కన్నడ ఎన్నికలు పాకాన పడుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా బిజెపి- కాంగ్రెస్ ల మద్య పోరు జరుగుతోంది. ఎలాగైనా సరే అధికారాన్ని నిలబెట్టుకోవాలని బిజెపి తపన పడుతుండగా, ఇప్పుడు గనుక బిజెపిని ఓడించకపోతే ముందుముందు చాలా కష్టం అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉండగా.. సంకీర్ణం ఏర్పడే పరిస్థితి వస్తే.. తాము కీలకం అవుతామనే ఆశతో జెడి ఎస్ ఇక్కడ రాజకీయం చేస్తోంది.
అయితే, ఇవే తనకు చివరి ఎన్నికలు అని ముందుగానే ప్రకటించి మరీ బరిలోకి దిగిన కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక కీలకమైన మాట అన్నారు. ఈసారి కర్ణాటక ఎన్నికలు కేవలం స్థానిక సమస్యల ఆధారంగానే జరగబోతున్నాయని ఆయన సెలవిచ్చారు. ఈ ఎన్నికల మీద మోడీ ప్రభావం ఉండదని, కాబట్టి తమ పార్టీ గెలుస్తుందని ఆయన అంటున్నారు.
ఇంతకూ ‘మోడీ ప్రభావం’ అంటే ఏమిటి? మోడీ ఫ్యాక్టర్ అంటేనే గెలుపు సంకేతమా? అనే భయం సిద్ధరామయ్యలో అంతర్గతంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. కాబట్టే మోడీ ఫ్యాక్టర్ పనిచేయదు గనుక మేం గెలుస్తాం అనే మాట వస్తోంది. బిజెపి దేశంలో ఎక్కడ పోటీ చేసినా సరే.. ఆ ఎన్నికలు మోడీ చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయి. ఇప్పటి బిజెపి ఆ రకంగా మోడీ వ్యక్తిపూజతో పార్టీని వ్యక్తికేంద్రంగా మార్చేసింది. ప్రజలు మోడీని నమ్మడం- నమ్మకపోవడం అనే అంశం మీదనే ఎక్కడైనా ఫలితాలు ఆధారపడుతున్నాయి.
సిద్ధరామయ్య, మోడీ ఫ్యాక్టర్ ఉండదు గనుక.. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలుస్తాం అంటున్నారు. అదే సమయంలో.. 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు, కన్నడ విజయం కాంగ్రెస్ కు తొలిమెట్టు అవుతుందని అంటున్నారు.
ఇక్కడే సిద్ధరామయ్య మాటల్లోని ట్విస్టు, భయం అర్థమవుతున్నాయి. మోడీ ఫ్యాక్టర్ ఉండదు గనుక.. లోకల్ ప్రాబ్లమ్స్ మీద ఎన్నికలు గనుక.. ఇప్పుడు అసెంబ్లీని మేం గెలుస్తాం అని ఆయన చెబుతున్నది నిజమైతే.. పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఓడిపోవాలి. అప్పుడు జాతీయ అంశాలు, మోడీ ఫ్యాక్టర్ మీదనే ఎన్నికలు జరుగుతాయి కదా అనేది సందేహం.
లోకల్ ప్రాబ్లమ్స్ మీద ఎన్నికలు జరుగుతున్నాయని అంటూనే, మోడీని నిందిస్తే తప్ప గెలవలేం అని అనుకోవడంలోనే కాంగ్రెసు పార్టీ ఎంతగా భయపడుతున్నదో అర్థమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.