జనసేనాని ఆ విషయంలో ఫుల్ సైలెంట్. అయితే ఆయన సైనికులు మాత్రం అడుగు ముందుకే వేశారు. తన నిర్ణయం ఇదేనని చెప్పేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం దూకుడు మీద ఉంది. దానికి రంగం అంతా సిధ్ధం చేసేసింది.
ఈ నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించాయి. బీజేపీ ఎటూ మద్దతు ఇవ్వదు, కేంద్రంలో ఆ పార్టీయే ఈ పని అంతా చేస్తూంటే ఏపీ కమలనాధులు ఎందుకు ముందుకు వస్తారు. మరి జనసేనకు ఏమైంది. అంటే ఆ పార్టీకి మిత్రపక్షం కాబట్టి మౌనంగా ఉందనుకొవాలేమో.
పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకపోయినా విశాఖలోని ఆ పార్టీ నాయకులు మాత్రం ఉద్యమానికి పూర్తి మద్దతు ఇచ్చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని తాము గట్టిగా కోరుకుంటున్నట్లుగా వారు స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో కేంద్రం పునరాలోచన చేయాలని కూడా కోరారు.
మొత్తానికి జనసేన అభిప్రాయమా లేక తమ సొంత విధానామా అన్నది తెలియదు కానీ గాజువాకకు చెందిన ఆ పార్టీ నాయకులు ముందుకు వచ్చి స్టీల్ ఉద్యమానికి సపోర్ట్ ఇవ్వడం పట్ల ఉక్కు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా కేంద్రాన్ని నిలదీస్తే మిత్రపక్షం మాట అయినా విని ఉక్కు ప్రైవేటీకరణను కేంద్రం ఆపుతుందేమో అన్న ఆశను కార్మికులు వ్యక్తం చేస్తున్నారు.