భార్య చనిపోయినా 12 ఏళ్లు పెళ్లి చేసుకోకుండా బిడ్డలకు పెళ్లిళ్లు చేసి కుటుంబానికి అండగా నిలిచిన ఓ వృద్ధుడు.. చివరకు తన కోడలినే వివాహం చేసుకున్న సంచలన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. 70 ఏళ్ల మామ, 28 ఏళ్ల కోడల్ని పెళ్లి చేసుకున్నాడు. గోరఖ్ పూర్ జిల్లాలోని చఫియా ఉమ్రావ్ గ్రామంలో ఈ పెళ్లి జరిగింది. కొడుకు చనిపోయి వితంతువుగా జీవిస్తున్న కోడలి మెడలో తాళికట్టిన ఆ మామపై గ్రామస్తులు దుమ్మెత్తిపోస్తున్నారు.
అసలేం జరిగింది..?
ఉత్తరప్రదేశ్ ఛపియా ఉమ్రావ్ గ్రామానికి చెందిన కైలాష్ యాదవ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. చౌకీదార్ గా పనిచేస్తున్న కైలాష్ యాదవ్ కి 12 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. నలుగురి కొడుకులకు పెళ్లిళ్లు చేశాడు. అందరూ కుటుంబాలతో సహా వేరుపడ్డారు. కైలాష్ ఒంటరిగా జీవిస్తున్నాడు. రెండేళ్ల క్రితం అతడి మూడో కొడుకు చనిపోయాడు. అతడి భార్య పూజ ఒంటరిగా జీవిస్తోంది. సడన్ గా గుడిలో పూజ, కైలాష్ పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కోడల్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన కైలాష్ ని చూసి అందరూ ప్రశ్నించినా మౌనమే అతని సమాధానం. ఎవరితోనూ వృద్ధ కైలాష్ ఏమీ మాట్లాడటం లేదు.
పూజ లవ్ ఎఫైరే కారణమా..?
భర్త చనిపోయిన రెండేళ్ల తర్వాత పూజ వేరే వ్యక్తితో చనువుగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న క్రమంలో సడన్ గా మామ వచ్చి తాళి కట్టాడు. ఆ పెళ్లి ఇష్టం లేక, పూజను కైలాష్ పెళ్లి చేసుకున్నాడని కొంతమంది గ్రామస్తులు చెబుతున్నారు.
కోడలిని మామ పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. అందులోనూ ఆమె వయసు 28, అతడి వయసు 70 కావడం మరింత వివాదాస్పదమైంది. మిగతా ముగ్గురు కొడుకులు కైలాష్ ని చెడామడా తిడుతున్నారు. తప్పు చేశావని నిలదీశారు. కానీ పూజ మెడలో తాళి పడిపోవడంతో అందరూ సైలెంట్ అయిపోయారు.