రెండేళ్లుగా వైసీపీ నేతలను ఊరిస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎట్టకేలకు జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో గతంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం పాటించినట్టు ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు. మొత్తం 135 కార్పొరేషన్లు, వివిధ సంస్థల్లో చైర్మన్లు, డైరెక్టర్లను జగన్ ప్రభుత్వం నియమించింది.
వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 76 పదవులు కేటాయించినట్టు ప్రభుత్వం తెలిపింది. వెనుకబడిన తరగతులకు 56 శాతం పదవులు కేటాయించినట్టు ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. అలాగే మహిళలకు పెద్ద పీట వేసినట్టు చెప్పుకొచ్చారు. అంతా బాగుంది. బడుగు, బలహీన వర్గాలకు పదవులిచ్చి అధికారంలో భాగస్వామ్యం చేసినందుకు జగన్ ప్రభుత్వాన్ని తప్పక అభినందించాల్సిందే.
ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయం పాటించేందుకు ఎంత అతి జాగ్రత్తలు తీసుకుందో తెలియజేసే ఓ సంఘటన గురించి తప్పక చెప్పుకోవాలి. ఈ రోజుకు ఇదే హైలెట్‌గా నిలుస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న వారి గురించి తప్పక తెలుసుకోవాలి. నామినేటెడ్ పోస్టుల భర్తీ వివరాలను ప్రకటించడంలో కూడా సామాజిక న్యాయం పాటించడం విశేషం.
మీడియా సమావేశంలో మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ , ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి వివరాలను వెల్లడించారు. చివరికి పోస్టుల వివరాలను వెల్లడించే వారిని కూడా కులాల వారీగా ఎంపిక చేసుకున్నట్టు… ఈ నలుగురిని చూస్తే అర్థమవుతుంది.
మేకతోటి సుచరిత (మాల), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (బీసీ), నందిగం సురేష్ (మాదిగ), సజ్జల (రెడ్డి). వీరంతా వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు. అందుకే ప్రెస్‌మీట్‌కు కూడా సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేసుకుని మరీ వెళ్లడం ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రత్యేకత. జగన్ ప్రభుత్వం పాటిస్తున్న సామాజిక న్యాయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.