ఇది రక్షాబంధన్ స్పెషల్. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోకిరీ తిక్క కుదిర్చేలా ఉన్న ఈ తీర్పు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని నగరానికి చెందిన విక్రమ్ బాగ్రి ఓ ఇంట్లోకి వెళ్లి 30 ఏళ్ల వివాహితపై వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేశారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి కటకటాలపాలు చేశారు. నిందితుడు బెయిల్ కోసం ఇండోర్ కోర్టును ఆశ్రయించాడు.
ఇండోర్ కోర్టు న్యాయమూర్తి రోహిత్ ఆర్య కేసు పూర్వాపరాలను పూర్తిగా అధ్యయనం చేశారు. దేశ వ్యాప్తంగా సోమవారం రక్షాబం ధన్ జరుపుకోనున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. దాని విశిష్టతను పరిగణలోకి తీసుకోని ఓ అద్భుతమైన, ఆదర్శనీయ మైన సంచలన తీర్పు చెప్పారు.
నిందితుడికి బెయిల్ ఇస్తూనే…షరతులు విధించారు. రక్షా బంధన్ సందర్భంగా బాధిత వివాహితతో రాఖీ కట్టించుకోవడంతో పాటు రూ.11 వేలు ఇవ్వాలని నిందితుడిని ఆదేశించారు. తీర్పు వివరాల్లోకి మరింత లోపలికి వెళితే… రక్షాబంధన్ సందర్భంగా అంటే నేడు (ఆగస్టు 3) 11 గంటలకు నిందితుడు తన భార్యతో కలిసి బాధిత వివాహిత ఇంటికి స్వీటు బాక్సుతో వెళ్లాలి.
బాధితురాలితో రాఖీ కట్టించుకోవాలి. భవిష్యత్‌లో అన్ని వేళలా రక్షణగా ఉంటానని ఆమెకు భరోనా ఇవ్వాలి. అలాగే రూ.11వేలు ఇవ్వాలని జడ్జి ఆదేశించారు. బాధితురాలి కుమారుడికి రూ.5వేలతో బట్టలు, స్వీట్లు కొనివ్వాలి. అలాగే బాధిత వివాహిత ఆశీర్వాదం పొందాలని నిందితుడు బాగ్రికి జడ్జి ఆదేశాలిచ్చారు. ఈ తీర్పు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.