మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మోహన్ బాబు సపోర్ట్ తో మంచు విష్ణు అధ్యక్ష బరిలో నిలిచారు. ఇక సమీప ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ కు మెగా కాంపౌండ్ అండదండలు, మరీ ముఖ్యంగా చిరంజీవి మద్దతు ఉందనే విషయం బహిరంగ రహస్యం. సరిగ్గా ఇక్కడే మోహన్ బాబు, చిరంజీవి సంబంధాలపై చాలామంది అనుమానాలు వ్యక్తంచేశారు. ఇద్దరూ ఫ్రెండ్సే కదా, మాట్లాడుకుంటే సరిపోయేది కదా అనుకున్నారు.
సరిగ్గా ఇదే ప్రశ్న మోహన్ బాబుకు కూడా ఎదురైంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై చిరంజీవి, మోహన్ బాబు మాట్లాడుకున్నారు. అయితే చిరంజీవి పేరును మాత్రం మోహన్ బాబు బయటపెట్టలేదు. చిరు పేరు చెప్పకుండా, అసోసియేషన్ ఎన్నికల వెనక జరిగిన వ్యవహారం మొత్తాన్ని పరోక్షంగా బయటపెట్టేశారు మోహన్ బాబు.
“ఈమధ్య ఓ సంఘటన జరిగింది. మనసుకు కష్టం అనిపించింది. ఎవ్వర్ని నమ్మాలో నమ్మకూడదో అర్థం కావడం లేదు. మేమిద్దరం స్నేహితులం. మా అబ్బాయి (మంచు విష్ణు) పోటీకి నిలబడ్డాడు. వాళ్ల అబ్బాయి మాత్రం నిలబడలేదు. అతడు నాకు ఫోన్ చేసి, ఓ వ్యక్తికి మాటిచ్చానని చెప్పి నా అబ్బాయిని విత్ డ్రా చేసుకోమన్నాడు. అతడు మాటిచ్చింది వాళ్ల అబ్బాయికా, వాళ్ల తమ్ముడు అబ్బాయికా, వాళ్ల బామ్మర్ది అబ్బాయికా అని అడిగాను. కాదు, వేరే వ్యక్తికి మాటిచ్చాను అన్నాడు. నేను చెప్పిన వాళ్లలో ఎవరు పోటీలో నిలబడినా విష్ణును విత్ డ్రా చేసుకోమని చెప్పేవాడ్ని. కుటుంబ సభ్యులు నిలబడితే కచ్చితంగా డ్రాప్ అయ్యేవాడ్ని.”
ఇలా తనకు చిరంజీవికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణను మోహన్ బాబు బయటపెట్టారు. మంచు విష్ణును విత్ డ్రా చేసుకోమని చిరంజీవి తనకు ఫోన్ చేసిన విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. అయితే పోటీ నుంచి తను ఎందుకు తప్పుకోలేదనే అంశంపై మోహన్ బాబు వివరణ ఇచ్చారు. చిరంజీవి ఎప్పటికీ తనకు మిత్రుడే అంటున్నారు.
“ఎవరికో అతడు మాటిస్తే నేను ఎందుకు డ్రాప్ అవ్వాలి. నిన్నటివరకు స్నేహితుడు, ఆత్మీయుడు అనుకునేవాడ్ని. అతడు అలా అనడం నాకు బాధ కలిగించింది. ఇప్పటికీ నాకు అతడు ఇష్టమే. మనసుకు బాధకలిగించే ఇలాంటి ఘటనలు ఉన్నప్పటికీ వాటిని మరిచిపోయి అతడి స్నేహాన్ని నేను కోరుకుంటాను. అది నా తత్వం.”
ఇలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై తనదైన శైలిలో స్పందించారు మోహన్ బాబు. ఎన్నిక ఎందుకు ఏకగ్రీవం అవ్వలేదో బయటపెట్టారు. ఇలాంటి ఘటనల వల్ల తమమధ్య స్నేహబంధం చెడిపోదని కూడా చెప్పుకొచ్చారు.