కరోనా రెండు వేవ్స్ దాటినా ఇప్పటికీ ఇంకా ఇవే అనుమానాలు కొనసాగుతున్నాయి. కొంచెం జలుబు చేస్తే టెన్షన్ పడడం కామన్ అయిపోయింది. జలుబుతో పాటు జ్వరం వస్తే కరోనా పరీక్ష చేయించుకోవాలా వద్దా అనే అనుమానాలు ఇప్పటికీ చాలామందిలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఒమిక్రాన్ వచ్చిన తర్వాత ఈ అనుమానాలు మరింత పెరిగాయి. ఎందుకంటే, కరోనా సృష్టించిన ఆరోగ్య సమస్యలతో పోలిస్తే, ఒమిక్రాన్ లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్నాయి. దీంతో జబులు, ఫ్లూ, ఒమిక్రాన్ లో ఏది వచ్చిందో తెలుసుకోవడం మరింత కష్టంగా మారుతోంది.
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందడంతో కరోనా కేసుల రేటు పెరుగుతోంది. అయితే ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. టీకాలు వేసిన వ్యక్తులకు, ఈ వేరియంట్‌తో ఇన్ఫెక్షన్ తక్కువగా ఉండే అవకాశం ఉందని ఆధారాలతో చెబుతున్నారు మాజీ డెట్రాయిట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ ఎల్-సయ్యద్.
ఏ లక్షణాలతో దేన్ని గుర్తించగలం..!
కరోనా, ఒమిక్రాన్, ఫ్లూ లక్షణాలన్నీ దాదాపు ఒకేలా ఉన్నాయని చెబుతోంది అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్. కరోనా లేదా ఒమిక్రాన్ సోకిన కొంతమందిలో లక్షణాలు కేవలం జలుబు లేదా ఒళ్లు నొప్పులు మాత్రమే ఉండొచ్చని, అయినప్పటికీ నిర్లక్ష్యం చేయకుండా.. పరీక్ష చేయించుకోవడమే ఉత్తమమైన మార్గమని సంస్థ సూచిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో జలుబు, ఫ్లూతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా దాదాపు కరోనా ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.
ఎప్పుడు కరోనా టెస్ట్ చేయించుకోవాలి
కరోనా, ఫ్లూ రెండూ తరచుగా జ్వరం, అలసట, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, శ్వాస ఆడకపోవడం, వాంతులు లేదా అతిసారం వంటి లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిలో తలనొప్పి, పొడి దగ్గును కరోనా ప్రధాన లక్షణాలుగా పరిగణించవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు రుచి లేదా వాసన కోల్పోవడాన్ని కూడా ముఖ్యమైన లక్షణంగా చెబుతున్నారు. కానీ లక్షణాలు అటుఇటుగా ఉన్నప్పటికీ అనుమానం వచ్చినప్పుడు పరీక్ష చేయించుకోవడం అంత ఉత్తమం లేదనేది సీడీఎస్ మాట.
మరీముఖ్యంగా తక్కువ లక్షణాలతో కూడిన ఒమిక్రాన్, ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చులా వ్యాపిస్తున్న నేపథ్యంలో.. అనుమానం వచ్చిన వెంటనే పరీక్ష చేయించుకొని, రిజల్ట్ వచ్చినంతవరకు ఐసొలేషన్ లో ఉండడం మంచిదని సూచిస్తున్నారు.
పరీక్షలో నెగెటివ్ వస్తే కరోనా/ఒమిక్రాన్ లేనట్టేనా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఒమిక్రాన్ లక్షణాల్ని వివరించింది. వివిధ సర్వేలు, పరిశోధనల ఆధారంగా కొత్త కొత్త లక్షణాల్ని కూడా ఇందులో చేరుస్తోంది. ఈ క్రమంలో ఒకసారి కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చిన వాళ్లు సురక్షితం అనుకోవడానికి వీల్లేదని అంటున్నారు వైద్య నిపుణులు.
అనుమానం కలిగిన వెంటనే ముందుగా ఐసొలేషన్ లోకి వెళ్లాలి. శరీరంలో మార్పులు, లక్షణాల్ని జాగ్రత్తగా గమనించాలి. ఒక రోజు తర్వాత కరోనా పరీక్ష చేయించుకోవాలి. అందులో నెగెటివ్ వస్తే కరోనా లేదా ఒమిక్రాన్ లేదని అర్థం కాదు. 12 గంటలు లేదా 24 గంటల్లోపు మరోసారి టెస్ట్ చేయించుకోవాలి. ఇలా 24 గంటల వ్యవధిలో నెగెటివ్ వస్తే అప్పుడు కరోనా/ఒమిక్రాన్ లేదని అర్థం. ఇక నిశ్చింతగా ఉండొచ్చు.
వ్యాక్సిన్ విషయంలో ఆలోచనలు, అనుమానాలు వద్దు
కరోనా అయినా, జలుబు అయినా, ఫ్లూతో పోరాడుతున్నప్పుడు క్వారంటైన్ లో ఉండటం ఎల్లప్పుడూ మంచి ఆలోచన. కరోనా అయినా, ఒమిక్రాన్ అయినా.. వైరస్ వ్యాప్తిని నివారించడంలో కీలకమైన అంశం ఇదే. ఈ జాగ్రత్తతో పాటు విధిగా వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం భారత్ లాంటి కొన్ని దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉండడానికి వ్యాక్సినేషనే కారణం అయి ఉండొచ్చని అంతర్జాతీయ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇంట్లో పిల్లలకు జలుబు చేస్తే ఏం చేయాలి
ఓవైపు ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు పాఠశాలలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో బడికి వెళ్లే పిల్లలకు జలుబు చేస్తే ఏంటి పరిస్థితి? వాళ్ల ముక్కు అదే పనిగా కారుతుంటే ఏం చేయాలి? ఇలాంటి అనుమానం వచ్చినప్పుడు కూడా పరీక్ష చేయడం ఒక్కటే మార్గమంటున్నారు వైద్యులు. 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాత పరీక్షలకు వెళ్లడమే కరెక్ట్ అని సూచిస్తున్నారు.
మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా పిల్లలకు, ఆయా వయసుల వారీగా ఇచ్చే టీకాలన్నింటినీ క్రమం తప్పకుండా వేయించడం ఉత్తమమైన పద్ధతిగా చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల చిన్నారుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు. చిన్నారులకు ఇంకా కరోనా టీకా సిద్ధం కాలేదు. ఈ నేపథ్యంలో వాళ్లకు రెగ్యులర్ గా ఇచ్చే రొటీన్ టీకాల్నే కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.