మందాకిని.. అందానికి ఒకానొక నిర్వచనం ఆమె రూపం. 80ల చివర్లో, 90ల మొదట్లో బాలీవుడ్ తో పాటు భారతీయ సినిమా సామ్రాజ్యంలో క్వీన్ తరహాలో చలామణి అయిన తార మందాకిని. సంచలన విజయం సాధించిన సినిమాల్లో కనిపించింది. సంచలనాత్మక రీతిలో నటించింది.
ఇక వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె స్నేహాలు దుమారం రేపాయి. ముంబై బాంబు పేలుళ్లకు మనుపు డాన్ దావూద్ ఇబ్రహీంతో ఆమె సన్నిహితంగా మెలిగింది. అతడి గర్ల్ ఫ్రెండ్ గా చలామణి అయ్యింది.
ఆ తర్వాత ఆమె వెండి తెరను విడిచి వెళ్లిపోయింది. ఒక బుద్ధిస్ట్ ను పెళ్లి చేసుకుంది. దలైలామా ఫాలోయర్ గా మారింది. బుద్ధిజం, యోగా వంటి వాటి విషయంలో ఆమె పని చేస్తూ వచ్చింది. 1996 వరకూ ఆమె సినిమాలతో టచ్లో ఉండింది. ఆ తర్వాత తెరకు పూర్తిగా దూరం అయ్యింది.
ఇప్పుడు మందాకినికి మళ్లీ సినిమాలపై గాలి మళ్లిందట. ఆమె ప్రస్తుతం కథలను వింటోందట. తన రీ ఎంట్రీకి తగిన సినిమాను లేదా వెబ్ సీరిస్ ను ఎంచుకునే పనిలో ఉందట ఈ అలనాటి అందాల తార. తన రీ ఎంట్రీ అల్లాటప్పా ఉండకూడదని, తగినంత గుర్తింపును ఇచ్చే పాత్రలనే ఎంచుకోవడానికి ఆమె ప్రయత్నాల్లో ఉందట.
ఈ మేరకు ఆమె మేనేజర్ మందాకిని కథలు వింటోందని, బాలీవుడ్ జనాలను అలర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సెకెండ్ ఇన్నింగ్స్ లో మందాకిని ఏ మేరకు విజయాలను సాధిస్తుందో. హీరోయిన్ గా వెలిగిన రోజుల్లో ఆమె తెలుగులో సింహాసనం, భార్గవరాముడు వంటి సినిమాల్లో గ్లామరస్ పాత్రల్లో కనిపించారు.