ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలో అధికారపక్షం/ప్రభుత్వం పనితీరుపై చాలా విశ్లేషణలు వచ్చాయి. లోకల్ గా చేసిన సర్వేలతో పాటు జాతీయ స్థాయిలో ఎనాలిసిస్ లు కూడా పుట్టుకొచ్చాయి. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల పనితీరు ఎలా ఉంది? ఇక్కడే నక్కకు, నాగలోకానికి ఉన్నంత గ్యాప్ కనిపిస్తోంది.
మొదటిదఫా ముఖ్యమంత్రి అయిన సమయంలో కేసీఆర్ కు ప్రతిపక్షం నుంచి ఎలాంటి సమస్యలు, సవాళ్లు ఎదురుకాలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రతిపక్షం అనేదే లేకుండా చేసుకోగలిగారు. కానీ రెండోసారి సీఎం అయినప్పుడు మాత్రం కేసీఆర్ కు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం ప్రతిపక్షాలు ఆయన్ని ముప్ప తిప్పలు పెడుతున్నాయి. కరోనా కష్టకాలంలో పొరుగు రాష్ట్రం ఏపీతో పోల్చి మరీ ఇబ్బంది పెడుతున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. వీటితో పాటు మరెన్నో సమస్యల్ని ఎత్తిచూపుతున్నారు.
ఇక ఏపీలో ప్రతిపక్షం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. జగన్ కనుసైగ చేస్తే వైసీపీలోకి వలస వచ్చే ఎమ్మెల్యేల కారణంగా చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదానే రద్దయ్యే ప్రమాదంలో పడింది. ఇలాంటి స్థితిలో చద్రబాబు సొంత పార్టీ నేతలను కాపాడుకోడానికి ప్రయాస పడుతున్నారు. మరోవైపు జగన్ పాలనలో ప్రజా సమస్యలే లేకపోవడంతో.. ప్రతిపక్ష పార్టీ పాత్ర పూర్తిగా శూన్యమైంది.
కరోనా కష్టకాలంలో తెలంగాణలో ప్రతిపక్షాలు, అధికార పక్షం కంటే హుషారుగా జనంలోకి వెళ్లాయి. వరదల సమయంలోనూ సీతక్కలాంటి ఎమ్మెల్యేలు జనంతో మమేకమై టీఆర్ఎస్ కి చెమటలు పట్టించారు. రేవంత్ రెడ్డి సెగ కేసీఆర్ కి ఉండనే ఉంది. బండి సంజయ్, రాజా సింగ్ వంటి బీజేపీ నేతలు సైతం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వణికిస్తున్నారు.
ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. ప్రతిపక్షమే ప్రభుత్వాన్ని చూసి వణికిపోతోంది. కరోనా భయంతో ఏపీని వదిలేసి అజ్ఞాతవాసం గడుపుతున్న చంద్రబాబు, అమరావతి చుట్టూ పరిభ్రమిస్తూ గల్లీ లీడర్ గా మారారు. ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఫెయిలైన చంద్రబాబు ఈ 14 నెలల కాలంలోనే ప్రతిపక్ష నేతగా దారుణంగా విఫలమయ్యారు.
ప్రస్తుతం ఏపీలో టీడీపీ పోషించాల్సిన ప్రతిపక్ష పాత్రను అంతో ఇంతో జనసేన-బీజేపీ పార్టీలు పోషిస్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా వాళ్లకు ఆ హోదా లేకపోయినా, ప్రాక్టికల్ గా చూస్తే ఏపీలో అసలైన ప్రతిపక్షం ఇదే అని చెప్పకతప్పదు. ఇలా ఏపీ-తెలంగాణ ప్రతిపక్షాల పనితీరు మధ్య చాలా తేడా కనిపిస్తోంది.