టిక్ టాక్ కు ట్రంప్ వార్నింగ్, ‘అమ్మేస్తారా లేదా?’

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్ట్ ట్రంప్ టిక్ టాక్ యాప్ యాజ‌మాన్యం బైట్ డ్యాన్స్ కు ఫైన‌ల్ వార్నింగ్ ఇచ్చార‌ట‌. వీలైనంత త్వ‌ర‌గా ఆ యాప్ ను అమెరిక‌న్ మైక్రోసాఫ్ట్ కు అమ్మేస్తే స‌రేస‌రి, లేక‌పోతే…

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్ట్ ట్రంప్ టిక్ టాక్ యాప్ యాజ‌మాన్యం బైట్ డ్యాన్స్ కు ఫైన‌ల్ వార్నింగ్ ఇచ్చార‌ట‌. వీలైనంత త్వ‌ర‌గా ఆ యాప్ ను అమెరిక‌న్ మైక్రోసాఫ్ట్ కు అమ్మేస్తే స‌రేస‌రి, లేక‌పోతే ఆ యాప్ ను అమెరికా వ్యాప్తంగా నిషేధించ‌డ‌మే త‌రువాయి అని ట్రంప్ హెచ్చ‌రించిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. జాతీయ భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా టిక్ టాక్ ను అమెరికాలో నిషేధించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టుగా ట్రంప్ ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు. ఇండియాలో ఇప్ప‌టికే ఈ యాప్ నిషేధితం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో అమెరికాలో కూడా ట్రంప్ అదే ఆలోచ‌నే చేస్తున్న‌ట్టుగా  ఉన్నారు.

అయితే టిక్ టాక్ యాజ‌మాన్యం మార‌బోతోంద‌ని, దాన్ని మైక్రోసాఫ్ట్ కొన‌బోతోంద‌నే వార్త‌లూ అంతే వేగంగా వ‌చ్చాయి. అమెరిక‌న్ యాజ‌మాన్యంలో అయితే టిక్ టాక్ కు అక్క‌డ ఆటంకాలు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని స్ప‌ష్టం అవుతోంది. ట్రంప్ కూడా ఆ ర‌కంగా అయితే శాంతించ‌వ‌చ్చ‌ని విశ్లేష‌ణ‌లు వినిపించాయి. ఇదే అవ‌కాశంగా టిక్ టాక్ ను కొనుగోలు చేయ‌డానికి మైక్రోసాఫ్ట్ పావులు క‌దుపుతూ ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే బైట్ డ్యాన్స్ ఆ ఊహాగానాల‌ను కొట్టేసింది. టిక్ టాక్ ను మైక్రోసాఫ్ట్ కు అమ్మ‌డం లేద‌ని తేల్చ‌డంతో.. ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టకి వ‌చ్చిన‌ట్టుగా స‌మాచారం.

ఈ క్ర‌మంలో మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్యానాదెళ్ల‌తో కూడా ట్రంప్ మాట్లాడార‌ట‌. 45 రోజుల్లో ఏదో ఒక‌టి తేలిపోవాల‌ని, సెప్టెంబ‌ర్ 15 నాటికి టిక్ టాక్ కు అమెరిక‌న్ యాజ‌మాన్యంలోకి రావ‌డ‌మా, లేక అమెరికాలో నిషేధితం కావ‌డ‌మా.. అనే ప్ర‌తిపాద‌ల‌ను పెడుతున్నార‌ట ట్రంప్. మ‌రి మొత్తం వాటాను అమ్మేసుకుని బైట్ డ్యాన్స్ డ‌బ్బులు పొందుతుందో లేక ఇండియాలోలాగా అమెరికాలో నిషేధితం అయిపోయి చాప చుట్టేసుకుంటుందో.. ఇప్పుడు దానికే ఆప్ష‌న్లు మిగిలాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

చంద్రబాబు స్వయంకృతాపరాధం