ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని మీడియా రాక్షసిగా చిత్రీకరించడం బాధగా ఉందని డైలాగ్‌కింగ్ తనయ, ప్రముఖ నటి మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో రియా చక్రవర్తిని దోషిగా చూపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ నేషనల్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి రియా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సుశాంత్‌తో తనకున్న అనుబంధం గురించి ఆమె ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత రియాకు మద్దతు పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. #JusticeForRheaChakraborty అంటూ చాలా మంది నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.
సుశాంత్-రియా ఎపిసోడ్‌పై మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ సోషల్ మీడియా ద్వారా తనదైన స్టైల్‌లో ఆలోచనాత్మకంగా స్పందిస్తూ #JusticeForSushanthSinghRajput , #JusticeForRheaChakraborty అంటూ పోస్ట్ పెట్టారు. అలాగే ఆ ఇంటర్వ్యూపై మంచు లక్ష్మి స్పందించారు.
‘ఇంటర్వ్యూపై స్పందించాలా వద్దా అని చాలా ఆలోచించా. ఈ విషయంలో ఒక అమ్మాయిని మీడియా రాక్షసిగా చిత్రీకరించడం బాధగా ఉంది. నాకు నిజం తెలియదు. సత్యం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నిజం నిజాయితీగా బయటకు వస్తుందని భావిస్తున్నాను. నిజం తెలియకుండా ఓ వ్యక్తిని, ఆమె కుటుంబం మొత్తాన్ని కించపరచకుండా ఉండొచ్చు. మన స్వరం వినిపించాల్సి వచ్చినప్పుడు హార్ట్‌ఫుల్‌గా మాట్లాడకపోతే మనం ఎలా ప్రామాణికం అవుతాము. నేను నా కొలీగ్ కి పూర్తి మద్దతిస్తా’ అంటూ లక్ష్మీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మంచు లక్ష్మి ధైర్యాన్ని అభినందించాల్సిందే.