పాపం.. పవన్ ను నమ్ముకొని తప్పు చేస్తున్నారా?

పవన్ కల్యాణ్ తో సినిమా.. ప్రతి దర్శకుడికి ఓ కల. ఇది ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం కొంతమంది దాన్ని ఓ పీడకల అనుకుంటున్నారు. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇదే నిజం. ప్రస్తుతం పవన్…

పవన్ కల్యాణ్ తో సినిమా.. ప్రతి దర్శకుడికి ఓ కల. ఇది ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం కొంతమంది దాన్ని ఓ పీడకల అనుకుంటున్నారు. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇదే నిజం. ప్రస్తుతం పవన్ తో సినిమాలు చేస్తున్న దర్శకులు మింగలేక కక్కలేక తమ కెరీర్ ను లాగిస్తున్నారు.

ఉదాహరణకు క్రిష్ నే తీసుకుంటే.. పవన్ తో హరిహర వీరమల్లు సినిమా తీస్తున్నాడు ఈ దర్శకుడు. సినిమాను ఎనౌన్స్ చేసినప్పుడు అతడు ఎంతో ఉత్సాహంతో కనిపించాడు. ఈ సినిమాతో టాప్ లీగ్ లోకి వెళ్లిపోవచ్చనుకున్నాడు. కట్ చేస్తే, అదే దర్శకుడు ఇప్పుడు నీరసంగా కనిపిస్తున్నాడు. అంతా అగమ్యగోచరం. ఎప్పుడు పవన్ సెట్స్ పైకి వస్తాడో.. ఎప్పుడు సినిమా పూర్తవుతుందో..?

తన కెరీర్ లోనే భారీ గ్యాప్ ను ఎదుర్కొంటున్నాడు క్రిష్. అప్పుడెప్పుడో బాలయ్యతో చేసిన కథానాయకుడు-మహానాయకుడు సినిమాల తర్వాత పవన్ తో మూవీ అనుకున్నాడు. అప్పట్నుంచి ఈ ప్రాజెక్ట్ నడుస్తూనే ఉంది. మధ్యలో కరోనా దయ వల్ల కొండపొలం వచ్చింది కానీ, లేదంటే క్రిష్ ఫిల్మోగ్రఫీలో మరో సినిమా కనిపించి ఉండేది కాదు. దీనికి కారణం పవన్ కల్యాణ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ హీరో కొత్త సినిమా ప్రకటించిన ప్రతిసారి క్రిష్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

మరో దర్శకుడు హరీష్ ది కూడా ఇదే పరిస్థితి. పవన్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఎనౌన్స్ చేశాడు. పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. కానీ ఆ తర్వాత ఆ సినిమా ఆగిపోయిందన్నారు. చాన్నాళ్లు గ్యాప్ వచ్చేసింది. ఏమైందో ఏమో, మళ్లీ ప్యాచప్ అయింది. ఈసారి ఉస్తాబ్ భగత్ సింగ్ అంటూ మరో పోస్టర్. అయినప్పటికీ ప్రాజెక్టు సెట్స్ పైకి వస్తుందన్న గ్యారెంటీ లేదు.

ఉన్నంతలో సముత్తరఖని పరిస్థితి కాస్త బెటర్. పవన్ తో వినోదాయ శితం రీమేక్ ను డైరక్ట్ చేయాలి ఈ నటుడు కమ్ డైరక్టర్. ఈ సినిమాకు పవన్ 20 రోజుల కాల్షీట్లు ఇస్తే సరిపోతుంది. ఇస్తానని మాటిచ్చాడు కూడా. కానీ సెట్స్ పైకి వస్తాడో లేదో తెలీదు. అందుకే సముత్తరఖని, ఈ ప్రాజెక్టుతో సంబంధం లేకుండా ఎంచక్కా సినిమాల్లో నటిస్తూ కెరీర్ లో గ్యాప్ లేకుండా చూసుకున్నాడు.

ఇప్పుడీ లిస్ట్ లోకి సుజీత్ చేరబోతున్నాడు. పవన్-సుజీత్ కాంబోలో సినిమా 30న లాంఛ్ అవుతోంది. డీవీవీ దానయ్య నిర్మాత. కొబ్బరికాయ కొట్టడానికి పవన్ ఎప్పుడూ రెడీ. కాకపోతే సెట్స్ పైకి ఎప్పుడు వస్తాడనేది ఎవ్వరూ చెప్పలేరు. సో.. సుజీత్ కూడా భారీ గ్యాప్ వస్తుందని మానసికంగా ప్రిపేర్ అయి, కొబ్బరికాయ కొడితే మంచిది.

ఇటు నిర్మాతల పరిస్థితి కూడా అంతే..

ప్రాజెక్టులు డిలే అయితే ఆటోమేటిగ్గా నిర్మాతలకు కూడా గ్యాప్ తప్పదు. పవన్ ప్రాజెక్టులపై కోట్ల రూపాయలు పెట్టిన నిర్మాతలు, ఎటూపాలుపోని పరిస్థితిలో పడ్డారు. ఆ ప్రాజెక్టు పక్కన పెట్టి మరో సినిమా స్టార్ట్ చేయలేరు. అలా అని ఉన్న ప్రాజెక్టును ముందుకు నడిపించలేరు. పవన్ కాల్షీట్ల కోసం వీళ్లంతా చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు.

పవన్ తో ఖుషీ లాంటి క్లాసిక్ తీసిన ఏఎం రత్నం అప్పటి పవన్ కు, ఇప్పటి పవన్ కు మధ్య స్పష్టమైన తేడాను చూస్తున్నాడు. చూడడం కాదు, అనుభవిస్తున్నాడు అనాలేమో. ఒక దశలో తన దగ్గర డబ్బులైపోవడంతో మరో నిర్మాతను తెచ్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చేశాడు. హరిహర వీరమల్లు సినిమా పూర్తయి, థియేటర్లలోకి వచ్చేంత వరకు రత్నంకు గుండెల్లో భయం పోదు.

మైత్రీ నిర్మాతల సంగతి సరేసరి. పవన్ కు దాదాపు ఆరేళ్ల కిందటే అడ్వాన్స్ ఇచ్చి ఎదురుచూడడం వీళ్ల వంతయింది. పీపుల్ మీడియా విశ్వప్రసాద్ కూడా ఇప్పుడీ వెయిటింగ్ లిస్ట్ లోకి చేరారు. తాజాగా డీవీవీ దానయ్య కూడా ఎంటరయ్యాడు. వీళ్లంతా ఎప్పుడు పవన్ సినిమాల నుంచి విముక్తి పొందుతారనేది ఆ 'దేవుడి'కే తెలియాలి.

వారాహి రెడీ అయింది.. మరి వీళ్ల పరిస్థితి ఏంటి?

ఓవైపు పవన్ తో సినిమాలు చేస్తున్న దర్శకులు, నిర్మాతల పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు ఈ నటుడు మాత్రం రాజకీయ పర్యటనలకు సిద్ధమౌతున్నారు. వారాహి అనే వాహనాన్ని కూడా రెడీ చేశారు. తాజాగా బండికి పూజలు కూడా చేశారు. పవన్ ఈ బండి ఎక్కితే మాత్రం, మేకర్స్ కు తడిసిమోపెడైనట్టే. ఏదేమైనా 2023, 2024లో పవన్ తో సినిమా అంటే కత్తి మీద సామే.