టాలీవుడ్ లో తమ సినిమాలతో, తాము రాసే మాటలతో, కథలతో జనాలకు ఉచిత సందేశాలు ఇచ్చే దర్శకులు చాలా మంది ఉన్నారు. ఉన్నత స్థాయి వ్యక్తిత్వాలు, సామాజిక బాధ్యతతో కూడిన కథలను వారు తెరపై ఆవిష్కరిస్తూ ఉంటారు. సినిమా అవతలకు వచ్చి మాట్లాడినా వాళ్లు పెద్ద పెద్ద ప్రబోధకుల్లా మాట్లాడతారు! ఎక్కడ లేని నీతులు చెబుతారు.
గొప్ప గొప్ప వ్యక్తిత్వాల గురించి మాట్లాడతారు! ఇదంతా బాగుంది కానీ.. ఎటొచ్చీ ఆ కథకులు, రచయితలు తమ జీవితంలో ఆ విలువలను ఎంత వరకూ పాటిస్తారు? అనేదే సందేహంగా మారింది. ఇక్కడ వారి వ్యక్తిగత అంశాల గురించి ప్రస్తావించడం లేదు. వాళ్ల భావచౌర్య కళ గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నాం. ఒకరని కాదు..
అందరూ అందరే! ఒకరికి మించి మరొకరు.. అన్నట్టుగా వార్తల్లోకి వస్తూ ఉన్నారు. వీళ్లపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి, అందుకు ఆధారాలనూ అనేక మంది చూపిస్తూ ఉన్నారు. ప్రేక్షకులకూ వీరి గురించి జ్ఞానోదయం అవుతూ ఉంది. అయితే ఆ దర్శకులే తమ గుట్టు బయటపడిందే లేదన్నట్టుగా కామ్ గా ఉంటారు.
ఒక నీతి కథలో నగ్నంగా ఊరేగే రాజు మాదిరి ఉంది తెలుగు దర్శకుల పరిస్థితి. రాజు నగ్నంగా ఊరేగుతున్నాడని ప్రజలు ఎవరూ బయటకు చెప్పలేరు. ఈ దర్శకుల చుట్టూ ఉన్న హీరోలు, నిర్మాతల పరిస్థితి బహుశా రాజుకు భయపడే ప్రజల వంటిది కావొచ్చు. అయితే బయటి వాళ్లకు మాత్రం అలాంటి భయాలు లేవు. అందుకే ఈ దర్శకులు కాపీ క్యాట్స్ అనే విషయాన్ని చర్చించడానికి వెనుకాడటం లేదు.
దేన్నీ వదలడం లేదు!
80లలో వీడియో క్యాసెట్లు అందుబాటులోకి వచ్చాకా టాలీవుడ్ లో కాపీ పోకడ ఎక్కువ అవుతూ వచ్చింది. అయితే ఆ తరం దర్శకులు, కథకులు ఏదో ఒక పాయింట్ ను తీసుకుని కథలు అల్లుతూ వచ్చారు. ఖైదీ సినిమాకు హాలీవుడ్ స్ఫూర్తి ఉంది. అయితే అది కేవలం స్టార్టింగ్ సీన్ కు మాత్రమే పరిమితం. తన కెరీర్ ఆరంభంలో చెన్నైలో ఆడుతున్న ఒక హాలీవుడ్ సినిమాను చూసి తనను కొత్త కథ, సీన్లు రాయమన్నారని దర్శకుడు వంశీ తన ఇంటర్వ్యూల్లో చెప్పారు.
ఆ తరహాలో అనేక మంది విదేశీ సినిమాల స్ఫూర్తిని ఓపెన్ గా చెప్పారు. గొల్లపూడి మారుతీరావు వంటి అచ్చ తెలుగు కథకుడు కూడా అలాంటి ప్రభావాలకు మినహాయింపు కాదు. ఆయన కథా,కథనాలు అందించిన 'జేబుదొంగ' సినిమాకు హిచ్ కాక్ సినిమా స్ఫూర్తి ఉంది. 'నార్త్ బై నార్త్ వెస్ట్' సినిమా మూలకథను ఆధారంగా చేసుకుని 'జేబుదొంగ' కథను తయారు చేశారని స్పష్టం అవుతుంది. అయితే చాలా వరకూ కథను తెలుగీకరించారు! అలా అప్పట్లోనే విదేశీ సినిమాల స్ఫూర్తితో తెలుగులో సినిమాలు వచ్చాయి.
అవన్నీ కూడా అసలు వాళ్లకు క్రెడిట్ ఇవ్వని అంశాలే. అయితే ఆ తరం దర్శకులు, రచయితలు సీన్లను మాత్రం యథారీతిన కాపీ కొట్టలేదు. చాలా వరకూ తిరగరాసుకున్నారు. ఒక్కోసారి ఆ తిరగరాసినప్పుడు ఈ అనుకరణ సీన్లు పేలవంగా తయారయ్యాయి కూడా. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా స్ఫూర్తితో టాలీవుడ్ లో పలు కౌబాయ్ సినిమాలు వచ్చాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ పాత్రలను కాపీ కొట్టి తెలుగులో తయారు చేసిన పాత్రలు ఒరిజినల్ తో పోల్చినప్పుడు తేలిపోయాయి.
ఇప్పుడు సీన్లు సీన్లే లేపుతున్నారు!
ఏవో హాలీవుడ్ సినిమాలను చూసి వాటిలోని మూల పాయింట్లను తీసుకుని తెలుగులో సినిమాలు చేసుకోవడం, ఆ పాత్రల ఆధారంగా మరో తరహా కథలను రాసుకోవడం, అక్కడి ఎమోషనల్ కథలను ఇక్కడ సెంటిమెంట్ కథలుగా మార్చేసుకోవడం అదంతా 80లలో దర్శకుల, కథకుల ప్రయత్నం. అయితే నయాతరం దర్శకులు ఏకంగా సీన్ టూ సీన్ లేపేస్తున్నారు! పెద్దగా కష్టపడటానికి కూడా ఇష్టపడటం లేదేమో!
టాప్ డైరెక్టర్లే ముందు!
ఎవరో అనామకులు, కొత్తగా సినిమాలు తీస్తున్న వాళ్లు, గుర్తింపు కోసం తపించే వాళ్లు కాపీ కొట్టారంటే అదో లెక్క. వాళ్లకు అంత సత్తా ఉండదు, సొంతంగా రాసుకునే శక్తి ఉండదు.. కాబట్టి వాళ్లు ఏ హాలీవుడ్ సినిమాల నుంచినో సీన్లను యథాతథంగా దించేస్తున్నారంటే అదంత సీరియస్ విషయం కాకపోవచ్చు. అయితే తెలుగులో భావదారిద్య్రం ఏమిటంటే.. టాప్ లీగ్ దర్శకులే ఎక్కువగా ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు, అడ్డంగా దొరుకుతున్నారు.
కొత్తగా మెగాఫోన్ పట్టే వాళ్లు నవ్యతతో కూడిన కథలతో వస్తున్నారు. ఒకవైపు తెలుగులో వైవిధ్యభరితమైన సినిమాలు వస్తున్నాయి. యంగ్ మూవీ మేకర్లు టాలీవుడ్ ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. వాళ్లు సక్సెస్ కోసం అడ్డదారులు తొక్కడం లేదు! కాపీ కొట్టడం, వేరే సినిమాల ప్రభావం లేకుండా వాళ్లు ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తున్నారు. అయితే ఎలైట్ లీగ్ లోని దర్శకులు మాత్రం.. ఆ సినిమాలోంచి ఒక సీను, మరో సినిమాలోంచి మరోసీను అన్నట్టుగా సినిమాలు చుడుతున్నారు! అసలు వాళ్లకు క్రెడిట్ ఇవ్వకుండా వీళ్లు తమ దర్పాన్నీ ప్రదర్శిస్తున్నారు.
త్రివిక్రమే గురూజీ!
తెలుగులో కాపీ సీన్లు, డైలాగులతో బాగా పేరు తెచ్చుకున్న దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. పలు హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టిన సీన్లతో, మాటలతో మాంత్రికుడుగా పేరు తెచ్చేసుకున్నారు గురూజీ! దర్శకుడిగా మారాకా కూడా అదే పరంపరనే కొనసాగిస్తూ ఉన్నారు. త్రివిక్రమ్ సినిమా వచ్చిందంటే అది ఎన్నో సినిమాల కాపీ కలబోత అనే విషయం సామాన్య ప్రేక్షకుడికి స్పష్టత వచ్చింది.
హాలీవుడ్ సినిమాల్లోని సీన్లను యథాతథంగా చిత్రీకరిస్తూ వీడియో ఆధారాలతో సహా త్రివిక్రమ్ దొరికిపోతున్నారు. నువ్వే నువ్వే, అతడు, జులాయి, ఖలేజా.. ఇలా ఏ సినిమాలో అయినా కొన్ని సీన్లను అయినా కాపీ కొట్టకుండా ఉండలేకపోయారు త్రివిక్రమ్. వాటికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా అయితే ప్రయోజనం లేదని.. త్రివిక్రమ్ కూడా రూటు మార్చారు. పాత తెలుగు నవలలు, పాత తెలుగు సినిమాల మీద దృష్టి సారించారు.
హాలీవుడ్ నుంచి అరువు తెచ్చుకుంటే కనుకొంటారా.. మరి తెలుగు పాత సినిమాల నుంచి తెస్తే కనుగొనగలారా? అని ప్రేక్షకులకు త్రివిక్రమ్ ఒక పరీక్ష పెట్టినట్టుగా ఉన్నారు. అయితే ఈ పరీక్షలోనూ ప్రేక్షకులే నెగ్గారు. అతడు సినిమాలో కొన్ని సీన్లు మధుబాబు రాసిన ఒక నవలలో చదవొచ్చు, మీనా నవలను అఆ గా తీసుకొచ్చారు. ఆ కథ విషయంలో అయితే మొదట్లో క్రెడిట్ ఇవ్వలేదు. అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాకా యద్దనపూడి సులోచనారాణి పేరును తప్పక ప్రస్తావించారు.
వాస్తవానికి తెలుగు నవలల్లో మంచి సినిమాలుగా తీయదగిన కథలున్నాయి. కుటుంబ కథలే కాదు, గొప్ప గొప్ప థ్రిల్లింగ్ నవలలు కూడా ఉన్నాయి. ఆ రచయితలకు క్రెడిట్ ఇస్తూ వాటిని సినిమాలుగా తీస్తే సూపర్ హిట్స్ కొట్టడం కష్టమేమీ కాకపోవచ్చు. కొమ్మూరి వేణుగోపాలరావు నవల 'పెంకుటిల్లు' ను సినిమాగా తీయగల నేర్పు ఉన్న వాళ్లు ఆ పనిపై దృష్టి సారించవచ్చు. మల్లాది రాసిన 'శనివారం నాది' నవలను నాటి కథగానే చూపుతూ బ్రహ్మాండమైన థ్రిల్లింగ్ సినిమా అయినా, వెబ్ సీరిస్ ను అయినా ప్లాన్ చేయొచ్చు.
తరచి చూస్తే అలాంటి కథలెన్నో లైబ్రరీల్లో ఉంటాయి. విషయం లేని కథల మీద కోట్లు పెట్టే కన్నా అలాంటి నవల్స్ ను సినిమాలుగా తీసుకోవచ్చు. త్రివిక్రమ్ లాంటి వాళ్లు తెలుగు లైబ్రరీలను సినిమాల కోసం వాడుకుంటారు. అయితే వీళ్లు క్రెడిట్ ఇవ్వడానికి ఇష్డపడరు. తాము లైబ్రరీకి వెళ్లి చదివినందుకు గానూ క్రెడిట్ అంతా తమకే దక్కాలన్నట్టుగా వ్యవహరిస్తారు. అది మాత్రం భావ్యం కాదు.
త్రివిక్రమ్ బాధితులు పెద్ద పెద్ద హాలీవుడ్ డైరెక్టర్లే కాదు, సాధారణ కథారచయితలు కూడా. అరవింద సమేత విషయంలో మొండికత్తి రచయిత వేంపల్లి గంగాధర్ గగ్గోలు పెట్టారు. ఆ తర్వాత ఆ వివాదం ఎలా పరిష్కారం అయ్యిందో. తన అభిమాన రచయిత యద్దనపూడి సులోచనారాణి కథనూ ఆమెకే క్రెడిట్ ఇవ్వకుండా సొంతం చేసుకున్నారు త్రివిక్రమ్.
అల వైకుంఠపురంలో సినిమాతో కూడా తన పంథా ఏమీ మారలేదని, ఈ విషయంలో తను ఎవరినీ లెక్క చేసేది లేదని, కాపీలు కొనసాగుతాయని స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒరిజినల్ రచయితలకు క్రెడిట్ ఇవ్వకుండా, తను తీసిందంతా తన క్రెడిట్ లో వేసుకునేందుకు ఆయన వెనుకాడరని స్పష్టం అవుతోంది. విదేశాల్లో అయితే ఇలాంటి ప్లేజరిజాన్ని సహించరు. కోర్టుకు లాగి ఆస్తులు రాయించుకుంటారు. ఇండియాలో మాత్రం ఇలాంటి ఆటలు సాగిస్తూ గురూజీలు అయిపోవచ్చు!
సుకుమార్ సంగతేంటి!
ఒక చిన్న సినిమా విషయంలో కాపీతో చర్చకెక్కారు సుకుమార్. కుమారి 21ఎఫ్ అనే తనే నిర్మించిన సినిమాకు కథ తనే రాసినట్టుగా సుకుమార్ టైటిల్ కార్డ్స్ లో వేసుకున్నారు. ఆ కథకు తనకు స్ఫూర్తి కూడా ఉందని చెప్పుకొచ్చారు. తను కాలేజీ లో చదివే రోజుల్లో తమ సీనియర్ ఒక అమ్మాయి గురించి చెప్పుకునే మాటలే తన కథకు మూలమన్నట్టుగా చెప్పారు. అయితే ఆ సినిమా కథ అంతా లైలా సేస్ అనే ఫ్రెంచ్ సినిమా నుంచి మక్కికిమక్కి దించారని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది. ఫ్రెంచి సినిమా నుంచి కాపీ కొట్టడం తప్పుకాదనే అనుకుందాం. అది తన మెదడులో పుట్టిన కథ అన్నట్టుగా సుకుమార్ మరేదో కథ చెప్పడం మాత్రం కామెడీ!
ఒక ఫ్రెంచ్ సినిమా చూశాం.. తీస్తే బాగుంటుందనిపించింది..అందుకే తీశామని.. సుకుమార్ చెప్పి ఉంటే ఆయనపై చాలా గౌరవం పెరిగేది. కాపీ కొట్టడమే గాక, తామే రాసినట్టుగా నమ్మించడానికి మరో కల్పితకథలను చెప్పడం మాత్రం అంత గొప్ప క్రియేటివీ కాకపోవచ్చు. నాన్నకు ప్రేమతో సినిమాలోని పలు సీన్ల వెనుక ఉన్న స్ఫూర్తి సీన్లు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా సుకుమార్ కూడా విదేశీ సినిమాల ప్రభావానికి లోనయిన వ్యక్తే అనే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.
రేపోమాపో రాబోయే సుకుమార్ సినిమా పుష్ప విషయంలో కూడా అప్పుడే కాపీ చర్చలు ఆరంభం అయ్యాయి. వేంపల్లి గంగాధర్ అనే రచయితే ఈ సినిమా వెనుకా తన రచనల స్ఫూర్తి ఉందనే ఆరోపణలు చేస్తూ ఫేస్ బుక్ పోస్టులు పెట్టాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి తను రాసిన కథను ఒకదాన్ని అతడు ఉదాహరిస్తున్నాడు. అయితే ఈ వివాదం ఎంత వరకూ వెళ్తుందో, ఎవరి వాదన రైటవుతుందు ముందు ముందు తెలుస్తుంది.
మామూలుగా అయితే సుకుమార్ వంటి ఇంటెలెక్చువల్ ఆదివారం అనుబంధంలో వచ్చిన కథలను తన సినిమాల కోసం వాడేసుకుంటారు అనే ఆరోపణ చిన్నదే అవుతుంది. అయితే వీళ్లు ఇది వరకూ కాపీ పోకడలతో వార్తల్లోకి ఎక్కిన వారే కావడంతో.. అయ్యే ఉండచ్చేమో అనే అభిప్రాయాలు సామాన్య ప్రేక్షకుడికి ఏర్పడుతున్నాయి.
అలా కాకుండా.. అబ్బే ఆ డైరెక్టర్ అలాంటివాడు కాదు, ఎవరి క్రెడిట్ వారికి ఇస్తాడు.. అనే ఇమేజే తెచ్చుకుని ఉంటే, ఎవరైనా అనుచితమైన ఆరోపణలు చేస్తే వాటిని ప్రేక్షకులే పట్టించుకోరు! తోటకూర నాడే అనే సామెతను ఇక్కడ ప్రస్తావించవచ్చు.
సందేశాల కొరటాల.. ఏం సందేశం ఇస్తున్నారు?
తన సినిమాల్లో సామాజిక సందేశాలతో పేరు పొందిన దర్శకుడు కొరటాల సినిమా విషయంలో కాపీ ఆరోపణ బర్నింగ్ టాపిక్ గా మారింది. 'ఆచార్య' సినిమాకు సంబంధించి కథ విషయంలో కాపీ ఆరోపణలు వస్తున్నాయి. అయితే వాటిని ఆ దర్శకుడు, ఆ సినిమా నిర్మాణ సంస్థ తోసిపుచ్చింది. అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేసింది. ఆచార్య కథ తమది అని చెప్పుకుంటున్న వాళ్ల వాదనలో పస లేదని వీళ్లు స్పష్టం చేస్తున్నారు. అయితే నిజంగానే వీళ్లు కాపీ కొట్టి ఉంటే? అనే చర్చ కూడా సాగుతూ ఉంది. ఆరోపణలు చేస్తున్న వారి వాదన వారికీ ఉంది.
దర్శకుడు, నిర్మాణ సంస్థ తమ వాదన తాము వినిపిస్తున్నారు. ఇరు వాదనలూ సహేతుకంగానే ఉన్నాయి. సినిమా వస్తే కానీ అసలు కథ తేలకపోవచ్చు. నిజంగా కాపీ కొట్టి ఉంటే, అప్పుడు అది తేలినా ప్రయోజనం లేదని.. రచయితలు అన్యాయం అయిపోతారు తప్ప జరిగేది ఏమీ ఉండదాని మాత్రం స్పష్టం అవుతుంది. ఇది వరకటి కొరటాల సినిమా 'శ్రీమంతుడు' సినిమా విషయంలోనూ ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి.
స్వాతి పత్రికలో ప్రచురితం అయిన ఒక నవల ఆధారంగా ఆ సినిమా కథను తయారు చేశారని ఆ నవలా రచయిత నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ సినిమా విడుదల అయ్యాకా ఆ పిటిషన్ దాఖలైంది. ఆ సినిమా హీరో మహేశ్ బాబుకు కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని పిలిచింది. ఆ తర్వాత ఆ వివాదం ఎలా పరిష్కారం అయ్యిందో బయటకు పొక్కలేదు. మహేశ్ వరకూ నోటీసులు వచ్చేయంటే ఆ తర్వాత ఆ వివాదం ఎలా సెటిలయి ఉంటుందో ఎవరి ఊహలు వారివి.
కంప్యూటర్ను కనుగొన్న వాడి కన్నా కాపీ పేస్టును కనుగొన్నోడు గొప్ప!
ఇలానే అనుకోవాల్సి వస్తోందిప్పుడు. తెలుగు సినిమా టాప్ డైరెక్టర్లే కాపీ కొడుతుంటే, కాపీ కొట్టిన వారే టాప్ డైరెక్టర్లు అనే విడ్డూరాలను చూస్తుంటే.. కంప్యూటర్ ను కనుగొన్నోడి కన్నా, కాపీ పేస్టును కనుగొన్నోడే గొప్పోడు అని అనుకోవాల్సి వస్తోంది! వీళ్లే ఈజీగా చలామణి అయిపోతున్నట్టున్నారు. పద్ధతి మారాలి.. హాలీవుడ్ సినిమాల టైటిల్ కార్డ్స్ ను పరిశీలిస్తే.. సినిమా అయిపోయాకా.. ఐదారు నిమిషాలు టైటిల్సే వేస్తారు. ఆ టైటిల్సేమీ సినిమా యూనిట్ కు సంబంధించిన బస్సుల డ్రైవర్ల పేర్లు కాదు.
ఆ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఇచ్చే క్రెడిట్ అది. తెలుగులో మాత్రం రచన- దర్శకత్వం అంటూ రెండూ భాషల్లో పేరేసుకుంటారు. ఆ రచన ఏమిటో కూడా చెప్పరు. కథా, మాటలా.. అంటూ విశదీకరించరు. జస్ట్ రచన! ప్రేక్షకులకు అర్థం కాకుండా ఇదో ఈజీ టెక్నిక్.
దర్శకులు దార్శానికులు కూడా కావాలి!
తెలుగు సినిమా హాలీవుడ్ స్థాయికి చేరిందని అంటున్నారు. అయితే అది హాలీవుడ్ సినిమాల్లోని సీన్లను కాపీ కొట్టడంతో ద్వారా కాకూడదు! కొన్ని గొప్ప సినిమాలు తీసిన రచయితలు అక్కడ తమ సినిమాల వెనుక ఉన్న స్ఫూర్తి కథలను వివరిస్తూ డాక్యుమెంటరీలనే తయారు చేస్తున్నారక్కడ. తమ సినిమాకు మూల కథ వెనుక ఏ కథ దాగుందో, ఫలానా సీన్ ను తాము ఏస్ఫూర్తితో తయారు చేసినట్టో వివరిస్తూ వాళ్లే ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. అయితే తెలుగులో మాత్రం ఈ పనంతా ప్రేక్షకులు చేయాల్సి వస్తోంది.
పరోక్షంగా తమకు ఐడియాను ఇచ్చిన సినిమాలను కూడా అక్కడి వాళ్లు ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే తెలుగులో మాత్రం కాపీ కొట్టీ అంతా తమ క్రెడిటే అని చెప్పుకుతిరుగుతున్నారు కొంతమంది! పాశ్చాత్య నాగరికతను, వ్యక్తిత్వాలను మనం చాలా ఈజీగా విమర్శించేస్తూ ఉంటాం. మరి దీన్నేమనాలి? అక్కడి దర్శకులు దార్శానికుల్లా స్పందిస్తూ, తమ స్వచ్ఛమైన తీరును ఆవిష్కరిస్తారు. మనోళ్లు మాత్రం కాపీ పేస్టు కనుగోవడమే గొప్పగా ఫీలయిపోతుంటారు!
జీవన్ రెడ్డి.బి