త్రిషపై మన్సూర్ ‘రేప్’ వ్యాఖ్యలు.. లోకేష్ పై ట్రోలింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ట్రోలింగ్ కు గురవుతారో అస్సలు ఊహించలేం. ఎవరో ఏదో చేస్తారు, దానికి సంబంధించి వేరే ఎవరో ట్రోలింగ్ బారిన పడతారు. అలాంటిదే ఇది కూడా. ఈమధ్య నటుడు మన్సూర్…

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ట్రోలింగ్ కు గురవుతారో అస్సలు ఊహించలేం. ఎవరో ఏదో చేస్తారు, దానికి సంబంధించి వేరే ఎవరో ట్రోలింగ్ బారిన పడతారు. అలాంటిదే ఇది కూడా. ఈమధ్య నటుడు మన్సూర్ అలీఖాన్, త్రిషపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దానిపై రాత్రి త్రిష గట్టిగానే స్పందించింది. ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై నెటిజన్లు లోకేష్ కనగరాజ్ ను దూషిస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగింది.. ఎప్పుడు జరిగిందో, ఎక్కడ్నుంచి వచ్చిందో తెలీదు కానీ, ఊహించని విధంగా మన్సూర్ అలీఖాన్ కు సంబంధించిన క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో అతడు తన విలనిజంను ఎలివేట్ చేయాలనుకున్నాడు. దాని కోసం త్రిషను వాడుకున్నాడు. వెండితెరపై అరివీర భయంకరమైన విలన్ గా నటించానని, ఎన్నో రేప్ సన్నివేశాల్లో నటించానని, కానీ త్రిషతో తనకు ఆ అవకాశం/అనుభవం రాలేదనేది అతడి వెర్షన్.

“త్రిష సినిమాలో అవకాశం వచ్చిందని తెలిసిన వెంటనే ఆమెతో బెడ్ రూమ్ సీన్ ఉంటుందని భావించాను. గత సినిమాల్లో హీరోయిన్లతో చేసినట్టు, ఈ సినిమాలో కూడా త్రిషను అమాంతం ఎత్తుకెళ్లి, మంచంపై పడేసి రేప్ చేసే సీన్ ఉంటుందని అనుకున్నాను. నేను ఎన్నో సినిమాల్లో ఎన్నో రేప్ సీన్లు చేశాను, అత్యాచారాలు నాకు కొత్త కాదు. కానీ లియో మేకర్స్ మాత్రం, కశ్మీర్ షెడ్యూల్ నాకు కనీసం త్రిష ను కూడా చూపించలేదు.”

తీవ్రంగా ఖండించిన త్రిష.. ఈ వీడియో అటుఇటు తిరిగి త్రిష దృష్టికి వచ్చింది దీనిపై ఆమె సీరియస్ అయింది. “మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని లైంగికంగా వేధించడం అంటారు. స్త్రీల పట్ల ద్వేషంగా, విద్వేషపూరితంగా, అసహ్యకరంగా మాట్లాడినట్టు నాకు అనిపిస్తోంది. అతని లాంటి దయలేని వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇకపై భవిష్యత్ లో కూడా అతడిలాంటి నటులతో నటించకుండా జాగ్రత్తపడతాను. మన్సూర్ లాంటి వారి వల్ల మానవాళికి చెడ్డపేరు వస్తుంది.”

మధ్యలో లోకేష్ కనగరాజ్ ఏం చేశాడు?

ఇలా తనపై మన్సూర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది త్రిష. లియో సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఇదే సినిమాలో మన్సూర్ అలీఖాన్ కూడా ఉన్నాడు. అయితే ఇద్దరూ కలిసి సినిమాలో ఒక్క సీన్ కూడా చేయలేదు. మన్సూర్ కామెంట్స్ కు ఇదే కారణం.

మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై నెటిజన్లు, లోకేష్ పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. మన్సూర్ లాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వడం లోకేష్ చేసిన తప్పంటూ విరుచుకుపడుతున్నారు. లోకేష్ కు బుద్ధిలేదని, ఎవ‌రు ఎలాంటి వారో తెలుసుకోకుండా అవకాశం ఎలా ఇస్తాడంటూ తిడుతున్నారు.

మన్సూర్ గతంలో అత్యాచార ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. అతడిపై కొన్ని కేసులున్నాయి. ఇలాంటి నేరచరిత్ర ఉన్న వ్యక్తిని ఎలా లోకేష్ తన యూనివర్స్ లోకి తీసుకుంటాడంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.

మన్సూర్ అలీఖాన్, త్రిషపై అభ్యంతరక వ్యాఖ్యలు చేశాడు. వాటిని త్రిష తీవ్రంగా ఖండించింది కూడా. మధ్యలో లోకేష్ మాత్రం ట్రోలర్స్ కు బలైపోతున్నాడు. లియో ఇంకా ఓటీటీలోకి రాలేదు. అది స్ట్రీమింగ్ కు వచ్చిన తర్వాత అసలు కథ మొదలవుతుంది.