టీడీపీ సభలు, సమావేశాలంటే జనం బెంబేలెత్తిపోయే పరిస్థితి. ఇటీవల చంద్రబాబునాయుడు వరుస సభల్లో 11 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. తాజాగా కుప్పంలో చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర మొదలు పెట్టారు. మొదటి రోజే మరో అపశ్రుతికి లోకేశ్ పాదయాత్ర కారణమైంది. పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
గుండెపోటుకు గురైనట్టు వైద్యులు చెబుతున్నారు. ఆయనకు వైద్యులు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇదిలా వుండగా లోకేశ్ పాదయాత్ర అంశం పక్కకు పోయి, తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం తీవ్ర చర్చనీయాంశమైంది. తండ్రీతనయుల సభలంటే ఏదో ఒక అపశ్రుతి జరగాల్సిందే అనే నెగెటివ్ సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. తండ్రీతనయుల కార్యక్రమాలకు వెళితే… ఇదేం ఖర్మరా బాబూ అని నెత్తికేసి కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని టీడీపీ కార్యకర్తలు, నాయకులు వాపోతున్నారు.
గతంలో గోదావరి పుష్కరాల్లో బాబు పబ్లిసిటీ పిచ్చికి 29 మంది సామాన్య ప్రజలు కోల్పోవడాన్ని ఈ సందర్భంగా ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటిది కాకపోయినా, అపశ్రుతి చోటు చేసుకోవడం గమనార్హం. అస్వస్థత వరకే పరిమితం కావడం సంతోషించదగ్గ విషయం.
శుభమా అని మంచి ముహూర్తం చూసుకుని పాదయాత్ర మొదలు పెడితే, తారకరత్న తీవ్ర అనారోగ్యానికి గురయ్యారనే ఆవేదన టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. ఇదంతా తండ్రీతనయుల లెగ్‌ల ప్రభావమని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ సంకల్పాల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ప్రకృతి సహకరించడం లేదని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు పాదయాత్ర చేయాల్సిన అవసరం లోకేశ్‌కు ఏమొచ్చిందని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.