ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిర్వహించే కొవిడ్ కేర్ సెంటర్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయంపై ముఖ్యమంత్రి జగన్ గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ప్రైవేట్ ఆస్పత్రులపై ఆకస్మిక దాడులు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ లు రద్దు చేయాలని కూడా ఆదేశాలిచ్చారు.
సీఎం ఆదేశాలతో అధికారుల్లో కదలిక వచ్చింది కానీ రాష్ట్రంలో అత్యల్పంగా 5 నుంచి 10 ఆస్పత్రులపై మాత్రమే కొరడా ఝళిపించగలిగారు. మిగతా చోట్ల షరా మామూలే. ఆస్పత్రి పేరుతో బిల్ ఇస్తే గొడవలైపోతున్నాయని చిత్తుకాగితంపై బిల్లు రాసి ఇస్తున్న సందర్భాలు కోకొల్లలు. మరికొన్నిచోట్ల ప్రభుత్వ ఉద్యోగులు ఇలా కొవిడ్ బిల్లులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల నెల్లూరులో ఓ ప్రభుత్వ ఉద్యోగి కొవిడ్ బారినపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. వారం రోజులకి 4లక్షల 80వేల రూపాయల బిల్లు వేశారు. మెడికల్ రీఎంబర్స్ మెంట్ తో ఇబ్బంది ఉండదు కదా అని ఫీజు చెల్లించి రశీదు అడిగాడు ఆ ఉద్యోగి. బిల్ తీసుకున్నారు కానీ రశీదు ఇవ్వడానికి ససేమిరా అన్నారు ఆస్పత్రి నిర్వాహకులు. మరీ డిమాండ్ చేస్తే ప్రభుత్వ లెక్కల ప్రకారం వారానికి 30వేలు అయినట్లు బిల్ తీసి చేతిలో పెట్టారు.
దీంతో సదరు ఉద్యోగి ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమయ్యాడు. కనీసం మీడియాకు సమాచారమిద్దామంటే, ఆస్పత్రి వారిచ్చిన బిల్లు 30వేలు మాత్రమే. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా కేవలం క్యాష్ పేమెంట్ తీసుకోవడంతో ఆధారాలు చూపించడం కష్టమైంది. దీంతో చేసేదేం లేక సైలెంట్ అయ్యారు.
గుంటూరు, విజయవాడ, తిరుపతిలో సైతం ఇలాంటి ఉదంతాలే ఉన్నాయి. విశాఖ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులే కాకుండా ఉత్తరాంధ్రలోని చిన్న పట్టణాల్లో కూడా కొవిడ్ కేర్ సెంటర్లు బాధితుల నుంచి ఫీజులు భారీగా వసూలు చేస్తున్నాయి. రశీదులు ఇవ్వకుండా తప్పించుకుంటున్నాయి. సీఎం జగన్ నేరుగా ఈ విషయాన్ని అధికారుల ముందు ప్రస్తావించి చర్యలు తీసుకోమన్నా కూడా ఫలితం లేదంటే.. కార్పొరేట్ మాఫియా ఏ స్థాయిలో మేనేజ్ చేయగలుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
కరోనా బాధితుల ప్రాణభయమే పెట్టుబడిగా చెలరేగిపోతున్నాయి కార్పొరేట్ ఆస్పత్రులు. కనీసం బిల్లులు కూడా ఇవ్వకుండా సాక్ష్యాధారాలను నాశనం చేస్తున్నాయి.