నందమూరి హీరో బాలకృష్ణ -బోయపాటి శీను దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం బీబీ 3 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారం జరుగుతోంది.
సింహా, లెజెండ్ సినిమాల తర్వాత బోయపాటి శీను దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా తెరకెక్కడంపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.
అయితే ఈ సినిమాపై గంపెడాశలు పెట్టుకున్న మలయాళ భామ ప్రయాగ మార్టిన్‌కు తీవ్ర నిరాశ కలిగించే వార్త ఇది. టాలీవుడ్లో పెద్ద హీరో అయిన బాలయ్య సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకి చేరువ అవుదామని కలలు కన్న ఆ బ్యూటీకి చేదు అనుభవం ఎదురైంది.
లాక్‌డౌన్‌తో షూటింగ్ బ్రేక్ పడిన చిత్రం తిరిగి ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. దీంతో మలయాళ నటికి అసలు విషయం తెలిసి షాక్‌కు గురయ్యారు.
బాలయ్య సరసన కథానాయికగా నటించే అవకాశం కోల్పోయినట్టు చిత్ర యూనిట్ ఆమెకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. దీనికి కారణం తెలిసి ఆమె మరింత ఆశ్చర్యానికి లోనయ్యారని సమాచారం.
బాలయ్య పక్కన మలయాళ భామ ప్రయాగ మరీ చిన్న పిల్లలా కనిపిస్తుండడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పించారని తెలుస్తోంది. ప్రయాగ ప్లేస్‌లో మరో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ వెతుకుతోందట.
అదేంటోగానీ, ముందే అన్నీ చూసుకోకుండా తీరా షూటింగ్ స్టార్ట్ అయ్యాక తొలగించడం ఏంటనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.