బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసు క్షణక్షణానికో మలుపు తిరుగుతోంది. ఈ కేసు క్రైం సినిమాను తలపిస్తోంది. ఇటీవల ఓ యువతి తనపై 139 మంది 5వేల సార్లకు పైగా అత్యాచారానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది. తనపై ప్రముఖ యాంకర్, నటుడు, మాజీ ఎంపీ పీఏ తదితరులు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించడం, మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీయడం తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకే తనను డాలర్ బాయ్ అనే వ్యక్తి బెదిరించి పలువురు సెలబ్రిటీల పేర్లు చెప్పించాడని, తనపై 36 మంది మాత్రమే లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పడంతో కేసు బలహీనపడింది. దీంతో ఇలాంటి ఆరోపణలపై ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో శ్రావణి ఆత్మహత్యకు కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజురెడ్డి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భాగ్య రేఖ సీరియల్‌లో నటిస్తున్న దేవరాజ్.. తమ కూతురు శ్రావణి ద్వారానే సీరియ ల్స్ లోకి ప్రవేశించాడని చెప్పారు. అతని వేధింపులు భరించలేక ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, అయినా దేవరాజు మారలేదని తెలిపారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవరాజు చుట్టూనే నిన్న మధ్యాహ్నం వరకు వార్తలు నడిచాయి.
దేవరాజు ఒక్కసారిగా తెరపైకి వచ్చి “అసలు వాస్తవాలు ఇవీ” అంటూ కొత్త విషయాలు చెప్పడంతో కేసు మరో మలుపు తిరిగిందని చెప్పొచ్చు. శ్రావణి ఆత్మహత్యకు తాను కారణం కాదని అతను చెప్పుకొచ్చాడు. శ్రావణి కుటుంబ సభ్యులు, సాయి అనే వ్యక్తి కలిసి హింసించి, కొట్టడంతో…ఆ అవమానం తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని దేవరాజు చెప్పాడు. శ్రావణి ఆత్మహత్య చేసుకునే ముందు తనకు ఫోన్ చేసిందని, అందువల్లే ఈ విషయం తనకు తెలిసిందని తన వాదన వినిపిస్తున్నాడు.
ఇక ఆ ఇంట్లో ఉండలేనని తనతో చెప్పిందన్నాడు. ‘ఐ లవ్ యూ దేవ, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నువ్వు రమ్మంటే నీ వద్దకు వచ్చేస్తాను, నువ్వు వద్దన్నా, నీపై నాకెలాంటి కోపం లేదు, నా పని నేను చూసుకుంటాను, మూడు రోజులు షూటింగ్ ఉంది.. ఇదే నాకు అవకాశం, నువ్వు రమ్మంటే నావద్ద ఉన్న గోల్డ్, క్యాష్ తీసుకుని వచ్చేస్తాను’ అని శ్రావణి తనతో చెప్పిందని దేవరాజ్ అన్నాడు.
సాయి అనే వ్యక్తి రోడ్డుపై జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టాడని శ్రావణి చెప్పిందని దేవరాజ్ తెలిపాడు. చాలా అవమానంగా ఉందని, వాళ్ల మొహాలు ఇక చూడదలచుకోలేదని చెప్పిందని, తన చావుకు కారణం సాయి అనే వ్యక్తని చెప్పి చనిపోయిందని దేవరాజ్ చెప్పడంతో కేసు మలుపు తిరిగింది.
ఇప్పుడు శ్రావణి ఆత్మహత్య కేసు దేవరాజ్ ఆరోపణలతో సాయి అనే వ్యక్తి చుట్టూ తిరుగుతోంది. ఇదిలా ఉండగా దేవరాజు ఆరోపణలపై సాయి స్పందించాడు. దేవరాజురెడ్డి విడుదల చేసిన వీడియో అవాస్తవమన్నాడు. శ్రావణికి ఫ్యామిలీ స్నేహితు డినని, శ్రావణి చనిపోయినప్పటి నుంచి మృతదేహంతోనే ఉన్నానన్నాడు. తాను ఎక్కడికి పారిపోలేదని, పోలీసులతోనే ఉన్నానని సాయి వెల్లడించాడు. ఇలాంటి రోజు రాకూడదని మేము, ఫ్యామిలీ ఎన్నో బాధలు పడ్డారని పేర్కొన్నాడు.
దేవరాజు పరిచయం అయిన నాటి నుంచి ఫ్యామిలీ ఇబ్బంది పడని రోజు లేదని, తనను కష్టపడుతూ కాపాడుకుంటూ వచ్చారని పేర్కొన్నాడు. దేవరాజు సైతం తనకు శ్రావణి ద్వారానే తెలుసని చెప్పాడు. తనను ఇబ్బందులకు గురి చేయడం మానాలని చెప్పానని, మీ బతుకు మీరు బతకాలని సూచించానని తెలిపాడు. దీంతో తనపై కక్ష పెంచుకున్నాడని ఆరోపించాడు.
శ్రావణి కేసులో కుటుంబ సభ్యులు, సాయి ఒక వాదన, ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజుల వాదన మరోలా ఉంది. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపితే తప్ప అసలు నిజాలేంటో తెలిసే అవకాశం లేదు. నిజాల్ని నిగ్గు తేల్చేందుకు పోలీసులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.