్యో పాపం అనుకున్నాను. రెండు రోజులకు పోయినది బాలి కుమారుడు గోకుల్ అని తెలిసి చాలా బాధపడ్డాను. అతను నాకు తెలుసు. నా ఆర్టికల్స్ చదువుతాడు. నాకు ఈమెయిల్స్ రాస్తాడు. పుత్రశోక సమయంలో బొమ్మలు వేయమనడం భావ్యం కాదని తోచి, ఒక నెల పాటు నేను కథలు రాయడం మానేశాను. తీరా చూస్తే యిప్పుడు బాలియే వెళ్లిపోయారు.
నా కథల సీరీస్ ఆయనకు బాగా నచ్చాయి. వెరైటీ సబ్జక్టులు రాస్తున్నానరంటూ మెచ్చుకునేవారు. ఆయన స్వతహాగా కథకుడు. చాలా కథలు రాశారు, పిల్లల నవలలు రాశారు. యూదుల నవల ఒకదాన్ని అనువదించారు. ‘‘చిత్రమైన జీవితం’’ పేర తన ఆత్మకథ రాశారు. దానిలో తను చూసిన ప్రముఖుల జీవితాలను ఉన్నదున్నట్లు రాశారు. వాళ్ల భక్తులేమైనా అనుకుంటారేమోనని జంకలేదు. వృత్తిరీత్యా వేలాది కథలు చదువుతారు కాబట్టి ఆయన కథ బాగుందంటే, నిజంగా బాగున్నట్టే అని నా అభిప్రాయం. ‘‘సుధ నిర్ణయం’’ కథ బాగా నచ్చింది. ‘‘అన్నీ అంత సింపుల్‌గా రాయవచ్చుగా, ఏవిటో పెద్ద ప్లాటు తీసుకుని ఒక కథలో యిముడ్చుదామని చూస్తారు.’’ అని సుతారంగా విసుక్కున్నారు. ‘‘అది పాత కథండి. సింపుల్‌గా రాస్తే యీనాటి పాఠకుడు ఓస్ అనేస్తాడు. పైపైన చూపు దాటించేస్తాడు. నా కథలో అన్ని వాక్యాలూ చదివితే తప్ప కథ అర్థం కాని విధంగా రాయడానికి అలవాటు పడ్డాను.’’ అని సంజాయిషీ చెప్పుకున్నాను.
‘‘ఆత్మసంభాషి’’ కథ ఏప్రిల్ 12న పంపాను. సాధారణంగా 2, 3 రోజుల్లో బొమ్మ పంపేస్తారు. 15 దాకా రాకపోతే ఎలా ఉన్నారంటూ వాట్సాప్ మెసేజి పెట్టాను. ఫోన్లు చేశాను. ఎత్తలేదు. 17 ఉదయం మస్తాన్‌రెడ్డికి ఫోన్ చేసి, కాస్త వెళ్లి చూసొస్తారా? అని అడిగాను. సాయంత్రానికి ఆయన ఫోన్ చేసి ‘బాలికి కడుపులో ఏదో సమస్యట. నిన్న ఆపరేషన్ జరిగింది. అమెరికా నుంచి వాళ్లమ్మాయి కూడా వచ్చింది. రేపో ఎల్లుండో డిస్చార్జి చేస్తారట.’ అన్నారు. ఆయనకు ఆరోగ్య సమస్య ఉన్నట్లు నాతో ఎప్పుడూ అనలేదు. ఫిబ్రవరిలో కూతురు, అల్లుడు అమెరికా నుంచి వస్తే వాళ్లతో తమిళనాడు టూరుకి కూడా వెళ్లివచ్చారు. సడన్‌గా ఏదైనా వచ్చిందా అనుకున్నాను. ఆపరేషన్ అయిపోయిందిగా, యిక ఫర్వాలేదు అనుకున్నాను. కానీ 18 ఉదయమే మస్తాన్ రెడ్డి ఫోన్ చేసి ‘బాలి, యిక లేరు.’ అని చెప్పారు. పట్టరాని దుఃఖం వచ్చింది. మర్నాడు పేపర్లో కొన్నాళ్లగా పెద్దపేగు సమస్యతో బాధపడుతున్నారని వచ్చింది. ఎప్పుడూ ప్రస్తావించనే లేదు. అంతా బాగానే ఉందనేవారు.
ఆయన గొప్ప ఆర్టిస్టే కాదు, గొప్ప హార్టిస్టు కూడా. మంచి మనిషి. సన్నిహితుడైన స్నేహితుడు. మా యిద్దరికీ పరస్పరమైన యిష్టం ఉంది. గత ఏడాదిగా బంధం మరింత బలపడింది. బాలి అజాతశత్రువు. ఎవర్నీ నొప్పించి ఎరగరు. అంతటి ప్రతిభ ఉండి అంత అణకువ కలిగి ఉండడం అరుదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి అమ్మాయి వైశాలి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. (ఫోటో – బొమ్మ గీసి చూపిస్తున్న బాలి, నేను రాసి, ఆయన ముఖచిత్రం వేసిన పుస్తకాలు)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2023)