ఊరందరిదీ ఒక బాధ అయితే మోహన్ బాబుది మరో బాధ అనుకోవాలి. ఇండస్ట్రీ సమస్యలు ఎప్పుడు ఎలా పరిష్కారం అవుతాయా? ఎవరో ఒకరు పూనుకుని ఏదో ఒకటి చేస్తే బెటర్ అని అందరూ అనుకుంటూ వుంటే, ఎవరో ఒకరు ఏదో ఒకటి ఎలా చేస్తారు. చేస్తే, గీస్తే అందరం కలిసే చేయాలి అంటున్నారు మంచు మోహన్ బాబు.
ఇండస్ట్రీ అంటే నాలుగు ఫ్యామిలీలు, నలుగురు హీరోలు కాదు. అందరూ కలిసే వుండాలి అంటున్నారు. ఈమేరకు ఆయన చిత్రమైన లేఖ విడుదల చేసారు. ఇందులో తాను నిక్కచ్చిగా మాట్లాడతా అని, ఇలా అని అలా అని అన్నారు తప్ప, ప్రభుత్వాల మీద నిక్కచ్చి కామెంట్లు ఏమీ చేయలేదు.
పైగా ఇండైరెక్ట్ గా మెగాస్టార్ చేసే ప్రయత్నాలను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. నిజనికి మోహన్ బాబు రాసిన లేఖ పూర్తిగా అసంపూర్ణంగా వుందనే చెప్పాలి. అటు జగన్ కు, ఇటు కేసిఆర్ కు సన్నిహితం అయిన ఆయన వారికి ఇలా చేయండి అనే సలహా ఇవ్వలేదు. పోనీ అలా అని, తానే ఓ మీటింగ్ పెడతా, ఇండస్ట్రీ అంతా కలిసిరండి అని పిలుపు ఇవ్వలేదు.
ఏ ముఖ్యమంత్రినీ కలిసే ప్రయత్నం చేసినట్లు వార్తలూ లేవు. ఇలాంటి నేపథ్యంలో మోహన్ బాబు ఇలాంటి అసంపూర్ణ లేఖ రాయడం అన్నది అనవసరం గా ఆయన వైఖరి మీద కామెంట్లు, కౌంటర్లు ఇచ్చేందుకు దారి తీస్తుంది తప్ప, మరెందుకు ఉపకరించదనే అనుకోవాలి.
పైగా బావ వరుస అయిన ఆంధ్ర సిఎమ్ ను మా అధ్యక్షుడు మంచు విష్ణు కలిసే ప్రయత్నం చేసారో లేదో తెలియదు. సోషల్ మీడియాలో మాత్రం మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఇండస్ట్రీ సమస్యల మీద ఏదో ఒకటి చేయాలి కదా అనే కామెంట్లు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి.