మైత్రీ-ఎనిమిదేళ్లలో తొలిసారి

టాలీవుడ్ లో టాప్ బ్యానర్ ఏదీ అంటే మైత్రీ అని సమాధానం వస్తుంది. అందులో సందేహం లేదు. పైగా మైత్రీ ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్స్ మీద వున్నన్ని గ్యాసిప్ లు మరే సంస్థ మీదా వుండవు.…

టాలీవుడ్ లో టాప్ బ్యానర్ ఏదీ అంటే మైత్రీ అని సమాధానం వస్తుంది. అందులో సందేహం లేదు. పైగా మైత్రీ ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్స్ మీద వున్నన్ని గ్యాసిప్ లు మరే సంస్థ మీదా వుండవు. ఎవరికి తోచింది వారు మాట్లాడేసుకుంటూ వుంటారు. ప్రకాశం జిల్లా మైనింగ్ వ్యాపారి డబ్బులు వున్నాయంటారు. 

ఉత్తరాంధ్ర లో ఓ కీలకపార్టీ నాయకుడి డబ్బులు వున్నాయంటారు. ఓ న్యూస్ ఛానెల్ అధినేత పెట్టుబడులు పెట్టారంటారు. అన్నింటికీ మించి అమెరికాలో వున్న మన తెలుగు ఎన్నారై లు చాలా మంది పెట్టుబడులు పెట్టారంటారు.

ఇవన్నీ ఎంత వరకు నిజమో, ఏది నిజమో మైత్రీ అధినేతలకు తప్ప మరెవరికీ తెలియదు. ఏనాడో ఎనిమిదేళ్ల క్రితం సడెన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రభాస్, పవన్, మహేష్, ఇలా టాప్ హీరోలు అందరికీ అడ్వాన్స్ లు ఇచ్చారు. మాంచి హిట్ సినిమాలు అనేకం తీసారు. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా పేరు మారుమోగి పోయింది. పుష్ప 2 మీద భారీ అంచనాలు వున్నాయి. సల్మాన్ తో సినిమా అని టాక్ వుంది. ఇంకా చాలా చాలా వార్తలు వున్నాయి.

కానీ ఈ ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా ఐటి రైడ్ అన్నది మైత్రీ కి పరిచయం లేదు. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నో సంస్థల మీద రైడ్ లు జరిగాయి కానీ మైత్రీ మీద కాదు. తొలిసారి ఇప్పుడు రైడ్ జరగడంతో విపరీతంగా వార్తలు మరోసారి వినిపించడం ప్రారంభమైంది. విదేశాల నుంచి తెచ్చిన పెట్టుబడులే కీలకం అంటూ, అన్ని వందల కోట్లు, ఇన్ని వందల కోట్లు అంటూ వార్తలు వచ్చేసాయి.

కానీ గమ్మత్తుగా మైత్రీతో అసోసియేట్ అయి వున్న దర్శకుడు సుకుమార్ కు కూడా ఐటి సెగ తప్పలేదు. సుకుమార్ రైటింగ్స్ పేరుతో ఆయన చాలా సినిమాలు సమర్పిస్తున్నారు. దాంతో ఇప్పుడు ఆయన మీద కూడా ఐటి దృష్టి పడింది. సుకుమార్ రైటింగ్స్ తో భాగస్వామి అయి సినిమాలు తీసిన నిర్మాతలను, సుకుమార్ బంధువులను కూడా ఐటి అధికారులు పిలిపించినట్లు తెలుస్తోంది.

మొత్తం మీద ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మైత్రీ-సుకుమార్ ఐటి రైడ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. దర్శకులు వాళ్ల పని వాళ్లు చేసుకోకుండా ఇలా నిర్మాణాల్లో దిగడం వల్లే ఐటి కి టార్గెట్ అవుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఇటీవలే నిర్మాతగా మారారు. ఆయన భార్య సాయి సౌజన్య పేరుతో పలు సినిమాల్లో భాగస్వామ్యం తీసుకున్నారు.పలు సినిమాలు వచ్చాయి. మరి కొన్ని రాబోతున్నాయి. లెక్కలు రెడీగా వుంచుకోవడం బెటర్ ఇకపై దర్శకులు కూడా. ఎందుకంటే చాలా మంది దర్శకులు నిర్మాణ భాగస్వాములుగా మారుతున్నారు కదా?