ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన మూడు రాజధానుల అంశంపై త్వరలోనే క్లారిటీ రాబోతోంది. ఈ మేరకు ఈరోజు కీలక ఘట్టం చోటుచేసుకుంది. సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుల్ని గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపించింది ప్రభుత్వం.
శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి నిన్నటితో నెల రోజులు పూర్తయింది. కాబట్టి రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇక ఆ బిల్లుల్ని గవర్నర్ వద్దకు పంపించొచ్చు. ప్రభుత్వం అదే పని చేసింది. ఇప్పుడు ఈ కీలకమైన అంశం గవర్నర్ చేతికి వెళ్లింది.
బిల్లులపై గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే.. మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా ఊపందుకుంటుంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్ ఏర్పాటుదిశగా పనులు మరింత ముమ్మరం అవుతాయి. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతం దృష్ట్యా ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
గవర్నర్ చేతిలో 3 ఆప్షన్లు
రాజ్యాంగపరంగా గవర్నర్ చేతిలో బిల్లు ఆమోదానికి సంబంధించి మూడు ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో ఒకటి అందరికీ తెలిసిందే. ప్రభుత్వం పంపించిన బిల్లును నేరుగా ఆమోదించడం. దాదాపు 99శాతం బిల్లులకు సంబంధించి, 99శాతం సందర్భాల్లో గవర్నర్లు ఇదే నిర్ణయం తీసుకుంటారు.
కీలకమైన లేదా వివాదాస్పదమైన బిల్లులకు సంబంధించి గవర్నర్ దగ్గర రెండో ఆప్షన్ ఉంది. తన అభ్యంతరాల్ని చెబుతూ.. బిల్లుల్ని మరోసారి ప్రభుత్వానికి తిరిగి పంపించొచ్చు. అయితే ఇలా చేయడం వరకు మాత్రమే గవర్నర్ కు అధికారం ఉంది. రెండోసారి అదే బిల్లులు రాజ్ భవన్ కు చేరితే మాత్రం తప్పనిసరిగా గవర్నర్ ఆమోదించాల్సిందే.
ఇక గవర్నర్ చేతిలో మూడో ఆప్షన్ కూడా ఉంది. అదే న్యాయ సలహా. నిర్ణయం తీసుకోవడంలో సందిగ్ద పరిస్థితి తలెత్తినప్పుడు గవర్నర్ న్యాయ సలహా కోరవచ్చు. ఈ మేరకు ఆయన అటార్నీ జనరల్ తో సంప్రదింపులు జరపొచ్చు. గవర్నర్ ఈ ఆప్షన్ ఎంచుకుంటే బిల్లుల ఆమోదానికి మరింత సమయం పట్టొచ్చు. ఎందుకంటే దీనిపై న్యాయ నిపుణులతో కమిటీ వేసే అధికారం అటార్నీ జనరల్ కు ఉంది.
ప్రభుత్వం ఏం చెబుతోంది..
సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై ప్రభుత్వం ముందు నుంచి మొండి వైఖరితో ఉంది. అయితే ఎంత మొండిగా ఉందో అంతే వ్యూహాత్మకంగా కూడా వ్యవహరిస్తోంది. శాసనసభలో పూర్తి ఆమోదం పొందిన ఈ బిల్లుల్ని తొలిసారి మండలిలో ప్రవేశపెట్టినప్పుడు తిరస్కారానికి (టీడీపీకి మెజారిటీ ఉంది కాబట్టి) గురయ్యాయి.
అయితే ఇదే బిల్లును రెండోసారి మండలిలో ప్రవేశపెడితే తిరస్కరించడానికి మండలికి అధికారం లేదు. మొన్నటి సమావేశాల్లో ప్రభుత్వం అదే పని చేసింది. తెలివిగా బిల్లుల్ని మరోసారి టేబుల్ పైకి తీసుకొచ్చింది. బిల్లులు టేబుల్ పైకి వస్తే చాలు.. దానిపై చర్చ జరిగినా, జరగకపోయినా, మండలి తిరస్కరించినా అవి ఆమోదం పొందినట్టే. మండలి అధికారాలు అంతవరకే.
అందుకే తెలివిగా.. రాజ్యాంగంలోని 197 ఆర్టికల్, క్లాజ్-2 నిబంధన ప్రకారం బిల్లుల్ని ఆమోదించినట్టు తెలుపుతూ గవర్నర్ కు లేఖ రాసి మరీ బిల్లులు పంపించారు. బిల్లుల ఆమోదం,
వివాదాలకు సంబంధించి కూడా గవర్నర్ కు పూర్తి అవగాహన కల్పిస్తూ, వివరాలు అందించింది ప్రభుత్వం. అంతేకాదు.. దీనిపై గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య చర్చ కూడా జరిగిన సంగతి తెలిసిందే..
ప్రతిపక్షాలు ఏం అంటున్నాయి..
టీడీపీ మాత్రం మూడు రాజధానుల బిల్లుపై ఇంకా సెలక్ట్ కమిటీ అంశాన్నే పట్టుకొని వేలాడుతోంది. బిల్లును సెలక్ట్ కమిటీకి సిఫార్స్ చేసినప్పుడు గవర్నర్ కు ఎలా పంపిస్తారని అడ్డగోలుగా ప్రశ్నిస్తోంది. అసలు సెలక్ట్ కమిటీ అనేదే ఓ ప్రహసనంగా మారిన నేపథ్యంలో ఇంకా దాన్ని పట్టుకొని ఊగుతోంది తెలుగుదేశం పార్టీ.
ఇది చాలదన్నట్టు తాజాగా యనమల మరో కొత్త పాయింట్ ఎత్తుకున్నారు. బిల్లుల ఆమోదం విషయంలో అటార్నీ జనరల్ సలహా తీసుకోవాలని ఏకంగా గవర్నర్ కే సలహాలు ఇస్తున్నారు. దీని వెనక మతలబు ఏంటనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. గవర్నర్, అటార్నీ జనవర్ ను ఆశ్రయిస్తే మరికొన్ని రోజులు కాలయాపన తప్పదు. టీడీపీ కోరుకుంటోంది కూడా ఇదే కదా.
ఆ పార్టీ చెబుతున్న మరో లాజిక్ ఏంటంటే.. ఆల్రెడీ కోర్టులో రాజధాని అంశంపై కొన్ని కేసులు ఉన్నాయని, మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ప్రజలకు బిల్లుల ఆమోదం అస్సలు ఇష్టం లేదని చెబుతోంది. పైగా టైమ్ చూసి శివరామకృష్ణన్ నివేదికను తెరపైకి తీసుకొచ్చింది. నివేదికలో ఒక రాజధాని అని మాత్రమే చెప్పారంటూ వితండవాదం చేస్తోంది.పైగా ఈ అంశం కేంద్రానికి, రాష్ట్రపతికి సంబంధించినదిగా అది చిత్రీకరిస్తోంది.
మొత్తమ్మీద టీడీపీ కుయుక్తులు, కోర్టు కేసులు, దొంగ నిరసనలు, అసత్యపు కథనాల్ని దాటుకొని మూడు రాజధానుల బిల్లు గవర్నర్ చెంతకు చేరింది. మరి దీనిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నానేది ఇప్పుడు చర్చనీయాంశం.