ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వైసీపీ అధినేత జగన్ ప్రజలను చాలాసార్లు అభ్యర్థించారు. సరే … ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామనుకున్నారా ? చంద్రబాబు కంటే జగన్ బెటర్ గా పరిపాలన చేస్తాడని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తాడని అనుకున్నారా ? వాళ్ళు ఏమనుకున్నారో తెలియదుగానీ జగన్ కు అఖండ విజయం సమకూర్చి పెట్టారు.
జగన్ ఊహించని మెజారిటీ కట్టబెట్టారు. కానీ సామాన్య ప్రజలు పెట్టుకున్న ఆశలు ఏవీ నెరవేరలేదు. జగన్ కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు. కానీ అవేవీ రాష్ట్ర సంపదను పెంచేవి కావు. రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి కావు. ఉపాధి కల్పనకు దోహదపడేవి కావు.
జగన్ అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. సంక్షేమం అంటే ప్రజలకు వివిధ పథకాల పేరుతో డబ్బులు పంచడమే. డబ్బులు పంచడాన్ని వచ్చే ఎన్నికలకు పెట్టుబడిగా భావిస్తున్నట్లుగా ఉంది. సంక్షేమ పథకాలు ఉండాలి. కానీ జగన్ పాలనలో సంక్షేమం మితిమీరిపోయింది.
అభివృద్ధి అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ రూటు పట్టిందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఏపీలో గత రెండేళ్లుగా అభివృద్ధి అన్న మాట కంటే రాజకీయం, ఎత్తులు, పై ఎత్తులు అన్న మాటలే ఎక్కువుగా వినిపించాయి. పెట్టుబడులు రావడం లేదు.. యువతకు ఉపాధి లభించడం లేదు.
కార్మికులకు పని దొరకడం లేదు. అసలు రాష్ట్రంలో చాలా మంది నోట నుంచి మనీ రొటేట్ కావడం లేదన్నదే ఎక్కువగా వినిపిస్తోంది. నిజానికి ఏ రాష్ట్రమైనా అభివృద్ది చెందాలంటే.. పెట్టుబడులు రావాల్సిందే. ఇవి రావాలంటే.. రాష్ట్రంలో పరిస్థితి బాగుండాలి. కానీ, ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా.. ఏపీలో పెట్టుబడులు అంటేనే ఎవ్వరూ స్పందించని పరిస్థితి.
ఎప్పుడో చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన పెట్టుబడులు తప్ప ఇప్పటివరకు భారీఎత్తున పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవు. మంచి రాజధాని లేకుండా పెట్టుబడులు ఎలా వస్తాయి ? ముఖ్యంగా మూడు రాజధానుల నిర్ణయం తీవ్ర ప్రభావం చూపింది. ఏపీలో పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించాలని భావించినా.. మూడు రాజధానుల నిర్ణయంతో చాలా మంది పెట్టుబడి దారులు వెనక్కి తగ్గారు.
పోని.. మూడు రాజధానులైనా కూడా ఓకే అనుకున్నా.. వీటిపై నెలకొన్న న్యాయపరమైన చిక్కులతో ఇప్పుడు మూడు రాజధానులు ఎటూ తేలలేదు. సాధారణంగా జాతీయ స్థాయి, ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించాలంటే ఏ రాష్ట్రానికి అయినా ఓ బలమైన రాజధాని అవసరం. కానీ ఏపీకి ఇప్పుడు అది లేకుండా పోయింది. కానీ జగన్ ఈవిషయం ఆలోచించలేదు. జగన్ కు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనకంటే తాను అనుకున్నది జరగాలనే పట్టుదలేఎక్కువ. చాలా విషయాల్లో ఇది స్పష్టమైంది.
ఏపీ కన్నా.. పొరుగు రాష్ట్రం బెటరని ఇప్పుడు చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఉపాధి సంపాదించుకోవాలంటే తెలంగాణాకు వెళ్లాలని అంటున్నారు. రాష్ట్రం విడిపోయాక అనేకమంది పెట్టుబడిదారులు ఏపీ వైపు ఉత్సాహంగా చూసినా ఇప్పుడు హైదరాబాదులోనే పెట్టుబడులు పెడుతున్నారు.
విచిత్రం ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. అక్కడ రియల్ ఎస్టేట్, వ్యాపార రంగాలు పూర్తిగా కుదేలయ్యాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అమరావతి అన్నా, ఆంధ్రా అన్నా ఎవ్వరూ పెట్టుబడులు పెట్టడం లేదు. ఇదే టైంలో హైదరాబాద్‌లో ఈ రంగాలు దూసుకుపోతున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా.. హైదరాబాద్‌ను విస్తరిస్తోంది. చాలా కీలకమైన కంపెనీలను శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతోపాటు అక్కడ రియల్ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. దీనికి మంత్రి కేటీఆర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏపీ అన్ని విధాలా నష్టపోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక పారిశ్రామికవేత్తలు కూడా ఏపీ అంటేనే దూరం దూరం అంటున్నారు.
జగన్ పెట్టుకున్న మూడు రాజధానుల కోరిక అలానే ఉండిపోతుందని.. ఈలోగా ఎన్నికలు రావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఇదే జరిగితే.. జగన్ పై ప్రభావం పడుతుందని అంటున్నారు. ఎందుకంటే.. తాను కట్టిన రాజధానిని తప్పుగా ప్రచారం చేశారని.. అమరావతితో రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉందని.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేసుకునే అవకాశం మెండుగా ఉంటుంది.
ఇది వర్కవుట్ అవుతుందనేది విశ్లేషకుల మాట. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిచినా మళ్ళీ సంక్షేమ జపమే చేసే అవకాశం ఉంది. సంక్షేమ పథకాల వల్లనే తాను మళ్ళీ అధికారంలోకి వచ్చానని అనుకుంటాడు.