వైసీపీకి 24-25 : టాప్‌గేర్‌లో జగన్ డప్పు!

బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత సైజులో ఉంటాయని అన్నాడట వెనకటికి ఒక ప్రబుద్ధుడు. తృణమో పణమో ముట్టజెప్పుకుంటాం.. మా పార్టీకి అనుకూలంగా డప్పు కొట్టరా బాబూ అని బేరం పెడితే..…

బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత సైజులో ఉంటాయని అన్నాడట వెనకటికి ఒక ప్రబుద్ధుడు. తృణమో పణమో ముట్టజెప్పుకుంటాం.. మా పార్టీకి అనుకూలంగా డప్పు కొట్టరా బాబూ అని బేరం పెడితే.. అడిగిన వాళ్ల చెవులు పగిలిపోయేలా డప్పు కొడుతున్నట్టుంది టైమ్స్ నౌ- నవభారత్ సర్వే!.

దేశంలో పార్లమెంటుకు ఉన్నపళంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారనే విషయంలో టైమ్స్  నౌ- నవభారత్ సర్వే నిర్వహించారు. సర్వేఫలితాలంటూ.. గణాంకాలను ప్రకటించారు. మోడీ 3.0 ప్రభుత్వాన్ని వీరు ధ్రువీకరించారు. 

బీజేపీ కూటమికి దేశంలో 292-338 సీట్లు వస్తాయనేది వారి అంచనా. అదానీ, సీబీఐ లతో ముడిపెట్టిన ఆరోపణలేమీ మోడీ విజయం మీద ప్రభావం చూపించలేవని ఈ సర్వే తేల్చేసింది. దేశం సంగతి ఎలాగైనా పోనిద్దాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ సర్వే ఫలితాలు విస్మయపరుస్తున్నాయి. ఈ క్షణంలో ఏపీలో ఎన్నికలు జరిగితే.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 24 నుంచి 25 సీట్లు వస్తాయని, జగన్ హవా తిరుగులేని రీతిలో యింకా బలపడుతున్నదని ఈ సర్వే తేల్చింది. 

‘వైనాట్ 175’ అనే నినాదాన్ని పాపులర్ చేస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలను మనమే గెలుచుకోవాలని అతిశయంగా మాట్లాడుతూ ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడిగినా కూడా బహుశా ఆయన ఎంపీ సీట్ల విషయంలో ఈ గణాంకాలను చెప్పడానికి కాస్త మొహమాట పడతారేమో అనిపిస్తోంది. 

సాధారణంగా ‘‘ప్రభువును మించిన ప్రభు భక్తి’’ అనే కాన్పెప్టు ఒకటి ఉంటుంది. బాస్ ను ఇంప్రెస్ చేయడంలో, బాస్ కూడా మొహమాట పడేస్థాయిలో భజన చేసే బ్యాచ్ కొందరు ఉంటారు. ఈ టైమ్స్ నౌ సర్వేను గమనిస్తే కూడా అలాగే అనిపిస్తోంది. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో వారికి ఎంతటి సత్సంబంధాలైనా ఉండవచ్చు. ఆ సంస్థకు ఏపీ సర్కారు ఎంతగానైనా సహకరిస్తుండవచ్చు. కానీ.. జగన్ ను ఇన్స్పైర్ చేయడానికి ఇప్పుడున్న 22 రిపీట్ అవుతుందని చెప్పినా వాళ్లు ఎంతో సంతోషిస్తారు. కానీ.. 24-25 అంటూ వందశాతం విజయాల మీద ఆశలు రేకెత్తించడం అనేది తమాషాగా కనిపిస్తోంది. 

ఎవ్వరెన్ని చెప్పినా.. 2019 ఎన్నికలకు ముందున్నంత సానుకూల వాతావరణం ఇప్పుడు ప్రజల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల లేదన్నది నిజం. 151 ఫిగర్ ను మళ్లీ రిపీట్ చేయాలన్నా సరే జగన్ అండ్ కో మునుపటి కంటె ఎక్కువ చెమటోడ్చాల్సి వస్తుందన్న మాట కూడా నిజం. 

ప్రజల్లో ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ప్రమాదకరంగా మారుతున్నది నిజం. వాస్తవాలు ఇలా ఉండగా.. టైమ్స్ నౌ వంటి సంస్థలు 24-25 ఎంపీసీట్లు గెలుస్తారని ప్రకటిస్తే.. ఇది పెయిడ్ సర్వే అని ప్రజలు అనుమానిస్తారు. ఇలాంటి సర్వే ఫలితాలను నమ్మి పాలకపక్షం విర్రవీగితే అది వారికి చేటుచేస్తుంది. ఇలాంటి భజన సర్వేల పట్ల జగన్ అప్రమత్తంగా ఉండాలి.