తెలుగు సామాజిక మీడియా ఉద్దాన పతనాలు

మీడియా యందు సామాజిక మీడియా వేరయా అన్నట్లుంటుంది. తెలుగునాట రాజకీయాలకే కాదు మీడియాకు కూడా కులసమీకరణాలు, కుల బంధాలు అలుముకుని చాలా ఏళ్లు అయింది. Advertisement దశాబ్దాల కిందట ప్రారంభమైన ఈ వ్యవహారం రెండువేల…

మీడియా యందు సామాజిక మీడియా వేరయా అన్నట్లుంటుంది. తెలుగునాట రాజకీయాలకే కాదు మీడియాకు కూడా కులసమీకరణాలు, కుల బంధాలు అలుముకుని చాలా ఏళ్లు అయింది.

దశాబ్దాల కిందట ప్రారంభమైన ఈ వ్యవహారం రెండువేల దశకంలో అత్యంత కీలక దశకు చేరుకుంది. తమనుఎవరూ ఏమీ చేయలేరు. తాము తలచుకుంటే ఎవర్నయినా ఏమైనా చేయగలం, అనే స్థాయికి చేరుకుంది.

రాజకీయాలను, పార్టీలను, నాయకులను శాసించే స్థాయికి  చేరుకుంది. ఆ స్థాయి ఆ సామాజిక మీడియాకు బలాన్ని ఇవ్వడంతో పాటు, తిరుగులేని తెంపరితనాన్ని ఇచ్చింది. దాంతో వార్తలు వ్యాఖ్యలుగా మారిపోయాయి.  నాయకులకు మద్దతు ఇవ్వడం కోసం అవతలివారి వ్యక్తిత్వాలపై బురద జల్లడం వంటి కార్యక్రమాలకు తెగబడేలా చేసింది.

నీ నోట్లో మన్ను పడ….ఇది తిట్టు
నీ నోట్లో పకోడీలు కొట్ట…ఇదీ తిట్టులా ధ్వనించేదే కానీ తిట్టుకాదు.

ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఓ వర్గపు మీడియా వ్యవహారం అచ్చంగా ఇలాగే వుంది. ఇక్కడ తిట్టాల్సిందే. తిట్టి తీరాల్సిందే. కానీ అక్కడ తిట్టకూడదు. అయినా తిట్టాలి. అందుకోస ఎంచుకున్న రెండు మార్గాలను పై రెండు వాక్యాలు స్పష్టం చేస్తాయి. 

ఈ రాష్ట్రానికి వచ్చేసరికి తలుపచెక్కతో ఒక్కటుచ్చుకుని, ఆ రాష్ట్రానికి వచ్చే సరికి తమలపాకుతో సుతారంగా నిమిరిపోవడం అన్నది కార్యక్రమంగా మారింది. ఇక్కడ తిట్టి, కొడుతున్నవారు అక్కడ ఎందుకు చేతులు కట్టుకుని, ఒకటికి పదిసార్లు తరచి చూసుకుని మరీ పదాలు పేర్చి వార్తలు వండుతున్నారన్నది అనవసరం. కానీ ఇక్కడ మాత్రం ఎందుకలా? నానా యాగీ చేస్తూ కిందా మీదా అయిపోతున్నారన్నది ముఖ్యం.

80వ దశకం నుంచీ
సమైక్యాంధ్రరాష్ట్రంలో మీడియా వ్యవహారాలను 80వ దశకానికి ముందు వెనుక అన్నట్లు చూసుకోవాలేమో? తెలుగునాట ఓ వర్గం మీడియాను తన గుప్పిట్లో వుంచుకుని, రెడ్ల పార్టీగా ముద్ర పడిన కాంగ్రెస్ పార్టీని ఓ పథకం ప్రకారం బలహీనపరుస్తూ వచ్చింది. ఈ వర్గపు మీడియానే సామాజిక మీడియా అని మనం ప్రసావించుకుంటున్నది. 

అంతకు ముందు రాష్ఠ్రంలోని సామాజిక ఈక్వెషన్లలో కాంగ్రెస్ పార్టీలో రెడ్ల హవా తట్టుకోలేని వర్గం మరో దారి లేక కమ్యూనిస్టు పార్టీలోకి వెళ్లిన వైనాలు వున్నాయి. అక్కడ కూడా అదే తలకాయనొప్పి, ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలి కొంత వరకు రెండు వర్గాలు చెరో వైపు చేరడం వంటివి జరిగాయి.

తెలుగునాట గమత్తు ఏమిటంటే ఏ రాజకీయ పరిణామం అయినా అత్యంత సహజంగా కనిపించినా దాని వెనుక రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య పోరు వుండడం అన్నది అనివార్యం. ఆఖరికి భాజపా ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే తీర్మానం చేయడానికి వెనుక కూడా ఆ పార్టీలో ఓ సామజిక వర్గం నేత, ఆయన ఆధిపత్యం సహించలేక, తమ కుంపటి తాము పెట్టుకొవాలని మరో వర్గం అనుకోవడమే అనే టాక్ వుంది.  

మొత్తానికి రాజకీయాల్లో మాత్రమే వుండే సామజిక వర్గ విబేధాలు మీడియాకు పాకడం అన్నది 80వ దశకం నుంచి ప్రారంభమైంది. ఎప్పుడయితే ఎన్టీ రామారావు పార్టీ పెట్టారో, ఇది కీలక దశకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాన్ని తెలుగుదేశం తప్ప మరెవరు పాలించేందుకు వీలు లేనేంత దశకు ఈ మీడియా సంకుచితత్వం చేరిపోయింది. అయినా కూడా జనాలు చంద్రబాబును రెండు సార్లు ఓడించారు. ఈ సమయంలో ఈ వర్గం మీడియా అతి అన్నది పతాక స్థాయికి చేరిపోయింది. 

ఇక్కడ గమ్మత్తయిన సంగతేమిటంటే, ఇప్పుడు సామాజిక బంధాలు పెనవేసుకున్న ఓ మీడియా ఒకప్పుడు కాంగ్రెస్ కు అనుకూలంగా వుండేది. దాని యాజమాన్యానికి కాంగ్రెస్ తో బంధాలు వుండేవి. కానీ ఎప్పుడయితే యాజమాన్యం దృక్పథంలో మార్పు వచ్చిందో, అప్పడు ఈ రాజకీయ దిగజారుడు ప్రారంభమైంది. అంతకు ముందు కాంగ్రెస్ కు కొమ్ముకాసినా ఇంత నిస్సిగ్గు వార్తలు వండివార్చిన దాఖలా లేదు. 

అప్పటి వరకు కేవలం ప్రభుత్వ వ్యతిరేక వార్తల విధానం అన్నది ఎజెండా వుండేది ఈ వర్గపు మీడియాకు. అది కాస్తా కక్ష గా, కోపంగా మారి, వ్యక్తిత్వ హననానికి దారి తీసింది. అధికారంలో వున్నవారు తమ అభీష్టానికి అనుగుణంగా నడుచుకోకపోవడం, తమ ప్రయోజనాలు దెబ్బతింటూ వుండడం, అన్నింటి మించి తాము పురుడుపోసి, సాకి, పెంచిన పార్టీ నీరసించిపోతూ వుండడంతో ఎంత కిందకు దిగజారాలో అంతకు అంతా దిగిపోయారు.

ముఖ్యంగా వైఎస్ జగన్ అనే నాయకుడు పదవిలోకి వస్తే పరిస్థితులు ఊహించలేనంత దారుణంగా మారిపోతాయని ముందే పసిగట్టి ఎన్ని పద్మవ్యూహాలు పన్నాలో అన్నీ పన్నారు. కానీ కాలం కలిసి రాలేదో? ప్రజలు ఈ వర్గపు మీడియా పథకాలను పసిగట్టేసారో, అన్నింటికి మించి తెలుగుదేశం పాలన మీద విముఖత పెరిగిందో, మొత్తానికి జగన్ కు పట్టం కట్టారు. అయితే ఇది అంత సులువుగా జరిగిపోలేదు. దీని వెనుక కూడా మీడియా పథకాలు, మారుతున్న మీడియా తీరుతెన్నులు, ఇవన్నీ చాలా వున్నాయి.

ఆ మీడియా పతనం
ఓ సామజిక వర్గ బంధాలు పెనవేసుకుని, ఓ పార్టీని భుజనా ఎత్తుకున్న మీడియా పతనం అంత సులువుగా సాధ్యం కాలేదు. ప్రజల అభిప్రాయాలు మారుతుండడం, అసలు విషయాలు ప్రజలకు తెలుస్తూ వుండడం, కొత్త మీడియా రావడం, సోషల్ మీడియా ఆవిర్బావం, సదరు మీడియా వ్యతిరేక ప్రభుత్వం అధికారంలోకి వుండడం.  అంతకు మించి కరోనా విరుచుకుపడడం, ఇలా కర్ణుడి చావుకు అనేక కారణాలు కలిసి వచ్చినట్లు దశాబ్దాల మీడియా ఆధిపత్యానికి అడ్డుకట్ట పడింది. అయితే అది ఏమంత సులువుగా సాధ్యం కాలేదు.

సాక్షి ఆవిర్భావం వరకు
తెలుగునాట సాక్షి పత్రిక ఆవిర్భావం వరకు నాణానికి ఒకవైపే ప్రపంచం అన్నట్లు వుండేది. ఉదయం దినపత్రిక వచ్చినా, దాన్ని మూతపడే వరకు కొందరు నిద్రపోలేదు. ఎంత చేయాలో అంతా చేసారు. ఎన్ని పన్నాగాలు పన్నాలో అన్నీ పన్నారు. ఆఖరికి అది మూతపడింది. వార్త పత్రిక వచ్చి కొంత లోటు పూడ్చినా స్టాండ్ అనేది రకరకాలుగా మారడం వల్ల పెద్దగా ప్రతిబంధకం కాలేదు. మిగిలిన మీడియా అంతా కూడా పెద్ద సమస్య కాలేదు.

ఇలాంటి సమయంలో అత్యవసరమై, నాణానికి రెండో వైపు జనాలకు తెలియచెప్పాల్సిన అవసరం కోసం, తమ మనుగడకు అనివార్యమై సాక్షి పత్రికను ఆవిష్కరించారు. నాణానికి రెండో వైపు తెలుసుకోవాలనే కుతూహలం జనాలకు భయంకరంగా వుండడమో, ఒకే తరహా వార్తలతో ఒకే పార్టీకి, ఒకే వర్గానికి కొమ్ము కాస్తూ వార్తలు ఇస్తూ వెళ్తున్న తీరు చూసి విసుగుచెందడమో, లేదా వైఎస్ఆర్ పాలన, ఫ్యామిలీ మీద వున్న అభిమానమో, సాక్షి పత్రికకు ఇన్ స్టాంట్ ఆదరణ వచ్చింది. గతంలో యాంటీ తెలుగుదేశం స్టాండ్ తీసుకున్న పత్రికలు అనేకం కాలగర్భంలో కలిసిపోవడమో, లేదా కాలానుగుణంగా అవసరాల కోసం స్టాండ్ మార్చుకోవడమో అనివార్యమైంది. కానీ సాక్షి విషయంలో ఇది మినహాయింపు అయింది.

ఇదిలా వుంటే సాక్షి ఆవిర్భావానికి చాలా ఏళ్లకు ముందే వెబ్ మీడియాగా గ్రేట్ ఆంధ్ర ఆవిర్భవించింది. అప్పటి వరకు వెబ్ మీడియాకు ఓ దశ, దిశ లేదు. ఇంకా అది కూడా ఓ మీడియా గా గుర్తింపు లేదు. దానికి ఓ లైనూ లెంగ్తూ లేదు. అలాంటి టైమ్ లో గ్రేట్ ఆంధ్ర వెబ్ మీడియాకు ఓ ట్రంప్లెట్ అన్నది తయారుచేయడమే కాదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు పోటీగా రాజకీయ వార్తలను అందించడం ప్రారంభించింది. సామాజిక భవ బంధాల మీడియాకు దీటుగా అసలు సిసలు రాజకీయ వార్తలు అందించడం ప్రారంభించింది. ఇది తెలుగుదేశం మద్దతు వర్గాలకు కంటకింపుగా మారింది. దీంతో వెబ్ మీడియాను కూడా సామాజిక బంధాల్లో చిక్కువేసేందుకు ఇబ్బడి ముబ్బడిగా వెబ్ మీడియా సంస్థలు ప్రారంభమయ్యాయి. కానీ ఇక్కడ మనుగడ అనేది పాఠకుల లెక్క మీద ఆధారపడి వుండడం, ప్రభుత్వాలతో పని లేకపోవడంతో వెబ్ మీడియా మీద సామాజిక బంధాలు సాధ్యం కాలేదు.

సోషల్ మీడియా టైమ్
సాక్షి వచ్చిన కాలంలోనే సోషల్ మీడియా కూడా పుంజుకోవడం ప్రారంభమైంది. ఇది మీడియాలో వచ్చిన అతి పెద్ద ఆవిష్కరణ. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూ ట్యూబ్, వెబ్ మీడియా తదితర సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లు రావడం అన్నది  ఓ సంఘటనను అన్ని కోణాల నుంచి విశ్లేషించి చూసే అవకాశం కలిగింది. పైగా డబ్బులు పెట్టి కొనే మీడియా అబద్దాలు ప్రచారం చేస్తుంటే, ఉచితంగా అందుబాటులోకి వచ్చే మీడియా నిజాలు చెప్పడం ప్రారంభించింది.

పోనీ అని కూడా నిజాలు కావు అనుకున్నా, కనీసం ఒక వార్తను భిన్న కోణాల్లోంచి దర్శించే, విశ్లేషించే అవకాశం కలిగింది. ఇది మీడియా రంగంలో అతి పెద్ద మార్పు. ముఖ్యంగా ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ల సంఖ్య చాలా పెరిగింది. 

ఫేస్ బుక్ ల్లో ఎవరికి  వారు స్వచ్ఛమైన లేదా వారి వారి భావాలకు అనుగుణమైన వార్తా వ్యాసాలు ప్రచారంలోకి తేవడం అనేది అలవాటుగా మారింది. ఓవార్త సామాజిక బంధాలు అన్నీ తగిలించుకున్న మీడియాలో ఓ మాదిరిగా వస్తే, ఇండిపెండెంట్ సోషల్ మీడియాలో దాన్ని అన్ని విధాల వైపు చూపించే వ్యవహారం ఎక్కువగా మారింది.

ఆదాయం, నమ్మకం రెండూ నష్టమే
అప్పటి వరకు తెలుగుదేశం ని, దాని అనుకూల వార్తలను చూసి వస్తున్న జనరేషన్ కు కొత్త అభిరుచులు అన్నీ కలిసి సాంప్రదాయంగా కాయిన్ కు వన్ సైడ్ చూపించుకుంటూ వచ్చిన మీడియాకు ఎదురుదెబ్బలు ప్రారంభమయ్యాయి.  సాక్షి వల్ల వ్యాపారపరమైన ఇబ్బంది వస్తే వచ్చింది కానీ, సోషల్ మీడియా వల్ల క్రెడిబులిటీకి ఇబ్బంది వచ్చింది. ఎప్పుడయితే క్రెడిబులిటీకి దెబ్బ తగిలిందో, అప్పటి నుంచి మీడియా ద్వారా నెరవేర్చుకోవాలనుకున్న సామాజిక వ్యక్తిగత ప్రయోజనాలకు దెబ్బతగిలింది. జనాలు తాము వండి వారుస్తున్న వార్తలు నమ్మడం లేదు అన్నది అతి పెద్ద దెబ్బ. దాని వల్లే చంద్రబాబును 2019లో మళ్లీ అధికారంలోకి నిలబెట్టడం అన్నది దెబ్బగా మారింది. దీనివల్ల ఆర్థికంగా గట్టి దెబ్బ తగిలింది.

సర్కుల్యేషన్ పరంగా నష్టం, నిర్వహణ వ్యయం పెరగడం, దీనికి తోడు ప్రభుత్వాల నుంచి రావాల్సిన ఆదాయం పడిపోవడం అన్నది కీలకం. ఓ సెక్షన్ ఆఫ్ మీడియాకు ప్రభుత్వంలో వున్న పెద్దలతో కలిగిన సఖ్యత కారణంగా పక్కదారిలో వచ్చే ఆదాయం ఇవన్నీ మాయం అయిపోయాయి. మోడీ, జగన్ ఇద్దరూ ప్రకటనల మీద పెద్దగా ఖర్చు పెట్టకపోవడంతో సామాజిక బంధాలు పెనవేసుకున్న తెలుగు మీడియాకు ఆర్థికంగా గట్టి దెబ్బనే తగిలింది.

కరోనా కష్టం
ఇలాంటి టైమ్ లో కరోనా విరుచుకుపడింది. పత్రికలను అన్ని విధాలుగా దెబ్బతీసింది. వ్యాపారాలు లేకపోవడంతో ఆ విధమైన ప్రకటనలు లేకుండా పోయాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగు మీడియాకు వందల కోట్ల ప్రకటనలు అప్పనంగా వచ్చి పడ్డాయి. అయిదేళ్ల పాటు ఆదాయానికి ఢోకా లేకుండా పోయింది. వైకాపా హయాం రావడం, కరోనా మీద పడడం, సర్క్యులేషన్ లేకపోవడంతో అన్ని విధాలా కష్టం అలుముకుంది. ఉద్యోగులను తొలగించే పరిస్థితి వచ్చింది.

నిజానికి సామాజిక బంధాలు పెనవేసుకున్న ఓ వర్గపు తెలుగుమీడియాకు ఇది ఆశనిపాతమైన సంగతి. ప్రింట్ మీడియానే కాదు. విజవల్ మీడియాదీ ఇదే పరిస్థితి, విజువల్ మీడియా మొదట్లో తెలుగుదేశంతో బంధాలు పెనవేసుకునే వుండేది. కానీ రాష్ట్రం విడిపోయాక రెండు బాటలు పట్టింది. అంతలో యాజమాన్యాలు మారడంతో, ఐడియాలజీ కూడా మారిపోయింది. మరోపక్క వెబ్ మీడియా కూడా స్వంతంత్ర పోకడలు పోవడం, వెబ్ మీడియాలో దేశం వ్యతిరేక భావాలు పెరగడం అన్నది కూడా ఓ అనూహ్య మార్పు.

కిం కర్తవ్యమ్?
ఇప్పుడు తెలుగు సామాజిక మీడియాకు దిక్కు తోచడం లేదు. సోషల్ మీడియా జనాల చేతుల్లో వుంది తమ చేతుల్లో వున్న విజువల్ మీడియా మూడు వంతులకు పైగా పరాయి జనాల చేతుల్లోకి పోయింది. ప్రింట్ మీడియా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఇలాంటి టైమ్ లో కాలానికి, కష్టానికి ఓర్చి నిల్చోవడం ఒక్కటే మార్గం. మిగిలిన దారి ఒక్కటే ఆంధ్రలో బతుకాలంటే తెలంగాణలో ఆయుష్షు నిలబడేలా చేసుకోవడం.

అందుకే ఇప్పుడు చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతాన్ని తెలుగు సామాజిక మీడియా తనది చేసుకుంది. తెలంగాణలో బుద్దిగా చేతులుకట్టుకుని కూర్చొవడం అన్నది పాలసీగా మారింది. తెలంగాణ లో బుద్దిగా చేతులు కట్టుకు కూర్చోవడం అన్నది దశాబ్దాల కాలంగా చేసిన పాపాలకు పాయశ్చితంగా కనిపిస్తోంది. కానీ ఈ సామాజిక బంధాల మీడియాను నమ్మడానికి లేదే. అందితే జుట్టు అన్న సామెతను ట్యాగ్ లైన్ గా చేసుకున్న మీడియా ఇది. 2019 ఎన్నికల ముందు తెలంగాణలో ఇదే మీడియా చేసిన హడావుడి తెలియంది కాదు. తెలంగాణలో రాజకీయ ఈక్వేషన్లు మారుతున్నాయి అని ఏమాత్రం అనిపించినా, ఇదే మీడియా తన నిజరూపం చూపించడం ఖాయం. మళ్లీ 2019 మాదిరిగా 2024 నాటికి ప్రభుత్వాన్ని మార్చడానికి తన వంతు కృషి చేయడం అనివార్యం.

కానీ సమస్య ఒక్కటే 2024 నాటికి సోషల్ మీడియా ఇంకా బలపడుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంకా వీక్ అవుతుంది. జనాల ఆలోచనా ధోరణి ఇంకా విస్తృతం అవుతుంది. ఇప్పటికే అనేక రూపాల్లో వున్న సామజిక మీడియా మూసివేత దిశగా సాగుతుంది. మొత్తం మీద మూడు నాలుగు దశాబ్దాలుగా తెలుగునాట పరిఢవిల్లుతున్న సామాజిక మీడియాకు ముగింపు దశ ప్రారంభమైందనుకోవాలి.

చాణక్య
[email protected]