మే నెల బాక్సాఫీస్.. ‘డబ్బింగ్’ హవా

కీలకమైన సమ్మర్ సీజన్ లో ఓ నెలను కోల్పోయింది టాలీవుడ్ బాక్సాఫీస్. అంచనాలతో వచ్చిన తెలుగు సినిమాలేవీ సమ్మర్ ను క్యాష్ చేసుకోలేకపోయాయి. అదే టైమ్ లో ఊహించని విధంగా వచ్చిన డబ్బింగ్ సినిమాలు…

కీలకమైన సమ్మర్ సీజన్ లో ఓ నెలను కోల్పోయింది టాలీవుడ్ బాక్సాఫీస్. అంచనాలతో వచ్చిన తెలుగు సినిమాలేవీ సమ్మర్ ను క్యాష్ చేసుకోలేకపోయాయి. అదే టైమ్ లో ఊహించని విధంగా వచ్చిన డబ్బింగ్ సినిమాలు కొన్ని మెరిశాయి.

మే మొదటి వారంలో.. ఉగ్రం, రామబాణం సినిమాలు రిలీజయ్యాయి. అల్లరినరేష్ నటించిన ఉగ్రం, గోపీచంద్ చేసిన రామబాణం సినిమాలు రెండింటిపై సమానంగా అంచనాలుండేవి. ఎందుకంటే, నాంది కాంబినేషన్ లో ఉగ్రం వచ్చింది. ఇక హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతో గోపీచంద్-శ్రీవాస్ కలిసి రామబాణం చేశారు. ఉగ్రం విషయానికొస్తే.. నాంది మేజిక్ ను ఇది రిపీట్ చేయలేకపోయింది. అల్లరినరేష్ ను సీరియస్ కాప్ గా ప్రజెంట్ చేసిన ఈ సినిమా.. ఆశాజనకమైన ఫలితాన్నివ్వలేదు. ఇంకా చెప్పాలంటే, అటు సినిమా కొన్నవాళ్లకు, ఇటు తీసిన వాళ్లకు ఈ సినిమా రిజల్ట్ పూర్తిస్థాయిలో సంతృప్తి ఇవ్వలేదనేది వాస్తవం.

ఇక రామబాణం గురించి డిస్కషన్ అనవసరం. రొటీన్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు పూర్తిస్థాయిలో తిప్పికొట్టారు. మంచోడు అనే పేరున్న గోపీచంద్, ఈ సినిమా వల్ల కెరీర్ లో తొలిసారిగా ట్రోలింగ్ ఎదుర్కొన్నాడంటే, రామబాణం ప్రభావం ఏ స్థాయిలో పడిందో అర్థం చేసుకోవచ్చు. శ్రీవాస్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను పీపుల్ మీడియా నిర్మించింది.

మే రెండో వారంలో.. అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో భారీ అంచనాలతో వచ్చిన సినిమా కస్టడీ. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా మెప్పించలేకపోయింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చైతూ కెరీర్ లో ఫ్లాప్ గా మిగిలింది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది.

కస్టడీతో పాటు ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, భువన విజయమ్, ఫర్హానా, కల్యాణమస్తు, మ్యూజిక్ స్కూల్, కథ వెనుక కథ, టీ బ్రేక్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఏ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీస్ తర్వాత ఒక రోజు గ్యాప్ లో థియేటర్లలోకి వచ్చిన ది కేరళ స్టోరీ ఓ సెక్షన్ ఆడియన్స్ ను మెప్పించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు దూరంగా ఉన్నప్పటికీ.. అప్పటికే సంచలనం సృష్టించడంతో పాటు, వివాదాస్పదం అవ్వడంతో.. చాలామంది ఈ సినిమాను చూడ్డానికి మొగ్గుచూపారు. అలా ప్రొడక్షన్ వాల్యూస్ లేనప్పటికీ, మౌత్ టాక్ తో ఈ సినిమా సక్సెస్ అయింది.

ఇక మూడో వారం బాక్సాఫీస్  అన్నీ మంచి శకునములే సినిమాతో  ప్రారంభమైంది. సంతోష్ శోభన్ హీరోగా నందినీరెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో ఆడలేదు. ఈ సినిమా తర్వాత వచ్చిన బిచ్చగాడు2 మాత్రం హిట్టయింది. అన్నీ తానై విజయ్ ఆంటోనీ తెరకెక్కించిన ఈ సినిమా, తక్కువ రోజుల్లోనే బ్రేక్-ఈవెన్ సాధించి, ఆ వెంటనే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లింది. ఇదే వారం వచ్చిన హసీనా సినిమా ఫ్లాప్ అయింది.

నాలుగో వారంలో.. జైత్ర, మేమ్ ఫేమస్, 2018, మళ్లీ పెళ్లి, మెన్ టూ సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో నరేష్ నటించిన మళ్లీ పెళ్లి, చాయ్ బిస్కెట్ నుంచి వచ్చిన మేమ్ ఫేమస్ సినిమాలపై అందరి గురి ఉండేది. అయితే ఈ రెండు సినిమాల్ని దాటి.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 2018 అనే డబ్బింగ్ సినిమా హైలెట్ అయింది.

ఓవరాల్ గా మే నెలలో స్ట్రయిట్ గా వచ్చిన ఉగ్రం, రామబాణం, కస్టడీ సినిమాల కంటే.. డబ్బింగ్ రూపంలో వచ్చిన బిచ్చగాడు2, ది కేరళ స్టోరీ, 2018 సినిమాలు మెరిశాయి.