ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సినీ ప్రముఖులు మొదటి నుంచి అంటీ ముట్టనట్టుగానే ఉన్న సంగతిని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారిని కలిసి శుభాకాంక్షలు చెప్పడం సినీ పరిశ్రమ వర్గాలకు రొటీనే. అయితే జగన్ విషయంలో మాత్రం ఎందుకో సినీ పరిశ్రమ దూరదూరంగానే ఉంటూ వచ్చింది. ఆ విషయంలో కులం కోణం బాగా హైలెట్ అయ్యింది. అలాగే సినీ పరిశ్రమ కేరాఫ్ హైదరాబాద్ గానే ఉండటంతో.. ఏపీ సీఎంగా ఎవరున్నా సినీ ప్రముఖులకు పెద్దగా అవసరం పడటం లేదేమో అనే అభిప్రాయాలూ వినిపించాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగతంగా వెళ్లి జగన్ తో ఇది వరకే సమావేశం అయ్యారు.
ఆ సంగతలా ఉంటే..తాజాగా సినీ పరిశ్రమ ముఖ్యులు వైఎస్ జగన్ తో సమావేశం అయ్యారు. సీనియర్ ప్రొడ్యూసర్లు సురేష్ బాబు, మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి, జెమినీ కిరణ్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పక్కా రీజన్ తోనే సినీ పరిశ్రమ ప్రముఖులు ఏపీ సీఎంతో సమావేశం కావడం గమనార్హం.
హుదూద్ తుఫాన్ బాధితుల కోసం తెలుగు చిత్ర పరిశ్రమ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి నిధుల సేకరణ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో తారలు క్రికెట్ మ్యాచ్ ఆడటంతో పాటు ఇంకా వివిధ వినోద కార్యక్రమాలు చేపట్టారు. 15 కోట్ల రూపాయల వరకూ నిధుల సేకరణ చేశారు. ఆ డబ్బుతో ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఆ పని ఇప్పుడు పూర్తి అయ్యిందని, వాటిని బాధితులకు అందించే కార్యక్రమం చేపట్టనుందట చిత్ర పరిశ్రమ. ఈ కార్యక్రమానికి హాజరై హుదూద్ బాధితులకు వాటిని అందించాలని జగన్ ను కోరారట చిత్ర పరిశ్రమ వ్యక్తులు. మొత్తానికి జగన్ ను కలవడానికి సిని ప్రముఖులు సరైన, మంచి అంశాన్నే పరిగణనలోకి తీసుకున్నట్టే.