అయ్యవారు ఏంచేస్తున్నారంటే.. చేసిన తప్పులు దిద్దుకుంటున్నారనేది సామెత. అంటే.. ఇక్కడ తప్పులు చెయ్యడమే అయ్యవారికి ఆనవాయితీ అని అర్థం. ప్రస్తుతం నారా లోకేష్ పరిస్థితి చూస్తుంటే సరిగ్గా ఇదే గుర్తొస్తుంది. ట్విట్టర్లో పెట్టిన పోస్టుల్లో ఏది ఫేక్ ఏది రియల్ అని తరచి చూసే పనిలో పడ్డారు లోకేష్. వైసీపీ అభిమానులు కూడా సరిగ్గా లోకేష్ ని ఇక్కడే బుక్ చేశారు. ఆయన పెట్టిన ట్వీట్లన్నిటినీ ఫన్నీ మీమ్స్ గా మార్చేస్తున్నారు. దీంతో లోకేష్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
5 రూపీస్ పేటీఎం బ్యాచ్ అంటూ ట్విట్టర్ లో నానా హంగామా చేస్తున్నారు చినబాబు. ఓవైపు ఫేక్ న్యూస్ ని, మరోవైపు తాను పెట్టిన ఒరిజినల్ పోస్ట్ ని పెట్టి కంపేర్ చేస్తూ చూడండి నా ప్రతిభ అంటూ వ్యర్థ ప్రయోగాలు చేస్తున్నారు. అసలు ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తోంది ఎవరు? వారి స్థాయి ఏంటి? అని ఆలోచించకుండా నేరుగా లోకేషే కలుగజేసుకోవడం విచిత్రం. లోకేష్ వ్యవహారాన్ని అలుసుగా తీసుకుని ఉన్నదీ లేనిదీ పెట్టేసి ఆయన్ని ఆటపట్టిస్తోంది ఓ బ్యాచ్.
ఇప్పటి వరకూ ఇలాంటి ఫేక్, రియల్ అంటూ చాలానే పోస్ట్ లు పెట్టారు లోకేష్. ఇటీవల ఇది మరీ పరాకాష్టకు చేరింది. ఎన్టీవీ రిపోర్టర్ కరోనాతో చనిపోయిన సందర్భంలో ఆయనకు నివాళులర్పిస్తూ లోకేష్ ఇటీవల ఓ ట్వీట్ పెట్టారు. తెలుగులో పెట్టిన ఈ ట్వీట్.. ఫాంట్ సపోర్ట్ చేయకపోతే.. ఒత్తులు, పొల్లులు విడివిడిగా కనిపిస్తాయి. అలా ఒత్తులు విడిపోయిన ఓ ట్వీట్ పట్టుకుని పేటీఎం బ్యాచ్ అంటూ రెచ్చిపోయారు లోకేష్. ఇది ఫేక్ న్యూస్, ఇది ఒరిజినల్ న్యూస్ అంటూ రెండు ట్వీట్ లను కంపేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఇక చూస్కోండి.. లోకేష్ పై ఎదురుదాడి మొదలైంది.
ఫేక్ న్యూస్ అంటే ఏంటి? అర్థం మారుస్తూ, ద్వంద్వార్థాలు చేరుస్తూ.. ఉన్నది లేనట్టు క్రియేట్ చేస్తే దాన్ని ఫేక్ న్యూస్ అంటారు. కేవలం ఒత్తులు, పొల్లులు మారిపోయినంత మాత్రాన తన ఇమేజ్ ని ఎవరో డ్యామేజ్ చేస్తున్నారంటూ మథన పడటం ఒక్క లోకేష్ బాబుకే చెల్లిందని కామెంట్లు పడుతున్నాయి. ఎవరో పెట్టిన ట్వీట్లను కూడా తనవిగా చెప్పుకునే లోకేష్.. ఇలా రంధ్రాన్వేషణ చేయడం ఎంతవరకు సబబని అంటున్నారు.
మాట్లాడ్డం చేతకాక ట్వీట్లు అడ్డం పెట్టుకునే చినబాబు.. ఆ ట్వీట్లలో కూడా ఫేక్, రియల్ అంటూ ఎకసెక్కాలాడటం, అదేదో తాను కనిపెట్టినట్టు బిల్డప్ ఇవ్వడం మరీ చీప్ వ్యవహారంలా మారింది. ఇకనైనా ఇలాంటి రంధ్రాన్వేషణ మాని అసలు పనిపై దృష్టిపెడితే మంచిది.
పేటీఎం బ్యాచ్ ఎవరో లోకేష్ కనిపెట్టేలోగా మరో దఫా ఎన్నికలు రావడం ఖాయం. అప్పుడు కూడా చినబాబు ఇలానే ట్వీట్లతో కాలం వెల్లబుచ్చేలా ఉన్నారంటూ సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి.