త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్ అలీఖాన్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. ఊహించని విధంగా తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడం, ఏకంగా పోలీస్ కేసు వరకు వ్యవహారం వెళ్లడంతో మన్సూర్ క్షమాపణలు చెప్పాడు.
“నా సహనటి త్రిష, దయచేసి నన్ను క్షమించు. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీకు శుభాకాంక్షలు తెలిపే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.” అంటూ స్పందించాడు. మన్సూర్ స్టేట్ మెంట్ తో ఈ వివాదం సద్దుమణిగినట్టయింది.
“గడిచిన వారం రోజులుగా రక్తపాతం లేకుండా జరిగిన యుద్ధంలో నేనే గెలిచాను. నాకు మద్దతుగా నిలిచిన, నాయకులు, నటులు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు. నా వ్యాఖ్యల్ని ఖండించిన వాళ్లందరికీ నా సెల్యూట్. నేను చేసిన వ్యాఖ్యలతో త్రిష బాగా హర్ట్ అయినట్టు పోలీసులు నాతో చెప్పారు. అయ్యో నేను కూడా హర్ట్ అయ్యాను.”
ఇలా సుదీర్ఘంగా లేఖ విడుదల చేసిన మన్సూర్.. తప్పదన్నట్టు చివర్లో “క్షమించు త్రిష” అంటూ ముగించాడు. ఈ సందర్భంగా మీడియాపై తన ప్రకటనలో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు మన్సూర్.
లియో సినిమాలో నటించిన మన్సూర్, అందులో త్రిషను రేప్ చేసే సన్నివేశం లేనందుకు బాధ వ్యక్తం చేశాడు. గతంలో తను ఎన్నో సినిమాల్లో ఎంతోమంది హీరోయిన్లను రేప్ చేశానని, లియోలో మాత్రం త్రిషను అలా ఎత్తుకెళ్లి, మంచంపై వేయలేకపోయానని బాధపడ్డాడు. ఈ వ్యాఖ్యల్ని త్రిష తీవ్రంగా ఖండించింది. త్రిషకు చిరంజీవితో పాటు చాలామంది ప్రముఖులు మద్దతు పలికారు.
ఈ వ్యవహారం జాతీయ మహిళా కమిషన్ వరకు వెళ్లింది. మన్సూర్ పై కేసు ఫైల్ చేయాల్సిందిగా వాళ్లు తమిళనాడు పోలీసుల్ని ఆదేశించారు. మరోవైపు త్రిషకు క్షమాపణలు చెప్పేంతవరకు సినిమాల నుంచి నిషేధిస్తున్నట్టు నడిగర్ సంఘం ప్రకటించింది. దీంతో మన్సూర్ వెనక్కి తగ్గాడు. త్రిషకు భేషరతుగా క్షమాపణలు చెప్పాడు.