సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి నెల దాటింది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి చాలామంది ప్రముఖుల్ని విచారించారు పోలీసులు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈరోజు ఆదిత్య చోప్రా ఈ కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. అవును.. యష్ రాజ్ ఫిలిమ్స్ ఛైర్మన్ హోదాలో ఉన్న ఆదిత్య చోప్రాను పోలీసులు విచారించారు.
ఈరోజు ఉదయం వెర్సోవా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఆదిత్య చోప్రా, దాదాపు 3 గంటల పాటు పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సుశాంత్ మరణానికి, ఆదిత్య చోప్రాకు ఏంటి సంబంధం అనే కోణంలో ప్రస్తుతం బాలీవుడ్ లో చాలా కథనాలు ప్రత్యక్షమౌతున్నాయి. కొన్ని రోజుల కిందట యష్ రాజ్ ఫిలిమ్స్ కు చెందిన కాస్టింగ్ డైరక్టర్ షన్నూ శర్మను పోలీసులు విచారించారు. ఇప్పుడు ఏకంగా ఆదిత్య చోప్రానే ప్రశ్నించడంతో అందరి దృష్టి మరోసారి సుశాంత్ కేసుపై మళ్లింది.
యష్ రాజ్ ఫిలిమ్స్ పై బాలీవుడ్ లో చాలా పుకార్లు ఉన్నాయి. ఆ సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నామంటే కెరీర్ ఇక అంతే సంగతులు అనే రిమార్క్ ఉంది. గొడ్డు చాకిరి చేయించుకొని చిల్లర మొహాన కొడతారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ మరణానికి సంబంధించిన కేసులో ఆదిత్య చోప్రాను విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు ఈ కేసుకు సంబంధించి సుశాంత్ సింగ్ వైద్యుల స్టేట్ మెంట్ ను కూడా రికార్డు చేశారు పోలీసులు. సుశాంత్ ను ట్రీట్ చేసిన మెయిన్ సైకియాట్రిస్ట్ తో పాటు మరో ముగ్గురు వైద్యుల వెర్షన్లను కూడా రికార్డు చేశారు. ఈ కేసును ముంబయి పోలీసులే హ్యాండిల్ చేస్తారని, సీబీఐ విచారణ అక్కర్లేదని మహారాష్ట్ర హోంశాఖ నిన్ననే ప్రకటించింది.