కొండంత రాగం తీస్తున్న పవన్.. చివరికి ఏం చేస్తారో..?

పవన్ కల్యాణ్ దూకుడు చూస్తే ఏదో పొడిచేస్తారు, చించేస్తారు, అయిపోయింది.. అన్నట్టు ఉంటుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తెలంగాణ కమిటీలు ఏర్పాటు చేస్తున్న దూకుడు చూస్తుంటే జీహెచ్ఎంసీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారని…

పవన్ కల్యాణ్ దూకుడు చూస్తే ఏదో పొడిచేస్తారు, చించేస్తారు, అయిపోయింది.. అన్నట్టు ఉంటుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తెలంగాణ కమిటీలు ఏర్పాటు చేస్తున్న దూకుడు చూస్తుంటే జీహెచ్ఎంసీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారని అనిపించక మానదు. 

ఇటీవల వకీల్ సాబ్ షూటింగ్ సెట్ నుంచే జనసేన తెలంగాణ విభాగం విద్యార్థి సంఘాల నాయకులను ఎంపిక చేసిన పవన్, తాజాగా తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీని మార్చారు, మరికొంతమందికి కొత్త పదవులు  అందివ్వబోతున్నారు.

అయితే ఈ దూకుడు ఎన్నికలవేళ వరకు ఉంటుందా లేదా అనేది మాత్రం అనుమానమే. ఎందుకంటే పవన్ గత చరిత్ర చూస్తే అంతా ఇలానే ఉంటుంది. కొండంత రాగం తీసి చివరకు ఏదో చేసి సరిపెడతారు పవన్ కల్యాణ్. పార్టీ పెట్టిన తొలి ఏడాదే.. పవన్ కల్యాణ్ పోటీ చేయకుండా కేవలం మద్దతుతో సరిపెట్టారు. 

తెలంగాణ గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా పవన్ కల్యాణ్ వీరంగాన్ని చూశాం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై తెగ సంప్రదింపులు జరిపారు, చర్చోప చర్చలు జరిపారు. చివరికి పవన్ టాలెంట్ ని నమ్మి చాలా పార్టీలు తమకి మద్దతివ్వమని కూడా అడిగాయి.

కానీ జనసేనానికి కేసీఆర్ అంటే.. విపరీతమైన గౌరవంతో కూడిన భక్తి వల్ల వచ్చిన భయం ఉంది. అందుకే ఆయన చివర్లో తుస్సుమనిపించారు. తెలంగాణలో పోటీ చేయను, ఎవరికీ మద్దతు ఇవ్వను అని తేల్చిపడేశారు. 

ఇప్పుడు సీన్ మారింది. పవన్ కల్యాణ్ వద్దన్నా, ఆయన మిత్రపక్షం బీజేపీ మాత్రం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోడానికి రెడీ అయింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో తనిఖీలు, అరెస్ట్ లు అంటూ కమలదళానికి చుక్కలు చూపించిన కేసీఆర్ కి, తగిన గుణపాఠం చెప్పాలని అనుకుంటోంది బీజేపీ.

దుబ్బాక ఎన్నికల్లో ప్రచారం చేయించకుండా చాతుర్మాస దీక్ష పేరు చెప్పి తప్పించుకున్న పవన్ కి బల్దియా ఎన్నికలు పెద్ద సవాల్ గా మారాయి. ఇప్పుడున్న జోరు చూస్తుంటే కచ్చితంగా జనసైనికుల్ని జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో దింపుతారనే సూచనలు కనిపిస్తున్నాయి. 

బీజేపీతో పొత్తు కూడా ఉంది కాబట్టి.. వారి తరపున కూడా ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కనీసం జాతీయ స్థాయి నాయకులు వచ్చి సభలు పెడితే.. వాటికైనా పవన్ హాజరవ్వాల్సి ఉంటుంది.

అలా వెళ్లిన తర్వాత టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై విమర్శలు చేయకుండా ఉంటానంటే కుదరదు. ఆ పని చేయాలంటేనే పవన్ కి తెగ ఇబ్బంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పవన్ ధైర్యంగా ముందడుగేస్తారనే అంతా అనుకుంటున్నారు. అందుకే కమిటీల పేరుతో తెలంగాణలో పార్టీని పటిష్టపరుస్తున్నారని ఉదాహరణ చూపిస్తున్నారు.

ఇలాంటి సన్నాహాలు ఎన్ని చేసినా అసలు విషయానికొచ్చే సరికి వెనకడుగేసే చరిత్ర ఉన్న పవన్ కల్యాణ్.. ఈసారి ఏం చేస్తారో వేచి చూడాలి. 

చంద్రబాబు బీజేపీని కూడా మేనేజ్ చేశారా?