ఎన్నాళ్ల నుంచో దర్శకుడు చందు మొండేటి ఆశగా పట్టుకుకూర్చున్న సినిమా కార్తికేయ 2. పీపుల్స్ మీడియా-అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. కరోనా లేకపోతే ఎలా వుండేదో కానీ, ఇప్పుడు మాత్రం కార్తికేయ 2 ప్రాజెక్టు కు బ్రేక్ పడిందని గ్యాసిప్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది మధ్యలో తప్ప అప్పటి వరకు ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యే అవకాశాలు తక్కువ అని వినిపిస్తోంది.
ఈ లోగా హీరో నిఖిల్ ఏం చేయాలి? జిఎ 2 లో వున్న 18 పేజెస్ కూడా ఇప్పట్లో స్టార్ట్ కాదని తెలుస్తోంది. షూటింగ్ లు ప్రారంభమై, పైప్ లైన్ లో వున్న సినిమాలు అన్నీ ఓ కొలిక్కి వచ్చాకే కొత్త సినిమాల సంగతి పట్టించుకుంటారు టాలీవుడ్ జనాలు. అందువల్ల దానా దీనా వచ్చే ఏడాది సమ్మర్ వరకు హీరో నిఖిల్ ఖాళీగా వుండాల్సిన పరిస్థితి వుంది.
అందుకే ఈ లోగా తన బంధువలతో కలిసి ఓ మీడియం లేదా చిన్న థ్రిల్లర్ ను తెరకెక్కించే ఆలోచన చేస్తున్నారని, దానికి స్క్రిప్ట్ ను నిఖిల్ అందిస్తాడని టాక్ వినిపిస్తోంది. అయితే తాను నటిస్తాడా? నటించడా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. తాను స్క్రిప్ట్, నిర్మాణ భాగస్వామ్యంతో చిన్న సినిమాలు అందించే ఆలోచనలు అయితే చేస్తున్నాడని తెలుస్తోంది. దీనికి బ్యాక్ ఎండ్ లో నిఖిల్ కు సన్నిహితుడైన చందు మొండేటి సహకారం అందిస్తారని టాక్.ఈ ప్రాజెక్టు ఓటిటి టార్గెట్ గా వుంటుందని తెలుస్తోంది.