దాదాపు రెండేళ్ల కిందటి సంగతి.. రంగస్థలంలో హీరోయిన్ గా ముందుగా అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నారు. అంతా ఓకే, ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకున్న టైమ్ లో ఆఖరి నిమిషంలో ఆమెను తప్పించారు. దీనిపై అప్పట్లో అనుపమ బాగా హర్ట్ అయింది. పరోక్షంగా చురకలంటిస్తూ ఓ పెద్ద ట్వీట్ కూడా పెట్టింది.
ఆ వెంటనే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా స్పందించారు. తమ రాబోయే సినిమాల్లో అనుపమకు కచ్చితంగా ఓ ఛాన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇది జరిగి రెండేళ్లు దాటుతోంది. ఈ రెండేళ్లలో మైత్రీ నుంచి చాలా సినిమాలొచ్చాయి. కానీ ఏ ఒక్క మూవీలో అనుపమకు మాత్రం చోటు దక్కలేదు. సాయితేజ్ హీరోగా మైత్రీ వాళ్లు తీసిన చిత్రలహరి సినిమా కోసం అనుపమ పేరు అప్పట్లో గట్టిగా వినిపించింది. కానీ అందులో కూడా ఆమె లేదు.
ఇప్పుడిదంతా ఎందుకంటే, తాజాగా ఈ బ్యానర్ పై మరో మూవీ ప్రకటన రెడీ అయింది. నాని హీరోగా రేపు కొత్త సినిమా ప్రకటించబోతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించి కూడా ఆమధ్య అనుపమ పరమేశ్వరన్ పేరు గట్టిగా వినిపించింది. ఇప్పుడేమో రష్మికను తీసుకుంటారనే ప్రచారం నడుస్తోంది.
పరిశ్రమలో నోటి మాటలు, నీటి మూటలు ఒకటే అంటారు. అనుపమకు సంబంధించి అప్పట్లో మైత్రీ నిర్మాతలు చేసిన ప్రకటన కూడా ఇలాంటిదేనేమో.