Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍ కథ: ఆత్మసంభాషి

ఎమ్బీయస్‍ కథ: ఆత్మసంభాషి

‘‘పోలీసు వాళ్లే అద్భుతకథలు చెప్తున్నారంటున్నారని నేను చెప్తున్నాను కానీ నాకు కథలు చెప్పడం రాదు. జరిగినది యాజిటీజ్‌గా, ఏ డ్రామా లేకుండా చెప్పేస్తాను. ఫర్వాలేదా?’’ అన్నారు పురుషోత్తం గారనే సెక్షనాఫీసరు. ‘‘భలేవారే, కంటెంటు ముఖ్యం కానీ, చెప్పే తీరు కాదు. మీరు చెప్పేది చెప్పేస్తే తక్కినది మేం ఊహించుకుంటాం.’’ అన్నారు ముఖ్యమంత్రిణి చిరునవ్వుతో. ‘‘ఓకే, మీరెప్పుడైనా ఆత్మలతో మాట్లాడేవారి గురించి విన్నారా, మేడమ్’’ అని అడిగారు పురుషోత్తం. అక్కడున్న యావన్మందీ నవ్వారు. ‘‘నాగార్జున సినిమాలో బ్రహ్మానందం లాగానా? ఆ కారెక్టరు పెట్టుకుని కథ చెప్పబోతున్నారా?’’ అని అడిగారు డాక్టరు గారు నవ్వు అణుచుకుంటూ.

‘‘ఇది జరిగేనాటికి ఆ సినిమా రాలేదు లెండి.’’ అని మొహం ముడుచుకున్నారు పురుషోత్తం. డాక్టరు గారు సర్దుకుని ‘‘జోక్ చేశానండీ బాబూ. పూనకం ద్వారా ఆత్మలేమను కుంటున్నాయో చెప్పడం మన పద్ధతైతే మీడియం అనే వాళ్ల ద్వారా స్పిరిట్స్‌తో ముచ్చటించడం వెస్టర్న్ దేశాల్లో అలవాటు. అమెరికన్ టీవీ సీరియల్స్‌లో కూడా చూపిస్తూ ఉంటారు. అవి ఎంత వరకు కరక్టో నాకు తెలియదనుకోండి. కానీ చాలామందే వెళతారుట. ఇంతకీ మీరు అలాటి మీడియంను కలిశారా?’’ అని సీరియస్‌గానే అడిగారు.

‘‘నేను కలవలేదు కానీ, కలిసినాయన నాకు బాగా తెలుసు. ఆయన కథే చెప్పబోతున్నా.’’ అంటూ మొదలుపెట్టారు పురుషోత్తం. ‘‘ప్రకాశరావు గారని మా కాలనీలోనే ఉంటారు. వాళ్లమ్మాయి వినీత మా అమ్మాయికి, వాళ్లావిడ లక్ష్మిగారు మా ఆవిడకి స్నేహితురాళ్లు. నాది ముఖపరిచయం కంటె ఎక్కువ, స్నేహం కంటె తక్కువ. స్నేహం కుదిరేదే కానీ వాళ్లమ్మాయి పెళ్లి కారణంగా ఓ లెవెల్లో ఆగిపోయింది. వినీత తన క్లాస్‌మేట్‌ రఘువీర్ అనే అతన్ని ప్రేమించింది. అతనిది వేరే కులం. ఇంట్లో తల్లిని ఒప్పించగలిగింది కానీ తండ్రి ససేమిరా అన్నాడు. మధ్యలో తల్లి నలిగింది. ‘అన్నయ్య గారు ఓ మాట చెపితే ఒప్పుకుంటారేమో’ అంటూ మా ఆవిడ ద్వారా సిఫార్సు చేయించింది.

కాస్త బెదురుతూనే ఆయన దగ్గరకు వెళ్లి ఈ రోజుల్లో పెద్దవాళ్లం కాస్త సర్దుకుపోవాలంటూ మొదలెట్టగానే ఆయన శివాలెత్తి పోయాడు. ‘ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని వాడెడో కులం తక్కువ్వాడికి కట్టబెట్టాలా?’ అంటూ విరుచుకు పడ్డాడు. ‘మీరైతే ఒప్పుకుంటారా?’ అని అడిగాడు, నేను జవాబు చెప్పేలోపునే, ఒప్పుకున్నా ఒప్పుకోవచ్చేమో లెండి, కానీ మా కుటుంబం మీ లాటిది కాదన్నాడు. ఇక ఆ పైన వాళ్ల కులం ఎంత గొప్పదో, వాళ్ల వంశం ఎలాటి ఉత్కృష్టమైనదో, వాళ్లలో మానమర్యాదలు, ప్రేమాభిమానాలు ఏ రేంజిలో ఉంటాయో స్పీచి దంచాడు. పైకి సౌమ్యంగా ఉండే ఆయనలో అంత కుల దురభిమానం ఉందని నాకెప్పుడూ తోచలేదు. వాళ్లది తప్ప వేరే ఏ కులమూ పనికి మాలినదన్నట్లు మాట్లాడాడు. ‘మీ అమ్మాయి, మీ యిష్టం, ఏదో మీ ఆవిడ బాధ చూడలేక వచ్చానంతే, దీని కారణంగా మన కుటుంబాల మధ్య బంధం చెడిపోవలసిన అవసరం లేదు’ అని దణ్ణం పెట్టి వచ్చేశాను.

ఓ రెణ్నెళ్లకు రఘువీర్‌కు మంచి ఉద్యోగం రావడంతో వినీత ధైర్యం చేసి యింట్లోంచి వెళ్లిపోయి ఆ అబ్బాయిని పెళ్లాడేసింది. ఈయన అగ్గిరాముడై పోయాడు. వెళ్లి కాపురం చూసొద్దామని భార్య బతిమాలినా వినలేదు. మూణ్నెళ్లకో, ఆర్నెల్లకో చల్లారతాడని ఓపిక పట్టింది. అబ్బే! మనుమడు పుట్టినప్పుడైనా కరగలేదు. పోనీ తను వెళ్లి చూసొస్తానంటే కుదరదన్నాడు. ఆవిడ కుమిలికుమిలి మంచం పట్టింది. పలకరించడానికి కూతురు, అల్లుడు వస్తే తరిమేశాడు. ఆవిడ అంత్యక్రియలకు కూడా రానీయలేదు. కూతురు మొత్తుకుంది. నువ్వు ఒంటరివై పోయావు, నేను చూసుకుంటానంటూ ముందుకు వచ్చింది. అక్కర్లేదని కటువుగా చెప్పి పంపేశాడు.

ప్రకాశరావుకి వెంకట్రావని తమ్ముడున్నాడు. అన్నకు పరమ విధేయుడు. లోకమంతా అన్నని తప్పుపట్టినా, ఆయనదే రైటని వాదించేవాడు. వదినగారు పోయాక ‘‘అన్నయ్యా, నువ్వు ఒంటరిగా ఉండలేవు. నా యిద్దరూ కొడుకులూ, కోడళ్లు, మనవళ్లం కలిసి ఉన్నాం. వచ్చి మాతో ఉండు. సందడిగా ఉంటుంది. మీ ఇంటికి రాను, మీరే మా యింటికి వచ్చి ఉండండి అంటావా, చెప్పు, ఆ యిల్లు అద్దె కిచ్చేసి, యిక్కడే ఉంటాం. ఎక్కడున్నా మనమంతా కలిసి ఉండాలి. లేకపోతే వినీత మాటిమాటికీ వచ్చి నిన్ను విసిగించి, మనశ్శాంతి లేకుండా చేస్తుంది.’’ అన్నాడు.  ప్రకాశరావుకి ఆ మాట నచ్చింది. వచ్చి తనతోనే ఉండమన్నాడు. వాళ్లు యితన్ని చాలా బాగా చూసుకునేవారు. భార్య బంగారాన్నంతా తమ్ముడి కోడళ్లకు పంచిపెట్టేశాడు ప్రకాశరావు.

ఇలా కొన్నేళ్లు గడిచాయి. వినీత కొడుకు ఐదేళ్ల వాడయ్యాడు. వాడు బాలమేధావి. పద్యాలు పాడేవాడు. చిక్కు లెక్కల్ని అవలీలగా సాల్వ్ చేసేవాడు. జనరల్ నాలెజ్ క్విజ్‌ల్లో ప్రైజులు కొట్టుకుని వచ్చేవాడు. ఇవన్నీ పేపర్లలో వచ్చేవి. ఓసారి ఓ సభలో పత్రికల వాళ్లు వాణ్ని ‘నీకిన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి?’ అని అడిగితే ‘మా తాతగారు ప్రకాశరావుగారు చాలా తెలివైనవారట. ఆయనలో ఒక అంశ నాకు వచ్చిందేమో’ అన్నాడు. అది పేపర్లో రాగానే అంతా ప్రకాశరావుని మెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఈయన మహదానంద పడిపోయాడు. తన మీద ఏ కోపం పెట్టుకోకుండా కూతురూ, అల్లుడూ కొడుక్కి తన గురించి గొప్పగా చెప్పారన్న విషయం గుర్తించాక ఆయన కోపం మంచుగడ్డలా కరిగిపోయింది. బజార్లో కూతురు కనబడితే పలకరించాడు. కూతురు యింటికి ఆహ్వానించింది. అల్లుడు కూడా గతాన్ని మరిచి ఆదరించాడు. ఇక మనుమడైతే సరేసరి ‘నువ్వేనా, తాతవి?’ అంటూ కౌగలించేసుకున్నాడు.

చెప్పానుగా, యీయన చాలా ఎమోషనలని. నాతో కూడా ఎక్కువకాలం పేచీ పెట్టుకోలేదు. కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోయాక నా దగ్గరకు వచ్చి భోరుమన్నాడు. భార్య ఆవేదన పడుతోందని నాతో చెప్పుకుని యిదయ్యేవాడు. భార్య పోయాక మేమిద్దరం తరచుగా కలిసేవాళ్లం. మార్నింగ్ వాక్‌లో అవీయివీ మాట్లాడుకునే వాళ్లం. మనిషి స్వతహాగా మంచివాడే, కానీ అహంకారం ఎక్కువ, దాన్తో ఆగ్రహానుగ్రహాలు తీవ్రస్థాయిలో ఉండేవి. కూతురింటికి వెళ్లి వచ్చాక ఓ రోజు వాళ్ల కుటుంబాన్ని యింటికి పిలిచి, భోజనం పెట్టి బట్టలు కూడా పెట్టాడు. పిలిచేముందు తమ్ముడితో ఓ మాట చెపితే ఆయన ‘తప్పకుండా అన్నయ్యా, నువ్వెలా ఫీలయితే అలాగే చేదాం’ అన్నాడు.

తండ్రీకూతుళ్ల మధ్య రాకపోకలు పెరిగాయి. కూతురి అర్థికస్థితి బాగుండడంతో, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండటంతో, కులాంతర వివాహాలు విఫలమవుతాయనే తన అంచనాలు నిజం కాలేదని ఆయనకు అర్థమైంది. కూతురితో రాజీ పడడమనేది ముందుగానే చేసి ఉంటే బాగుండేది కదా అనిపించింది. ఈ ముక్క నాతో అన్నప్పుడు ‘ముఖ్యంగా మీ ఆవిడ బతికి ఉండగా చేసుంటే, ఆవిడ సంతోషించేది, ఎక్కువకాలం బతికేది. పోన్లెండి, జరిగిందేదో జరిగింది. ఏ లోకాన ఉన్నా చూసి సంతోషిస్తుంది.’ అన్నాను. అందరూ మామూలుగా అనే మాటే యిది. కానీ యిది విపరీత పరిణామాలకు దారి తీస్తుందని నాకప్పుడేం తెలుసు?

మా సంభాషణ జరిగిన పది రోజులకు ప్రకాశరావు ఉత్సాహంగా ‘మీరిచ్చిన ఐడియా బాగుందనిపించి, ఆత్మలతో మాట్లాడేవాళ్ల గురించి వెతకమంటే మా తమ్ముడు రవి అని ఒకణ్ని పట్టాడు. లక్ష్మి ఆత్మను రప్పించి, యిలా జరిగిందని చెప్తాను. సంతోషిస్తుంది, వెర్రిది’ అన్నాడు. నాకు మతి పోయింది. ‘అలా ఎలా సాధ్యమండి? చచ్చిపోయాక మనుషులు మరో జన్మ ఎత్తేస్తారు కదా, ఆత్మలెక్కడ కూర్చుంటాయి? మనం ఎప్పుడు పిలుస్తామా అని గాలిలో వేళ్లాడుతూ కూర్చోవు కదా! మా చిన్నప్పుడు ఆత్మలొచ్చాయంటూ ముక్కాలిపీటతో టక్కుటక్కూ కొట్టించేవారు. కొందరు నమ్మేవారు, కొందరు కొట్టి పారేసేవారు. మీరైనా పూనకాలూ, గీనకాలూ అంటూ హంగు చేసేవాళ్లని పిలవకండి. వాళ్లు యిల్లంతా పొగ వేసేసి, మన కళ్లల్లో బూడిద కొట్టేసి, డబ్బూదస్కం దోచేస్తారట, జాగ్రత్త’ అన్నాను.

‘అబ్బే, అలాటి బ్యాచ్ కాదండీ నేను వెళ్లేది, యితను బాగా చదువుకున్నవాడే. అతనింటికే మనం వెళ్లాలి. విశాలంగా, ప్రశాంతంగా, వెలుతురు తక్కువగా ఉండే గదిలో పెద్ద టేబుల్, మధ్యలో కొవ్వొత్తి ఉంటుందట. అతను మామూలు బట్టల్లోనే కూర్చుంటాడు. కాషాయాలు, విబూది నామాలు అలాటి హంగులేవీ ఉండవు. మన వివరాలు చెప్పగానే ధ్యానంలోకి వెళతాడు. ఆత్మలను ఆహ్వానిస్తాడు. కాస్సేపటికి కొవ్వొత్తి రెపరెప లాడుతుంది. మనల్ని ప్రశ్నలడగమంటాడు. వచ్చిన ఆత్మతో అతను మౌనంగా సంభాషించి, మనకు వాళ్లేమన్నారో చెప్తాడు. ఈ ప్రశ్నోత్తరాల బట్టి వచ్చిన ఆత్మ మనవాళ్ల తాలూకుదో కాదో తెలుస్తుందిట. మనం చెప్పదలచుకున్నది వాళ్లకు చెప్పవచ్చు. వాళ్లేమైనా చెప్దామనుకుంటే చెప్తారు. సాధారణంగా పెద్దగా చెప్పరట. ఎందుకంటే వాళ్లకు అప్పటికే వైరాగ్యం వచ్చేసి ఉంటుంది. బతికి ఉండగా ఉండేటంత ఎమోషన్స్ ఉండవట.’ అని చెప్పుకొచ్చాడు.

తీరా వెళ్లివచ్చాక అబ్బే, ఏమీ చెప్పలేదండీ, అంతా బోగస్ అని నోరు చప్పరించాడు. కానీ ఆ తర్వాత నలతపడ్డాడు. అన్యమనస్కంగా ఉండేవాడు. బయటకు రావడం బాగా తగ్గించేశాడు. కూతుర్ని మళ్లీ దూరం పెట్టాడు. కానీ ఆమె వస్తూ పోతూ ఉండేది. ఈయన జబ్బు పడితే వచ్చి సేవలు చేసింది. ఈయన యిబ్బందిగా ఫీలయ్యాడు. ఇన్నాళ్లూ మీకేమీ చేయలేదు, యిప్పుడు నీ చేత చేయించుకోవడం నాకు అదోలా ఉంది, వెళ్లి నీ సంసారం నువ్వు చేసుకో’ అంటూ వారించాడు. ఆమె ‘అబ్బే అదేమిటి నాన్నా, నా బాధ్యత కదా’ అంటూ చేయబోయింది. ఇతను కాస్త మొరటుగానే చెప్పాడు.

తమ్ముడు, అతని పిల్లల్ని పిలిచి ‘మీరు నా సంగతి చూసుకోండి, కాపురం చేసుకునే అమ్మాయి మీద భారం వేయడం నాకిష్టం లేద’న్నాడు. వాళ్లు తప్పకుండా అన్నారు. వినీత వస్తే తండ్రిని కలవనీయకుండా చేశారు. అల్లుడు వచ్చి ‘మా యింటికి వచ్చేయండి, చూసుకుంటాం’ అంటూ ప్రకాశరావు ‘మా వాళ్లుండగా నాకంత కర్మమేమీ పట్టదు.’ అని ధాటీగా చెప్పాడు. అదే ఊపులో తన దగ్గరున్న డబ్బంతా తమ్ముడి కొడుకుల వ్యాపారంలో పెట్టాడు. వాళ్లు నెలనెలా వడ్డీ యిస్తామన్నారు. ఉన్న యింటిని డెవలప్‌మెంట్‌కు యిప్పించారు. ఈయన తనకు రెండు ఫ్లాట్లుంచుకుని, తక్కినవి వాళ్ల పేర యిచ్చేట్లు బిల్డర్‌తో ఎగ్రిమెంటు చేసుకున్నాడు.

ఎగ్రిమెంటు అయిన దగ్గర్నుంచి తమ్ముడి కుటుంబం ధోరణి మారిపోయింది. నెలనెలా వడ్డీ యివ్వడం మానేశారు. ఏమైనా అవసరం పడితే అడిగి తీసుకో అన్నారు. బిల్డర్ యిల్లు ఖాళీ చేయమనడంతో వేరే చోటికి మారాల్సి వచ్చింది. అక్కడ యీయనకు ఓ మూల కొట్టుగది చూపించి, దానిలో ఉండమన్నారు. మోసపోయానని గ్రహించడంతో యీయనకు ఆందోళన, దానితో సుగరూ పెరిగాయి. డాక్టరు పరీక్షలు చేసి కిడ్నీలు పాడయ్యాయి. డయాలసిస్ చేయాలన్నాడు. తమ్ముడి కుటుంబం ‘ఇప్పుడివన్నీ ఎందుకు దండగ, ఒంటికాయ సొంటికొమ్మువి. ఎంతకాలం బతుకుతావో తెలియదు, ఆ డయాలసిస్ బాధ భరించేకంటే పోతేనే మంచిది.’ అనేశారు చులాగ్గా. ఈయన కృంగిపోయాడు.

డాక్టరు ద్వారా వినీతకు విషయం తెలిసింది. మొగుణ్నేసుకుని వచ్చి బలవంతంగా తండ్రిని తనింటికి తీసుకెళ్లిపోయింది. నిజానికి తమ్ముడి కుటుంబం పెద్దగా అభ్యంతర పెట్టలేదు. చావు ఖర్చులు తప్పుతాయని సంతోషించారో ఏమో! ‘తీసుకెళుతున్నావు, యికపై బాధ్యతంతా నీదే, గుర్తుంచుకో’ అంటూ హెచ్చరించారు. అన్నిటికీ సరేనంటూ కూతురు తండ్రి భారాన్ని తలకెత్తుకుని, క్రమం తప్పకుండా చెకప్ చేయిస్తూ, ఆయుర్వేదం మందులూ అవీ వాడడంతో డయాలసిస్ యిప్పట్లో అక్కరలేదన్నారు. ఇదంతా రెండు నెలలు పట్టింది. కూతురు తన పట్ల తీసుకుంటున్న శ్రద్ధ చూసి ఆయన అపరాధభావనతో కృంగిపోయాడు. ‘నీచేత చేయించు కోవడమేమిటి’ అని తరచుగా అనేవాడు. చివరకు ఓ రోజున అసలు విషయం కక్కేశాడు.

ఈ విషయం నాకు ఎలా తెలిసిందని మీరడగవచ్చు. వినీత, మా అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్సని చెప్పాను కదా, వినీత దాని దగ్గర చెప్పుకుని ఏడిస్తే, తను నాకు చెప్పింది. జరిగిందేమిటంటే ప్రకాశరావు రవి దగ్గరకు వెళ్లినపుడు అతను లక్ష్మిగారి అత్మను రప్పించాడు. ఆత్మను గుర్తుపట్టడానికి కొన్ని ప్రశ్నలు వేస్తే వాళ్లిద్దరికీ మాత్రమే తెలిసిన వ్యక్తిగత విషయాలు చెప్పిందా ఆత్మ. కూతుర్ని చేరదీసినందుకు సంతోషించింది. ఇతను ‘నన్ను క్షమించు, నా మాట వినలేదని యిన్నాళ్లూ దానిపై కోపగించుకుని, నిన్ను క్షోభ పెట్టాను’ అంటే ఆమె ‘నేనర్థం చేసుకోగలను, నాది కన్నపేగు కాబట్టి ఎక్కువ ఆరాటపడింది, మీది కాదు కాబట్టి పెంచిన ప్రేమను తెంచుకో గలిగారు’ అంది. ఇతను తెల్లబోతే, ‘అవును, ఆమె మీకు పుట్టినది కాదు, అంతకంటె నన్ను ఎక్కువేమీ అడగకండి’ అని చెప్పేసి వెళ్లిపోయిందా ఆత్మ.

ఇతను హతాశుడై పోయాడు. తన భార్య అలాటిదా? సాక్షాత్తూ ఆమె అత్మే వచ్చి చెప్తే నమ్మకుండా ఉండడమెలా? అబద్ధం అనుకుని తృప్తి పడదామనుకుంటే తన కూతురి ప్రవర్తన కూడా దానికి రుజువుగా నిలిచింది. తనకు పుట్టినదే ఐతే తన ఆభిజాత్యం పుణికి పుచ్చుకునేది, కులాంతరం చేసుకునేది కాదు అనుకున్నాడు. ఎవడి బిడ్డనో అన్నేళ్లు సాకినందుకు తనను తాను తిట్టుకుని, కూతుర్ని మళ్లీ దూరం పెట్టాడు. తన విశ్వాసాన్ని వమ్ము చేసిన భార్యపై కోపాన్ని కూడా కూతురిపై చూపించాడు. అదే ఆవేశంలో తమ్ముడి కుటుంబానికి సమస్తం దోచిపెట్టాడు. ఆయన పిచ్చి చేష్టలకు కారణం యిదన్నమాట అని నాకర్థమైంది. దరిమిలా తమ్ముడి కుటుంబం ద్రోహం చేయడం, కూతురి పాలన పడడం ఆయన్ని యిరకాటంలో పెట్టింది. అపరాధభావన దహించి వేస్తూండగా, ఓ రోజున ‘జరిగిందిది. నువ్వు నాకు పుట్టినదానివి కాదు, నువ్వు నాకు చేయవలసిన అవసరం ఏమీ లేదు’ అని చెప్పేశాడు. ఆ విధంగా కథ బయటకు వచ్చింది.

అంతా విని వినీత ‘అమ్మ అలా చేసిందంటే నేను నమ్మలేను. ఏ పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చిందో నాకు అనవసరం. నా జన్మకు కారణమైనది ఎవరైనా సరే, ప్రేమగా పెంచిన తండ్రివి నీవే. కన్నతండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయను. కళ్లెదురుగా ఉన్న నిన్ను సేవించుకుంటాను. నాకంతే చాలు’ అంది. ఈయన నిలువునా నీరై పోయాడు. నా పెంపకం, నేర్పించిన సంస్కారం అటువంటివి అంటూ మురిసిపోయాడు. ‘నీకు చాలా అన్యాయం చేశాను. డబ్బంతా వాళ్లు కొట్టేశారు. ఇల్లు తయారవుతోంది కదా, నా రెండు ఫ్లాట్లలో ఒకటి నీ పేర తక్షణం రాసేస్తా. రెండోది నా తదనంతరం మనవడికి వెళ్లేట్లు రాస్తా.’ అన్నాడు. లాయరుకు కబురు పెట్టి, అగ్రిమెంటు తీసి చదివితే అప్పుడు జరిగిన మోసమేమిటో అర్థమైంది. ఇతని పేర ఉన్న ఫ్లాట్లు రెండిటికీ తమ్ముడి కొడుకులే వారసులు. ఒక దానిలో జీవితపర్యంతం నివసించే హక్కు మాత్రమే ఉంది. తనకు చూపించిన నమూనా మార్చేసి వేరే అగ్రిమెంటు రిజిస్టర్ చేయించారని అర్థమైంది. నెత్తీనోరూ కొట్టుకున్నాడు.

వినీత బాధపడలేదు. ‘నీ ఆశీర్వాదం ఉంటే చాలు, అలాటివి నాలుగు కొనుక్కుంటాం. నువ్వు దాని గురించి చింతించకుండా ఆరోగ్యంగా ఉండు.’ అంది. కానీ యీయనకు చింత పోలేదు. ఓ రోజు రాత్రి ఓ విషయం గుర్తుకు వచ్చింది - తన తల్లి దగ్గర్నుంచి వచ్చిన బంగారు నగల పెట్టిని లక్ష్మికిస్తే ‘నేను వాడను, నా కూతురికి పెళ్లి టైములో యిస్తాను’ అంటూ యింట్లోనే ఎక్కడో దాచింది. ఏ గూట్లోనో, ఏ చెట్టుకిందో తెలియదు. ఇప్పుడా యిల్లు పడగొట్టారు. ఎక్కడా దొరికినట్లు చెప్పలేదు. ఎక్కడుందో తెలిస్తే అక్కడ భూమి తవ్వించవచ్చు. నగలపెట్టె ఎక్కడుందో చెప్పగలిగేది లక్ష్మి మాత్రమే!

ఈ ఆలోచన రాగానే మర్నాడు రవి దగ్గరకు వెళ్లాడు. కానీ రవి ఆ వృత్తి మానేశానన్నాడు. అదేమంటే మీరే కారణం అన్నాడు. అసలీ రవి ఎవరంటే వినీత క్లాస్‌మేట్. వెంటపడితే అదే క్లాసులో ఉన్న రఘువీర్‌ను ప్రేమించి యితన్ని తీసిపారేయడంతో కోపం పెట్టుకున్నాడు. తనకూ పెళ్లయి, పిల్లలు పుట్టినా ఆ కసి పోలేదు. ఎపాయింట్‌మెంట్ కోసం వెంకట్రావు వెళ్లినపుడు ప్రకాశరావు పేరు వినగానే ‘వినీత ఎలా ఉంది?’ అని అడిగాడు. ‘నీకెలా తెలుసు?’ అంటే ‘క్లాస్‌మేటూ, ఫ్రెండూ లెండి’ అన్నాడు. వెంకట్రావు వెంటనే ఏదో గుర్తుకు తెచ్చుకుని ‘ఆకాశరామన్న ఉత్తరం రాస్తే మా అబ్బాయి వచ్చి బెదిరించిన రవి నువ్వేనేమిటి?’ అని అడిగాడు. ‘మీ మంచి కోసమే రాస్తే, మీరు అపార్థం చేసుకున్నారు’ అన్నాడు రవి.

‘ఔనౌను. మనవాడివి, వినీత నిన్ను చేసుకున్నా బాగుండేది. ఓ దరిద్రుణ్ని కట్టుకుని, మా అన్నయ్యను, వదిన్ని క్షోభ పెట్టింది. దరిద్రం వదిలిందనుకుంటే యిప్పుడు మళ్లీ తండ్రికి చేరువౌతోంది. ఏదో ఒక ఉపాయం చేసి, తండ్రీకూతుళ్లను విడగొట్టావనుకో, నీ కష్టం ఉంచుకోను.’ అన్నాడు. దాంతో ప్రకాశరావు సెషన్‌లో లక్ష్మిగారు చెప్పినట్లుగా రవి అబద్ధం చెప్పాడు. ఇతను అబద్ధం చెప్పడం చూసి కళవెళ పడిన ప్రేతాత్మ చెదిరింది. అందుకే దీపం అల్లల్లాడింది. ప్రకాశరావుకి యిదేమీ తెలియదుగా, వినీత తన కూతురు కాదని రవి చెప్పినది గుడ్డిగా నమ్మేసి, జీవితాన్ని పాడు చేసుకున్నాడు.

ఈ సంఘటన తర్వాత ఆ ఆత్మ యితర ఆత్మలను హెచ్చరించిందిట - మనవాళ్లకు తప్పుగా కన్వే చేస్తున్నాడు యీ మీడియం, జాగ్రత్త అని. దాంతో అతనికి ఆత్మలు పలకడం మానేశాయిట. మంచి ఆదాయం వచ్చే వృత్తి మానుకోవలసి వచ్చింది. వేరే ఏ పనీ దొరకటం లేదు. ఎందుకలా జరిగిందని భార్య నిలదీస్తే, తాగిన మైకంలో యితను వినీత విషయం చెప్పేశాడు. పెళ్లయిన యిన్నేళ్లయినా దాన్ని మర్చిపోకపోతే యిక మేమెందుకు అంటూ భార్య పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయింది. ఇతను వేరే ఊరికి వెళ్లి ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని చూస్తున్నాడు. ఇదంతా చెప్పి నన్ను క్షమించండి అని కాళ్లు పట్టుకున్నాడు. ఇదంతా విని యీయన విపరీతమైన క్షోభ అనుభవించాడు. కూతురికి జరిగిందంతా చెప్పి, తనను మన్నించమంటూ వెక్కివెక్కి ఏడ్చాడు.

కూతురి దగ్గరే కాదు, నా దగ్గరా యిదంతా చెప్పుకుని ఏడ్చాడు. నా వాళ్లు, నా వంశం, నా కులం అంటూ మా వెధవలకు దోచిపెట్టి సొంత కూతుర్ని రిక్తహస్తాలతో మిగిల్చాను అని రోదించాడు. ‘పోనీ మరో మీడియం వద్దకు వెళ్లలేక పోయారా? లక్ష్మిగారు అక్కడికి వచ్చి బంగారం గురించి చెప్పేదేమో’ అన్నాను. ‘ఒకసారి వెళ్లినందుకే యింత అనర్థం జరిగింది. బాబాలు దేవుడి పేరు చెప్పి, ఇలాటి వాళ్లు దెయ్యాల పేరు చెప్పి మోసాలు చేస్తున్నారు. ఆ మాటలు నమ్మి, దిద్దుకోలేని తప్పులు చేశాను. మళ్లీ ఆత్మలను కదిలిస్తే ఏమవుతుందో! వాళ్ల లోకంలో వాటి నుండనీయండి, మన లోకంలో మనం ఉందాం.’ అంటూ ప్రకాశరావు నిట్టూర్చాడు.’’

పురుషోత్తం గారు కథ ముగించగానే శ్రోతలందరూ కూడా నిట్టూర్చారు. ముఖ్యమంత్రిణి ఏమీ అనకుండా పైటతో కన్నీళ్లు తుడుచుకున్నారు.

‘‘అద్భుతరస యామిని’’ శీర్షికలో మరో కథ వచ్చే నెల రెండవ వారంలో..

ఈ వెబ్‌సైట్‌లో ఏడాదిగా నా కథలకు బొమ్మలు వేస్తూ వచ్చిన ప్రముఖ చిత్రకారులు, మిత్రులు శ్రీ బాలి నిన్న రాత్రే మరణించారని తెలపడానికి చింతిస్తున్నాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?