కన్నడ హీరో ధృవ సర్జా లేటెస్ట్ సినిమా మార్టిన్. పాన్ ఇండియా సినిమాకు పలు భారతీయ భాషల్లో రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. సీనియర్ అర్జున్ కథ అందించాడు. రెండు నిమషాలకు పైగా నిడివి వున్న టీజర్ మొత్తం ఒకటే చెబుతోంది. భారీ చిత్రీకరణ, భారీ యాక్షన్, భారీ ఖర్చు..భారీ..భారీ..భారీ. ఆఖరికి సినిమాలో హీరో, విలన్లు కూడా భారీ సైజులోనే వున్నారు.
కేజిఎఫ్ తరువాత కన్నడ నాట భారీ సినిమాల పరంపర ప్రారంభమైంది. కేజిఎఫ్ సిరీస్ మాత్రమే కాకుండా మరి కొన్ని కూడా హిట్ కావడంతో ఇప్పుడు అదే సీజన్ గా మారుతోంది.
మార్టిన్ సినిమా టీజర్ అలాగే వుంది. పాకిస్తాన్ దగ్గర కథ మొదలు పెట్టారు అంటే ఎంత పెద్ద స్పాన్ లో రాసుకుని వుంటారో అర్ధం చేసుకోవచ్చు. బిల్డప్ షాట్ లు, భారీ యాక్షన్ సీన్లు, వందల కొద్దీ జూనియర్ ఆర్టిస్ట్ లు తెరను నింపేసారు. సినిమాటోగ్రఫీ, షాట్ డివిజన్, ఫ్రేమ్ లు అన్నీ కెజిఎఫ్ సినిమాను రోల్ మోడల్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. హీరో సంగతి పక్కన పెడితే టీజర్ మాత్రం ఈ జనరేషన్ టేస్ట్ కు తగినట్లు చూడగలిగేదిలాగే వుంది.
కెజిఎఫ్ సంగీత దర్శకుడు రవిబసూర్ సంగీతం అందించాడు. అది కూడా అంత భారీగానూ వుంది. ఎపి అర్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు నిర్మాత ఉదయ్ కే మెహతా.