తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసిన ఇద్దరు మహా నాయకులు ఎన్టీఆర్, వైఎస్ఆర్. తెలుగు పాలిటిక్స్ లో వీరు ట్రెండ్ సెట్టర్లు. కాంగ్రెస్ పార్టీ గుర్తించని బడుగు, బలహీన వర్గాల ప్రజలను రాజకీయంగా గుర్తించారు ఎన్టీఆర్. బీసీల, ఎస్సీల ఓట్లు అడగటాన్ని కూడా చిన్నతనంగా భావించే వారు నాటి కాంగ్రెస్ నేతలు. ఎన్నికల సమయంలో ఊర్లకు వెళ్లి ఓట్లు అడగడం అంటే, ఊర్లోని అగ్రకులాల వాళ్ల ఇళ్లకు వెళ్లి.. కాసేపు కూర్చుని రావడం అన్నట్టుగా ఉండేది కాంగ్రెస్ నేతల ప్రచారం.
వాళ్ల ఇళ్లకు వెళ్లి కాసేపు కూర్చుని వస్తే.. మిగతా ఊరంతా వారు చెప్పినట్టే వినేసి ఓటేస్తుందన్నట్టుగా దశాబ్దాల పాటు వారి వ్యవహారం సాగింది. పెద్ద వాళ్లను తాము ఓటు అడిగితే సరిపోతుందని, చిన్నవాళ్లంతా తమకు రుణపడ్డట్టుగా ఓటేయాల్సిందే అన్నట్టుగా వారు వ్యవహరించే వారు. ఆ సంప్రదాయానికి చెక్ పెట్టారు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ఉనికిని ఇచ్చారు. ఎన్టీఆర్ వేసిన ఆ పునాదిపైనే తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ మనుగడలో ఉంది. అయితే ఇప్పుడు అది కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే మిగిలింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అస్తమించింది.
ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎమ్మెల్సీ లేడు, అంత పెద్ద హైదరాబాద్ లో ఒక్క కార్పొరేటర్ కూడా లేడు. ఇదీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత దక్కిన పదికి పైగా సీట్లను తెలుగుదేశం పార్టీ నిలుపుకోలేకపోయింది. ఎమ్మెల్యేలనే కాదు, ఇప్పుడు ఉనికినే నిలుపుకోలేని పరిస్థితుల్లోకి వచ్చింది.
ఎన్టీఆర్ తన పార్టీని స్థాపించింది తెలంగాణలోనే, తొలి మీటింగులు, వ్యూహాలు రచించింది తెలంగాణ నుంచినే. ఆరంభంలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు హైదరాబాద్, తెలంగాణలే తిరుగులేని వేదికలు అయ్యాయి. స్వయంగా ఎన్టీఆర్ తెలంగాణ నుంచి పోటీ చేశారు. ఓటమి చవి చూసింది అక్కడే అనుకోండి! అయితే.. ఎన్టీఆర్ కు తెలంగాణలో తిరుగులేని ఆదరణ మాత్రం ఉండింది.
సామాజికవర్గాల రహితంగా ఎన్టీఆర్ ను బాగా అభిమానించిన ప్రాంతం తెలంగాణ. కాంగ్రెస్ కు మాత్రమే అనుకున్న రెడ్లు తెలుగుదేశం పార్టీ ని బాగా ఆదరించింది తెలంగాణలోనే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా రాయలసీమలో రెడ్లు కాంగ్రెస్ నే అట్టిపెట్టుకున్నారు. అయితే తెలంగాణలో మాత్రం యువకులైన రెడ్డి రాజకీయ నేతలు తెలుగుదేశం నుంచినే తమ ప్రస్థానాలను ప్రారంభించారు.
ఇంద్రారెడ్డి, మాధవరెడ్డి మొదలుకుని..ఆ తర్వాత మంత్రులుగా, ప్రస్తుత టీఆర్ఎస్ లో కీలక పొజిషన్లలో ఉన్న రెడ్డినేతల వరకూ చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే. అయితే వారంతా చంద్రబాబు హయాంలో కెరీర్ మొదలుపెట్టిన వారు కాదు, ఎన్టీఆర్ హయాంలో వెలుగులోకి వచ్చిన వారే, ఆ తర్వాత వెలిగారు. వెలుగుతున్నారు.
ఇక పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దుతో తెలంగాణ బడుగు బలహీన వర్గాల్లో ఎన్టీఆర్ కు తిరుగులేని ఇమేజ్ వచ్చింది. ఇప్పటికీ తెలంగాణలో ఊరూరా ఎన్టీఆర్ విగ్రహాలున్నాయి. వాటికి పసుపు పచ్చ రంగు కూడా ఉంటుంది. అయితే ఆయన స్థాపించిన పార్టీ మాత్రం అస్తమించింది. ఆయన నుంచి పార్టీని గుంజుకున్న అల్లుడి సారధ్యంలోనే, ఆయన మనవడిని అని చెప్పుకునే కూతురు కొడుకు నాయకత్వం సమయంలో.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తన ప్రస్థానాన్ని ముగించింది.
ఇక తెలంగాణలో టీడీపీ మళ్లీ కోలుకునే అవకాశాలు కానీ, మళ్లీ ఉనికిని నిలబెట్టుకునే అవకాశాలు కానీ ఏ మాత్రం కనిపించడం లేదు. తెలంగాణ రాజకీయం గురించి కిక్కురుమనే పరిస్థితుల్లో లేరు తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. తన పేరుకు ముందు జాతీయాధ్యక్ష హోదాను ఆయన తగిలించుకున్నారు కానీ, ఆయన నాయకత్వంలోనే తెలంగాణలో పార్టీ కుంచించుకుపోయింది. ఉనికిని కోల్పోయింది.
ఏపీలో సర్దుకోవడం, తన తనయుడిని రాజకీయంగా నిలబెట్టుకోవడమే చంద్రబాబుకు ఇప్పుడు ముందున్న అతి పెద్ద పరీక్షలు. దీనికి ఆయన వయసు సహకరిస్తున్నట్టుగా లేదు, పరిస్థితులు అస్సలు సహకరించడం లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా ఏపీలో టీడీపీ ఓడిపోతే.. అంతటితో చంద్రబాబు నాయుడి పొలిటికల్ కెరీర్ కూడా ముగిసినట్టే. అందులో సందేహం లేదు. ఆ తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రజల మధ్యన పూర్తిగా అడ్రస్ కోల్పోయిన తరుణంలో.. అక్కడ వైఎస్ఆర్ టీపీ ఆవిర్భవించింది. తెలంగాణపైనే కాకుండా, తెలుగు వారిపైనే ఎన్టీఆర్ తర్వాత అత్యంత ఎక్కువ స్థాయిలో ఆమోద ముద్రను వేయించుకున్న వైఎస్ఆర్ తనయ తెలంగాణలో తన పార్టీని స్థాపించారు. తెలంగాణలో వైఎస్ఆర్ ఇమేజ్ విభజన తర్వాత కూడా ఉందని జగన్ పార్టీనే కొద్ది మేర రుజువు చేసింది.
ఒక ఎంపీ సీటు నెగ్గడం, మూడు ఎమ్మెల్యే స్థానాలను నెగ్గడంతో పాటు.. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్న 2014 ఎన్నికల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ నియోజకవర్గాల్లో ఐదారు వేల స్థాయి ఓట్లను పొందింది. అయితే జగన్ ఆ తర్వాత ఏపీకే పరిమితం అయ్యారు. ఏపీలో అధికారం సాధించుకోవడమే లక్ష్యమనుకున్నారు.
ఆ లక్ష్యాన్ని సాధించిన తర్వాత తెలంగాణ వైపు తొంగి చూసే ధైర్యం కూడా చేయలేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇరు రాష్ట్రాల మధ్యన వివాదాలు నిత్యం ఉండబోతున్నాయని జగన్ మొదటే అర్థం చేసుకున్నారు. తెలంగాణ రాజకీయ తెరపై నుంచి పూర్తిగా వైదొలిగారు. అయితే జగన్ తప్పుకున్నంత మాత్రాన వైఎస్ ఇమేజ్ అయితే చెరగనిది. దానికి వారసురాలిగా ఇప్పుడు వైఎస్ షర్మిల రంగంలోకి దిగారు.
వైఎస్ ఇమేజ్ తమదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. ఇన్నాళ్లూ ఆ పార్టీ దాన్ని కావాలని గుర్తించలేదు. ప్రతిఫలాన్ని అనుభవించింది. ఇప్పుడు చేతులు కాలాకా ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇక షర్మిల ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ పార్టీ ప్రస్తుతానికి తేలికగా కనపడవచ్చు. అయితే దాని అంతిమ స్థానం అయితే ఇదే మాత్రం కాకపోవచ్చు. అదేమిటనేదనే అంశానికి కాలమే సమాధానం ఇవ్వనుంది. సరిగ్గా ఎన్టీఆర్ పార్టీ అస్తమయం అవుతున్న వేళ, తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ ఉదయిస్తూ ఉండటమే అసలైన విశేషం.