తన సినిమాలు అన్నింటిలీ బెస్ట్ క్లయిమాక్స్ వున్న సినిమా ఇదేనని దర్శకురాలు నందినీ రెడ్డి అన్నారు. అన్నీ మంచి శకునములే సినిమా ఈవారం విడుదలవుతున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
సినిమాలో చివరి ఇరవై నిమిషాలు ప్రేక్షకులకు చాలా కాలం గుర్తుండిపోయేలా వుంటుందన్నారు. ఈ ఇరవై నిమషాల్లో హీరో సంతోష్, ప్లస్ మిగిలిన వారు ఎలా చేసారు అన్నది తాను చెప్పనని, సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెబుతారని ఆమె అన్నారు. ఓ బేబీ సినిమా క్లయిమాక్స్ లో ప్రతి పాత్ర మాట్లాడుతూనే వుంటుందని, ఈ సినిమాలో అలా కాదని అన్నారు.
సినిమా తొలిసగం అంతా ఒక ఎత్తు, మలిసగం మరో ఎత్తు అని నందినీ రెడ్డి వివరించారు. ఈ సినిమాలో గతంలో వచ్చిన మరే సినిమాకు పోలిక లేదన్నారు, ఇంత బరవైన పాత్రను హీరో సంతోష్ శోభన్ ఎలా చేసాడా అన్న అనుమానం అక్కరలేదని, సినిమా చూసిన తరువాత ప్రతి ఒక్కరికి అర్థం అవుతుందని అన్నారు. సినిమా చూసిన తరువాత కేవలం హీరో పాత్ర మాత్రమే కాకుండా, సినిమాలోని ప్రతి పాత్ర గుర్తుండిపోతుందన్నారు.
అన్నీ మంచి శకునములే స్క్రిప్ట్ విషయంలో ఎవరి జోక్యం, ప్రభావం లేదని, సినిమా పూర్తయిన తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ చూసి, చిన్న చిన్న డిటైలింగ్ కరెక్షన్స్ మాత్రం చెప్పారని నందినీ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు సినిమాను చాలా మంది చూసారని, చూసిన వారంతా ప్రశంసలు కురిపించారని, ముఖ్యంగా సెన్సారు నుంచి మాంచి ప్రశంసలు లభించాయని నందినీ రెడ్డి అన్నారు.