మనసుంటే మార్గం ఉంటుంది, సృజనాత్మకత ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సినిమా తీయొచ్చు. లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చినా సినిమా షూటింగులు ఊపందుకోవడం లేదు. మొదట్లో కాస్త షూటింగుల హడావుడి మొదలైనా, ఆ తర్వాత కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో షూటింగులకు తెరపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సినిమా, చిన్న సినిమా తేడా లేకుండా.. ఎవ్వరూ షూటింగులకు వెళ్లే పరిస్థితి లేదు. అందుకు కారణం కరోనా భయాలే అని వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమయంలో ఒక తమిళ దర్శకుడు ఈ పరిస్థితుల్లో సినిమాలు తీయాలంటే…సబ్జెక్ట్ లోనే తక్కువ పాత్రలు, పరిమిత సెట్టింగులు ఉంటే సాధ్యమని అన్నాడు. అందుకు ఉదాహరణగా ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా '12 యాంగ్రీమెన్' ను ఉదాహరించాడు.
అదొక కోర్ట్ రూమ్ డ్రామా. 12 ప్రధాన పాత్రల చర్చగా ఆ సినిమా సాగుతుంది. స్టార్టింగ్ సీన్లో ఒక కోర్టు హాల్ నిండా జనం, ఆ తర్వాత 12 మంది ఒక రూమ్ లో చర్చ, చివరకు ఎవరి దారిన వారు వెళ్లడంతో సినిమా ముగుస్తుంది. అదొక క్లాసిక్. హత్య కేసులో, పరిస్థితుల దృష్ట్యా దోషిగా తేలిన ఒక కుర్రాడి గురించి జ్యూరీలో చర్చ జరుగుతుంది. 12 మంది జ్యూరీ సభ్యులు. వాళ్లంతా ఒప్పుకుంటేనే కుర్రాడికి మరణ శిక్ష పడుతుంది.
సాక్ష్యాధారాలేమో అతడికి వ్యతిరేకంగా ఉన్నాయి. జ్యూరీ కూడా ఏకవాక్యంగా అతడిని దోషిగా తేల్చొచ్చు. అయితే ఆ పన్నెండు మందిలో ఒక్క వ్యక్తి.. ఆ కుర్రాడు నిర్దోషేమో అని అంటాడు. అందుకు ఆధారం ఏమిటని 11 మంది ప్రశ్నిస్తారు. ఆధారాలు తన వద్ద లేవని.. అంటూ అతడు మొదలుపెడతాడు. ఆ కేసుపై కూలంకషమైన చర్చను సాగిస్తాడు. ఒక్కొక్కరిగా జ్యూరీ సభ్యులు అతడితో ఏకీభవిస్తారు. ఒక్కో పాయింట్ ను లేవదీస్తూ చర్చ సినిమాగా సాగుతుంది. చివరకు 12 మందీ ఆ కుర్రాడు నిర్దోషి అని ఏకీభవించడంతో సినిమా ముగుస్తుంది.
హాలీవుడ్ సినీ చరిత్రలో తప్పనిసరిగా చూడదగిన సినిమాగా 12 యాంగ్రీమెన్ నిలుస్తుంది. ఆ సినిమాలో మూడే సెట్టింగులు. కోర్ట్ హాల్, జ్యూరీ డిస్కషన్ నడిచే రూమ్, వాళ్లంతా రూమ్ నుంచి బయటకు వచ్చాకా ఒక రోడ్డుపై కూడలి నుంచి వారు ఎవరి దారిన వారు సాగడం. ఇలాంటి సినిమాలు కరోనా భయాలతో ఏర్పడిన పరిమితుల మధ్యన తీయొచ్చనేది తమిళ దర్శకుడి ఉవాచ. అయితే అలాంటి అద్భుత సినిమాలు రావడానికి పరిమితులే కారణం కానక్కర్లేదు, మూవీ మేకర్లలో ఉండే క్రియేటివిటీ అలాంటి సినిమాలను తీసుకొస్తుంది!
హాలీవుడ్ లో అలాంటి క్లాసిక్స్ మరిన్ని ఉన్నాయి. ఒక డ్రామాను తలపించే రీతిలో ఒకటీ రెండు సెట్స్ లో, పరిమిత పాత్రలతో వచ్చి.. క్లాసిక్స్ గా నిలిచిపోయిన సినిమాలు మరిన్ని ఉన్నాయి. 12 యాంగ్రీమెన్ తో పాటు ప్రస్తావించాల్సిన అలాంటి సినిమాల్లో ఒకటి 'ది హేట్ ఫుల్ ఎయిట్'. క్వెంటిన్ టరంటినో దర్శకత్వంలో వచ్చిన గొప్ప సినిమా ఇది. ఎనిమిది ప్రధాన పాత్రలు మరో అరడజను సహాయ పాత్రలుండే సినిమా ఇది.
థ్రిల్లింగ్ మాస్టర్ పీస్ అనే నిర్వచనానికి న్యాయం చేస్తుంది ఈ సినిమా. సినిమా ప్రారంభం అయిన గంట సేపు.. మంచు కప్పబడిన రోడ్లో గుర్రపు బండి సాగిపోతూ ఉంటుంది! ఆ గుర్రంబండిలో ప్రయాణిస్తూ మూడు పాత్రలు, లిఫ్ట్ అడిగి మరో రెండు పాత్రలు ప్రేక్షకులకు పరిచయం అవుతాయి. వీళ్ల ఇంట్రడక్షన్, వీరు ఎక్కడి ప్రయాణిస్తున్నారో చెప్పుకోవడమే దాదాపు గంటకు పైగా సాగుతుంది. అయినా ఎక్కడా బోర్ అనే ఫీలింగ్ రాకుండా ఆ గుర్రంబండి ప్రయాణాన్ని సాగించడం టరంటినో స్టోరీ టెల్లింగ్ నేర్పరి తనానికి నిదర్శనం. దట్టంగా మంచు కప్పబడిన పర్వత ప్రాంతంలో.. విపరీతంగా మంచు వర్షం కురుస్తున్న వేళ.. ఆ గుర్రంబండి ప్రయాణాన్ని తెరపై వీక్షిస్తుంటే, అదొక కనువిందులా ఉంటుంది.
మంచుపాతం మరింత తీవ్రం కావడంతో..ఒక పూటకుళ్ల ఇంటి దగ్గర వాళ్లు ఆగడం, అక్కడ మరి కొన్ని పాత్రల ఎంట్రీ.. అంతా ఒక ఇంట్లో ఫ్రెండ్స్ కావడం, బయట విపరీతంగా మంచు కురుస్తూ ఉండటంతో ఒకటీ రెండ్రోజుల పాటు ఆ ఇంట్లోనే ఆగిపోవాల్సిన పరిస్థితులు. అక్కడ నుంచి బ్రహ్మాండమైన ట్విస్టులు, ఆ బౌంటీ హంటర్లు, క్రిమినల్స్ వెనుక కథలు ఒక్కోటి అన్ ఫోల్డ్ చేస్తూ.. ప్రేక్షకుడిని కట్టిపడేస్తాడు కథకుడు, దర్శకుడు అయిన టరంటినో. కథంతా సాగేది, పాత్రలన్నీ ఉండేది ఆ గదిలోనే. అయినా అనూహ్యమైన మలుపులతో.. వీక్షకుడికి ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది 'ది హెట్ ఫుల్ ఎయిట్'.
19వ శతాబ్దంలో అమెరికన్ బౌంటీ హంటర్లు, మెక్సికన్ క్రిమినల్స్ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. అమెరికాలో తెల్లవాళ్ల- నల్లవాళ్ల మధ్య వైరుధ్యాలను కూడా అండర్ లైన్ గా చర్చిస్తుంది ఈ సినిమా. ఈ సినిమాను వాస్తవానికి 'జాంగో – అన్ చైన్డ్' అనే తన సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా రూపొందించాలనుకున్నాడట టరంటినో. అమెరికన్ సివిల్ వార్ కు రెండేళ్లకు ముందు కథాంశం 'జాంగో'. సివిల్ వార్ తర్వాత, బానిసత్వం రద్దు తర్వాతి కథాంశం 'ది హేట్ ఫుల్ ఎయిట్'. జాంగో (జాంగో సినిమాలో హీరో) పాత్రను సివిల్ వార్ తర్వాతి పరిస్థితుల్లో ప్రవేశపెట్టి ఈ కథను రాసుకున్నాడట. అయితే ఆ తర్వాత మార్పులు చేసి .. ఆ పాత్రకు పేరు మార్చి, తన సినిమాల్లో తప్పనిసరిగా కనిపించే శామ్యూల్ ఎల్. జాక్సన్ కు ఆ పాత్రను ఇచ్చి హెట్ ఫుల్ ఎయిట్ రూపొందించాడు టరంటినో.
ఈ సినిమా గురించి మరో మాటలో చెప్పాలంటే.. దీన్నంతా ఒక థియేటర్ డ్రామా స్టేజ్ లో ప్రదర్శించవచ్చు! అలా ఒక స్టేజ్ ప్లేలా ఉంటుంది ఈ సినిమా. ఇలాంటి కథను రాసుకోగలగాలే కానీ, లాక్ డౌన్ వేళ సెట్టింగుల వేట, షూటింగుల కోసం ప్రయాణాలు లేకుండా.. పరిమితమైన కాస్టింగుతో తక్కువ బడ్జెట్ తో కూడా సినిమాను రూపొందించొచ్చు. అయితే అంతటి బలమైన కథ, కథనాలు మాత్రం అవసరం!
ఈ తరహాలో కథలు చెప్పడం టరంటినోకు వెన్నతో పెట్టిన విద్య. దర్శకుడిగా అతడి మొదటి సినిమా కూడా ఒక స్టేజ్ ప్లే తరహాలో ఉంటుంది. అది కూడా కేవలం మూడు సెట్టింగుల్లో సాగుతుంది. ఆ సినిమా పేరు 'రిజర్వాయర్ డాగ్స్'. హాలీవుడ్ లో ఏడు కోట్ల బడ్జెట్ తో ఆ సినిమాను రూపొందించి, దాన్నొక క్లాసిక్ గా చిరకాలం నిలిచిపోయేలా తీర్చిదిద్దాడు టరంటినో. ఆ సినిమా కూడా ఒక స్టేజ్ పై ప్రదర్శించదగిన స్థాయి కథ!
సూట్లూబూట్లు వేసుకునే ఒక దొంగల ముఠా బ్యాంకు రోబరీకి రెడీ అవుతూ, ఒక హోటల్లో పిచ్చాపాటిగా మాట్లాడుతుంది ఫస్ట్ సీన్లో. అక్కడ నుంచి వాళ్లు బయటకు వచ్చి.. దొంగతనానికి బయల్దేరడంతో సీన్ కట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్లు దొంగతనం అయిపోయాకా తాము చేరాలనుకున్న ఇంటికి ఒక్కొక్కరు చేరుకుంటూ ఉండటంతో సినిమా ఊపందుకుంటుంది. వాళ్ల దొంగతనం ప్లాన్ లీకయి ఉంటుంది, వాళ్లలోనే ఎవరో కుట్రదారుడున్నాడని, పోలీసుల ఏజెంట్ ఒకరని వాళ్లకు అర్థం అవుతుంది. అదెవరు? అని తేల్చుకుంటూ వాళ్లలో వాళ్లు కలహించుకుంటూ, ఒక్కొక్కరిని అంతమొందించుకుంటారు.
మెక్సికన్ స్టాండాఫ్ తో సినిమా ముగుస్తుంది. ఇంట్రడక్షన్ సీన్ కాకుండా, సినిమా అంతా ఒకే సెట్ లో ముగుస్తుంది. హాలీవుడ్ లో బ్యాంకులను దోచడం గురించి ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే అసలు దొంగతనం సీన్ ను చూపకుండా వచ్చిన మనీ హైస్ట్ సినిమా గా నిలుస్తుంది రిజర్వాయర్ డాగ్స్. టరంటినో తొలి సినిమా ఇది.
మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు కానీ, 'పల్ప్ ఫిక్షన్' రూపంలో సంచలన విజయాన్ని ఆ దర్శకుడు నమోదు చేసిన తర్వాత అందరి దృష్టి అతడి తొలి సినిమా అయిన 'రిజర్వాయర్ డాగ్స్' మీద పడింది. ఇది కూడా క్లాసిక్ గా నిలిచిపోయింది. హిందీలో కూడా ఆ సినిమా స్ఫూర్తితో ఒక సినిమాను తీసినట్టున్నారు.
వెండితెరపై కథను చెప్పే నేర్పు ఉండాలి కానీ, సినిమాకు కావాల్సింది సెట్టింగులు, విదేశీ లొకేషన్లు, భారీ చేజ్ లు, ఫైట్ లు, పాటలు, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్ లు, గ్రాఫిక్స్ కాదు. పాత్రలను ఒకే గదిలో కూర్చోబెట్టి సైతం ప్రేక్షకులను థియేటర్లో సీట్లకు అతుక్కుపోయేలా సినిమాలు తీయొచ్చని హాలీవుడ్ మూవీ మేకర్లు ఇలా నిరూపించారు. భారీ తారగణాల, భారీ షూటింగుల- చేజింగుల సినిమాల రూపకల్పనకు ఇప్పుడు ఎలాగూ అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో అయినా.. 12 యాంగ్రీమెన్, హేట్ ఫుల్ ఎయిట్, రిజర్వాయర్ డాగ్స్ వంటి సినిమాలను ఇండియన్ మూవీ మేకర్స్ నుంచి ఆశించవచ్చా?!
-జీవన్ రెడ్డి.బి