నవ్యాంధ్ర కొత్త ముఖ్యమంత్రిగా అనుభవజ్ఞుడికి అవకాశమిద్దామనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు చేతికి పగ్గాలప్పగిస్తే.. ఆయన ఐదేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. అంతంతమాత్రంగానే ఉన్న ఆదాయాన్ని అథఃపాతాళానికి పడేశారు. ఈ ఐదేళ్లలో పోలవరం పూర్తి కాలేదు, రైతు రుణమాఫీలు పూర్తిగా చేయలేదు, పేదలకు కట్టి ఇస్తామన్న ఇళ్లన్నీ చివర్లో ఆగిపోయాయి, అమరావతి కలగానే మిగిలిపోయింది.
ఇన్ని పనుల్ని సగంలోనే ఆపేసిన చంద్రబాబు తీరా ఏంచేశారయ్యా అంటే.. బెజవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్ పూర్తి చేశారట. టీడీపీ ప్రచారం చూస్తుంటే.. ఆ పార్టీకి గత ఎన్నికల్లో 23సీట్లు మాత్రమే ఎందుకొచ్చాయో ఈజీగా అర్థమవుతుంది. ఒకరకంగా చంద్రబాబు తన అసమర్థతను తానే బైటపెట్టుకున్నట్లయింది.
ఐదేళ్లలో తాను పూర్తి చేసింది ఇది ఒక్కటేనని పరోక్షంగా ఒప్పుకున్నారు చంద్రబాబు. టీడీపీ లెక్కల ప్రకారం ఐదేళ్ల కాలంలో దుర్గ గుడి ఫ్లైఓవర్ 85శాతం పూర్తయిందట. అంటే ఐదేళ్ల కాలంలో టీడీపీ కేవలం ఓ ఫ్లైఓవర్ పనుల్ని 85శాతం మాత్రమే పూర్తి చేయగలిగింది. మిగిలిన 15శాతం పనుల్ని వైసీపీ కేవలం ఏడాదిలోనే పూర్తి చేసింది. స్థానిక ఎన్నికలు, కరోనా కష్టాలు లేకపోయి ఉంటే ఆరు నెలల కాలంలో దుర్గగుడి ఫ్లైఓవర్ బ్యాలెన్స్ పనులు పూర్తయ్యేవన్నమాట.
వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం మిగిలిన 30శాతం పనుల్ని పూర్తి చేసింది. అంటే టీడీపీ చేసింది 70శాతం మాత్రమే. ఐదేళ్లలో ఒక ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేని చంద్రబాబు, ఇక రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలనుకున్నారు. కేవలం ఫ్లైఓవర్ పూర్తయినందుకే చంకలు గుద్దుకుంటున్న టీడీపీ శ్రేణులు, ఇక పోలవరాన్ని కూడా వైసీపీ పూర్తి చేస్తే.. ఆ ఘనత కూడా మాదేనంటూ ఎగిరెగిరి పడతారేమో.