కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు కరోనా పాజిటివ్ గా తేలినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఆయన హోం ఆఫీస్ లో పని చేసే ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలగా, అప్పటి నుంచి యడియూరప్ప క్వారెంటైన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు ఆదివారం పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలినట్టుగా సమాచారం. యడియూరప్ప ఆసుపత్రిలో చేరినట్టుగా ప్రకటించుకున్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని కూడా ఆయన తెలిపారు.
కర్ణాటక సీఎంతో పాటు ఆయన కుటుంబీకులకు సైతం కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆయన కూతురు పద్మావతికి పాజిటివ్ గా తేలిందట. ఆయన కుమారుడికి నెగిటివ్ అని తేలగా, కూతురు మాత్రం కరోనా బారిన పడినట్టుగా తెలుస్తోంది. ఇక యడియూరప్ప ఆఫీసులోని వ్యక్తులకు, ఇటీవలి కాలంలో ఆయనతో సమావేశం అయిన వారికి సోమవారం రోజున పరీక్షలు నిర్వహించనున్నారట. మొత్తం 50 మందిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టుగా ప్రకటించారు.
దేశంలో ప్రముఖులకు కరోనా ఇబ్బందులు తప్పుతున్నట్టుగా లేవు. కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా కు కరోనా పాజిటివ్ తేలిన కొన్ని గంటల్లోనే యడియూరప్ప కూడా ఆ జాబితాలో చేరారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ సీఎం కు కూడా కరోనా సోకినట్టుగా ప్రకటించారు. ఆయన కూడా చికిత్స పొందుతున్నట్టున్నారు. మరోవైపు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.